తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 172

ఆమె కోసం ఆ ఆచారాన్ని సైతం ఒదులుకోవడానికి సిద్దపడడం ఆమెపట్ల ఎంత ఆరాధన వుందో తెలియజేస్తుంది. ఆమె నేను కావడం అదృష్టంగానే అనుకోమంటావా?” చివరికొచ్చేసరికి కొంటెగా అడిగింది. వర్ష మనసు తెలిసిపోవడంతో సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి దగ్గరలో ఆధారం దొరికినట్లయింది. అతని ఆనందానికి అవధుల్లేవు. జీవితంలో తొలిసారిగా అతను అలాంటి స్థితిని అనుభవిస్తున్నాడు. ఇక ఆమెను ఎక్కడికీ పోనివ్వకూడదన్న కామనతో అలాగే ముందుకు కదిలి కుడిచేయి పట్టుకున్నాడు. ఏదో మధురమైన పులకింత ఇంతకాలం శరీరానికి కలిగిన గిలిగింత- ఇప్పుడు మనసుకు కలిగింది.

ఆ బేధాన్ని అతను గుర్తించగలిగాడు. అప్పుడు చూశాడు అతను ఆమె చేతిలోని క్యారియర్ ని తన కోసం తన క్షుద్భాద తీర్చడం కోసం గ్రామమంతా తృణీకరించి తనకోసం క్యారియర్ పట్టుకు వచ్చిన ఆమెను నీళ్ళు నిండిన కళ్ళలో చూస్తూండి పోయాడు. అతన్ని ఆ స్థితిలో చూడడం ఇష్టంలేనట్టు ఆమె ఎంతో చొరవతో కన్నీళ్ళు తుడిచి “ముందు భోజనం” అంటూ చేయిపట్టుకుని లోనికి రమ్మన్నట్టు లాగింది. అతను మౌనంగా అనుసరించాడు. వెంకట్రామయ్య చలిజ్వరం వచ్చినవాడిలా వణికిపోతున్నాడు. పెద్ద అగ్నిపర్వతం పగిలి లావా అంతా తనను ముంచేస్తున్నట్టు అతను క్రుంగి పోతున్నాడు.

కనుచూపు మేర కనిపించే కొండ పగిలి, ముక్కలై తన సమాధికి రాళ్ళు పేర్చుతున్నట్లు భయపడిపోతున్నాడు. సముద్రం ఓ పెద్ద కెరటమై కత్తుల్ని గుచ్చుకుని తన మీదకు లంఘించుకున్నట్లు వణికిపోతున్నాడు. పంతులుకి ఈ రహస్యాలు ఎలా తెలిశాయో ఆయనకు అంతుబట్టడం లేదు. అలా గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయాడు. పులిరాజు కయితే అక్కడి నుంచి బలంకొద్దీ పరిగెత్తాలని వుంది. అటూ ఇటూ చూశాడు. కత్తుల బోనులా జనం నిలబడి వుండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. జనం పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి.

దేవుడు గొంతు సవరించుకుని చెప్పాడు. “జమీందారు వంశాన్ని పతనం చేయడమే కాకుండా వూరికి పెద్ద దిక్కు కావాలన్న దురాశతో, తానే జమీందారుగా అధికారం చెలాయించాలన్న దురహంకారంతో గోపాలకృష్ణ ముష్టిదాని కొడుకుని అమావాస్య రోజు నాటకం ఆడాడు. ఈ నాటకంలో మిగిలిన పాత్రధారులు ఇద్దరు వాళ్ళెవరో మీకు తెలుసు. ఒకరు పులిరాజయితే, రెండో వ్యక్తి మోహన.” అంతవరకూ ఉక్కగా వుందని పైట తీసేసివున్న మోహన ఠక్కున పైట అందుకుని భుజం చుట్టూ బిగించింది. భయంతో ఆమె కళ్ళు సుడిగాలిలో అల్లాడుతున్న దీపాల్లా తయారయ్యాయి. అప్పటికే తేరుకున్నాడు వెంకట్రామయ్య స్వయంగా దేవుడే చెబుతుంటే జనం ఎలా రియాక్టవుతారో అతనికి బాగా తెలుసు.

Updated: May 28, 2020 — 10:44 am