తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది 174

ఆమె ఠక్కున ఆగి- “ఏం? ఊరులోని ఆడపిల్లలు చాలక నా వెంట పడ్డావా?” అసహ్యాన్నీ, జుగుప్సనీ కళ్ళల్లో స్పష్టంగా ప్రదర్శిస్తూ అడిగింది. కొరడాతో ఛళ్ళున చరిచినట్టు మనసంతా మడతలు పడిపోయి నట్లనిపించింది అతనికి. “ఛీ! ఛీ! అలా కాదు. మీతో పర్సనల్ గా మాట్లాడాలని” అంతకంటే మించి మాటలు దొర్లలేదు. ఏదో తెలియని జంకు ఆమె అంటే వున్న ఎనలేని గౌరవం భయంగా పరావర్తన చెంది కళ్ళల్లో తేలుతోంది. “మాట్లాడాలా? ఏమిటి? నిర్లక్ష్యంగా అడిగింది. “నేను….. నేను……” అతను గొణుగుతున్నాడు. “చెప్పండి” రెట్టించింది ఆమె. “మీరంటే నాకెంతో ఇష్టం.” అప్పుడొచ్చింది నవ్వు ఆమెకు. బాగా తాగుబోతూ ‘నేను ఈరోజు నుంచి పూర్తిగా ముందు ఆపేశానంటే’ ఎలా నవ్వుతామో అలా నవ్వింది ఆమె. ఆ నవ్వులోని పరిహసాన్ని అతను గుర్తించాడు. అందుకే తప్పు చేసిన వాడిలా, అలా అనడానికి తను అనర్హుడేమోనన్న భావనతో తల వంచుకున్నాడు.

“ఛీ! ఛీ! సినిమాకు రావాలంటే ఇదే విసుగు. ఆకతాయి కుర్రాళ్ళంతా ఠంచనుగా రడీ అయిపోయి వుంటారు” అంది ధవళ అబ్బాయిల్ని చూస్తూనే నా చెవులో. “ఆ భాస్కర్ చూడు- ఏం స్టయిల్ గా వున్నాడో, ఏజీ బియస్సీ చదివాడు గానీ హుందాగా ప్రవర్తించాలని తెలీదు. సాయంకాలమైతే సినిమాకు తయారు.” అతను మాకు బావ వరసవుతాడు. అంతమంది అబ్బాయిల ముందు నడుస్తుంటే నాకు తెలియకుండానే అడుగులు తడబడ్డాయి. మిగిలినవాళ్ళు పరిస్థితి కూడా అంతే. అయితే ధవళ మాత్రం అక్కడ అబ్బాయిలు లేనట్టే చాలా నిర్లక్ష్యంగా నడిచింది. నాకూ అంత ఒద్దికగా వుండాలనిపించింది గానీ వీలుకావడం లేదు. వెనుక వస్తున్న అబ్బాయిలు మాకు వినపడేటట్లు ఏవేవో జోక్ లు వేస్తున్నారు. భాస్కర్ అయితే మరీ రెచ్చిపోతున్నాడు.

ధవళ మాత్రం అబ్బాయిల జోక్ లు పట్టించుకోకుండా తను ఏదేదో మాట్లాడుతోంది గానీ నేను వినటం లేదు. నా చెవులు వెనక్కి మళ్ళి అబ్బాయిల జోక్ లను వినటానికే ప్రయత్నిస్తున్నాయి. ధవళలా ఎలాంటి ఆవేశం, ఉద్రేకం లేకుండా మేము వుండలేకపోతున్నాం. అంతలో టూరింగ్ టాకీసు వచ్చింది. జనం పెద్దగా లేరుగానీ ఫరవాలేదు అన్న స్థాయిలో వున్నారు. సినిమా బిగిన్ కావటానికి ఇంకా టైము వుంది. బయట నిలుచున్నాం. అంతలో వనజ వాళ్ళ అన్నయ్య లోపలికి వచ్చాడు. నన్ను చూసి ఎప్పుడొచ్చావని పలకరించాడు.

Updated: May 28, 2020 — 10:44 am