నేను బాకీ వుంది ఆయనకే 1 196

“ఏం పని లేదు కదా. అందుకే పుస్తకాలు చాలానే వున్నాయి. నిల్చుని చెప్పాడు గోపాలకృష్ణ.

“గురుడా! పెళ్ళి చేసుకోలేకపోయావా? ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడివే వుండడం భరించలేని నరకం.”

“పెళ్ళి ఆలోచన యిప్పటికి రాలేదు. ఇక నాకు ఎక్కడి వంటరితనం! నువ్వు తోడున్నావుగా” అంటూ అర్జున్ మీద అతను ఆప్యాయంగా చేయి వేశాడు.

* * *

ఇద్దరూ ఇంటిబయటకి వచ్చి కొండమీద కూర్చున్నారు. ఊరు వెన్నెల్లో గ్లాసు బిగించిన చిత్రపటంలా వుంది. పక్కనున్న దేవాలయం ఇసుకలో పెట్టిన గూడులా వుంది.

“ఏం దేవాలయం అది?”

“మన్మథ దేవాలయం”

“మన్మథ దేవాలయమా?” బిగుసుపోయాడు నరుడు.

కాసేపటికి తేరుకున్నాక అన్నాడు “అదేమిటి గురుడా! ఎక్కడయినా రామాలయం, కృష్ణాలయం వుంటాయిగానీ, ఇదెక్కడి చోద్యం? శృంగార దేవుడికి దేవాలయం వుండడం నేను ఇంతవరకు వినలేదు.”

“అదే మరి మా ఊరి స్పెషాలిటీ. ముక్తికి మార్గం భక్తీ, రక్తీ అన్నారు పెద్దలు. మేం రెండవది ఎంచుకున్నాం. అంతే తేడా. ఇంకో విచిత్రం చెప్పనా? ఆ దేవాలయంలోకి వెళ్ళి దేవుడ్ని దర్శించుకోవాలంటే స్త్రీలు పైట తీసి బొడ్లో దోపుకుని వెళ్ళాలి. పురుషులు తమ కండువాలనూ. తువ్వాళ్ళనూ మొలలకు చుట్టుకోవాలి. అంటే టాప్ లెస్ అన్నమాట. ఇది దేవాలయంలో ఆచరణలో వున్న పద్ధతి.”

అర్జున్ అలా నోరు తెరిచి వింటూ వుండిపోయాడు.

“ఎందుకంత ఆశ్చర్యపోతావ్? ఆ వెంకటేశ్వరస్వామి దగ్గిరికి వెళ్ళినవాళ్ళు గుండు గీయించుకుంటున్నారు గదా. ఎందుకనుకుంటున్నావ్? తన అహం తగ్గాలని. అలానే, ఇక్కడ పైన అచ్ఛాదానా లేకుండా వెళ్ళి దేవుడ్ని దర్శించు కుంటారు మోహం తగ్గాలని. అఫ్ కోర్స్ స్త్రీలు రావికెలు వుంచుకోవచ్చు. కేవలం పైట తీసేయ్యాలి.”

“ఆహా! మీ ఊరు బ్రహ్మాండం గురుడా. ఇలాంటి ఊరును నేను ఇంతవరకు కనలేదు, వినలేదు.”

“ఇప్పుడు కన్నావు గదా” అని నవ్వాడు గోపాలకృష్ణ.

“రేపటినుంచీ నేనూ మన్మథదేవుడ్ని కొలుస్తాను. ఛాన్స్ దొరికితే రక్తి, లేదంటే ముక్తి.”

“జాగ్రత్త. పరువాలవైపు చూశావంటే జనం వళ్ళు చీరేస్తారు” అని నవ్వుతూ హెచ్చరించాడు అతను.

అర్జున్ అటూ ఇటూ చూస్తూ “అబ్బ వెన్నెల భలే వుంది గురుడా. ఇలా వెన్నెలను చూసి ఎంత కాలమైందో. ఆ టౌన్ లో ట్యూబ్ లైట్ల కాంతి తప్ప వెన్నెల కనిపించదు.”

“వెన్నెల ఈరోజు అద్భుతంగా వుంటుంది- పౌర్ణమి కదా.”

ఒక్కక్షణం చిన్న జర్క్ యిచ్చాడు నరుడు. గోపాలకృష్ణవైపు తిరిగి “అంటే ఈరోజు…..” ఆపై మాట్లాడలేకపోయాడు.

అతని కళ్ళముందు ఓ అమ్మాయి సిగ్గుబరువుతో, రేపటినుంచి తనకూ, తన కుటుంబానికి పట్టబోయే అదృష్టాన్ని తలుచుకుంటూ కొండ ఎక్కి రావడం సాక్షాత్కరించింది.