నేను బాకీ వుంది ఆయనకే 1 196

“వారు గోపాలకృష్ణ? మీకు కాబోయే భర్తా” అంటూ చిలిపిగా చూస్తూ అడిగింది వర్ష శివరామయ్య కనుమరుగు కాగానే.

ధాన్య పడీ పడీ నవ్వింది. కొంతసేపటికి బలవంతంగా నవ్వాపూకుని గోపాలకృష్ణ నాక్కాబోయే భర్త కాదు. ఈ గ్రామంలో మదనకామరాజు వంశానికి చెందిన పురుషుడు, ఆయనతో పౌర్ణమి రోజు గడిపితే” అంటూ ప్రారంభించి మొత్తం ఆచారం గురించి చెప్పింది.

వింటున్న వర్షకు మతిపోయింది. హెడ్ మాస్టర్ తన చేతికి ట్రాన్స్ పర్ ఆర్డర్స్ ఇస్తూ ఈ గ్రామం గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

ఆమె చాలాసేపటివరకూ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది

ఆ పౌర్ణమి రోజు పరమానందం ఇంట్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కారణం ఆయన పెద్దకోడలైన లహరికి గోపాలకృష్ణ దగ్గర్నుంచి పిలుపొచ్చింది.
రేపటినుంచి తమ ఇంటి రూపురేఖలే మారిపోతాయని అనుకుంటూ తనకు రానున్న సిరిసంపదల గురించి కలలు కనడంతోనే ఆ ఇంటిల్లిపాదికీ సరిపోతోంది. అందరూ ఏదో ట్రాన్స్ లో వున్నట్లు కనిపిస్తున్నారు.

“మన్మధ దేవుడా! మా మొర ఇంత కాలానికి ఆలకించి గోపాలకృష్ణ నుంచి కబురొచ్చేట్టు చేశావయ్యా” అని పరమానందం ప్రతి అయిదు నిముషాలకో మారు తూర్పుకొండకేసి చూస్తూ నమస్కారాలు పెడుతున్నాడు.

లహరిని గోపాలకృష్ణ ఆ రాత్రికి రమ్మన్నాడని వినగానే పరమానందం రెండో కోడలు పద్మ తన భర్తను గదిలోకి లాక్కెళ్ళి “ఆ వగలాడికి పిలుపొచ్చింది. మనం ఒకే ఇంట్లో వున్నా వేరు వేరుగా వుంటున్నాం కదా. కొంపదీసి సిరి సంపదలన్నీ మీ అన్నకే వస్తాయేమో. అవునూ గోపాలకృష్ణ ఈ పిల్లను ఎన్నుకున్నాడేమిటి? ఏదో చూడటానికి కనుముక్కు తీరుబాగానే వుంటుందిగానీ ఒంటిమీద కండ ఎక్కడిదీ? అదే నన్ను చూడండీ…. వన్నె కాస్త తక్కువయినా వయసు బరువులకేం తక్కువలేవు. అప్పటికీ గోపాలకృష్ణ ఎదురుపడ్డప్పుడంతా బరువులన్నీ కనపడేటట్లు చూసుకున్నాను. కానీ ఛాన్స్ నాకు రాలేదు. ఏమిటో అతగాడి టేస్ట్” అని మూతిని మూడు వంకరలు తిప్పింది.

అదే సమయంలో పరమానందం చిన్నకోడలు చిత్ర తన భర్తతో చెబుతోంది. “ముప్ఫై ఏళ్ళదాన్ని సెలక్ట్ చేసుకున్నాడేమిటి గోపాలకృష్ణ? అయినా ఆ కులుకులాడి అంత వయసున్నదానిలా కనిపించదనుకో. ముసలాడికి దసరా పండగన్నట్టు మీ పెద్దన్నయ్యకు కలిసొచ్చింది అదృష్టం. తనకంటే సగం వయసున్న దానిని కట్టుకుని వేగలేక ఛస్తున్న ఆయనకు రేపటి నుంచి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయేమో! నిండా ఇరవై రెండేళ్ళు కూడా లేని నన్ను పిలవలేదేమిటి చెప్మా.”

“ఇంకానయం. నీ వయసు పదహారేళ్ళే అనలేదు” చిత్ర భర్త వ్యంగ్యంగా అన్నాడు.

“నేను అబద్ధం చెబుతున్నానంటారా? నా డేట్ ఆఫ్ బర్త్ ఎంతనుకున్నారు?”

“ఎంతయినా వుండనీ. నువ్వు చూడడానికి మాత్రం మా వదినకంటే పెద్దదానిలా కనిపిస్తావ్.”

దాంతో కోపం వచ్చింది చిత్రకు. భర్తను చూపులతోనే ఈడ్చికొట్టి అక్కడి నుంచి లేచి బిరబిరా వెళ్ళింది.

ఇక లహరి, ఆమె భర్త చలపతి తమ గదిలో ఏకాంతంగా మాట్లాడు కుంటున్నారు.

“ఏది ఏమైనా రేపటి నుంచీ మన జాతకం మారబోతోంది. భూటాన్ లక్ష్మి లాటరీ ఒక్కటి తగిలితే చాలు. నా సామిరంగా ఈ ఊర్లో గొప్ప ధనవంతుడైన వెంకట్రామయ్యను మించిపోవచ్చు” అన్నాడు అతను భార్యవైపు ఆడ్మయిరింగ్ గా చూస్తూ.

ఆమె ఏమీ మాట్లాడలేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఎలాంటి గుర్తింపూ లేకుండా వున్న ఆమెను ఒక్కసారిగా కుటుంబమంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే ఉక్కిరిబిక్కిరైపోతోంది. తనను అందరూ గుర్తించడం, మెచ్చుకోలుగా చూడడం గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది. ఏదో తెలియని ఎగ్జయిట్ మెంట్ తో తుళ్ళిపడుతున్న ఆమెకు నోటమాట రావడం లేదు