నేను బాకీ వుంది ఆయనకే 1 196

“ఎవరూ లేరు. ఇంటికి నేనొక్కడ్నే వారసుడ్ని.”

” అయితే నీకు తోడుగా ఇక్కడే వుండిపోతా” క్షణంలో స్నేహం చేయడం, ఎదుటివాడ్ని ప్రేమించటం అతని సహజలక్షణం. అందుకే ఆ పాటి పరిచయంలోనే అడిగాడు.

“అలానే”

అర్జున్ ఖుషీ అయిపోయాడు.

“పట్టణాలు బోరు కొట్టాయి గురుడా….. ఆఁ మన స్నేహం మొదలైంది కనుక నేను నిన్ను ‘గురుడా’ అని పిలుస్తాను. సరేనా? ఆఁ ఏమిటి చెబుతున్నాను. పట్టణాలు బోరుకొట్టాయని గదూ. అక్కడంతా మోసం. పైసాయే పరమాత్మ. అందుకే విసుగుపుట్టి ఇలా పల్లెటూర్ల మీద పడ్డాను. నా అదృష్టం కొద్దీ నీలాంటి గొప్ప మిత్రుడు తగిలాడు, నేను ఇక్కడే వుంటూ నీ పనుల్లో నీకు సహాయకారిగా వుంటాను. వ్యవసాయపు పనులు తెలియవనుకో కానీ నేర్చుకుంటాను.”

“కానీ నాకు వ్యవసాయం లేదే.”

“మరి నీ భుక్తి?”

“ఇప్పుడు చూశావు కదా. అలాగే రోజూ క్యారియర్ వస్తుంది.”

“రోజూ ఎవరు పంపిస్తారు క్యారియర్ ని?”

“గ్రామస్థులు.”

“గ్రామస్థులా? ఎందుకు?”

“అదో పెద్ద కథలే!”

“చెప్పు గురుడా. ఇక్కడే వుండిపోతానన్నాను గదా! మరి నీ గురించి నాకు తెలియద్దూ. వ్యవసాయం లేకపోతే ఇంకేమైనా ఆదాయం వుందా?”

“లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనూ నీలాగా అనాధనే అర్జున్ . కాకపొతే ఈ ఊర్లో వున్నా ఓ ఆచారం వల్ల రాజభోగాలు అనుభవిస్తున్నాను. అంతే మనిద్దరికీ తేడా.”

“ఏమిటా ఆచారం?”

“మొత్తం చెబుతాలే. మాడి మదనకామరాజు వంశం. ఈ ఊరికి మేము జమీందారులం. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోని పొలాలన్నీ మావే. అంటే ఈ ఊరికి మేం రాజులం అన్నమాట. మామాటే వేదం ఇక్కడ. అయితే భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి మా నాన్న చనిపోయాక.”

“మీ నాన్న చనిపోయాడా?” నరుడు బాధతో ప్రశ్నించాడు.

“ఆఁ! నేను సిటీలోని ఓ హాస్పిటల్ లో పుట్టాను ప్రసవం అయ్యాక అమ్మను, నన్నూ కార్లో ఇంటికి తీసుకొస్తున్నారు నాన్నగారు. అప్పుడు ఎదురుగ్గా వస్తున్న ఓ లారీ మా కారును గుద్దేసింది. ఆ యాక్సిడెంట్ లో అమ్మా, నాన్న చనిపోయారు. నేను కొన్ని రోజుల పసిగుడ్డుని. నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. వెనుకనే మా దివాను, మరికొంతమంది పనిమనుషులూ మరోకారులో వస్తున్నారు. యాక్సిడెంట్ లో బతికున్న నన్ను ఎత్తుకున్నారు. అలా నేను అనాధనైపోయాను.”