నేను బాకీ వుంది ఆయనకే 1 196

వెంటనే ఇద్దరు స్టేషన్ మాస్టర్ రూమ్ లోకి పరుగెత్తారు.”ఒరేయ్ వాడిచేతిలో గ్రీన్ లైట్ ని లాక్కోండిరా” అటెండర్ వైపు చూస్తూ అరిచాడు శ్రీరాములు నాయుడు.శ్రీరాములు నాయుడు ఎవరో, ఆ గ్రూపులో ఎలాంటి నరరూప రాక్షసులుంటారో అటెండర్ కు బాగా తెలుసు.
అందుకే వాళ్ళు తన దగ్గరకు రాకమునుపే చేతిలోని లాంతరును క్రిందకు వదిలేశాడు అటెండర్.పరుగు, పరుగున లోనికెళ్ళిన ఇద్దరు వ్యక్తులు రెడ్ లైట్ తోనూ, రెడ్ ఫ్లాగ్ తోనూ బయటికొచ్చారు.”వెళ్ళండి…..ముందుకెళ్ళండి….ట్రైన్ స్లో కాగానే…. ముందు జనరల్ కంపార్ట్ మెంట్స్ వెతకండి” అరుస్తూ స్టేషన్ మాస్టర్ చేతిలోని గ్రీన్ ఫ్లాగ్ ని లాగడానికి ప్రయత్నించాడు శ్రీరాములు నాయుడు.స్టేషన్ మాస్టర్ ఆ పచ్చ జండాని గట్టిగా పట్టుకున్నాడు.”ఆ రెడ్ లైట్ వెలిగించినంత మాత్రాన, రెడ్ ఫ్లాగ్ ఊపినంత మాత్రాన నువ్వు ట్రైన్ ని ఆపలేవ్” తను ముందుకెళుతూ అన్నాడు స్టేషన్ మాస్టర్.”సార్… వచ్చేయండి సార్ వెళ్ళొద్దు- వాళ్ళతో గొడవ పడొద్దు” స్టేషన్ మాస్టర్ వైపు వస్తూ అరిచాడు అటెండర్.”వాడికున్న బుద్ది నీకు లేదు- ట్రైయిన్ ని ఆపు” స్టేషన్ మాస్టర్ భుజాన్ని పట్టుకుని వెనక్కి లాగుతూ అరిచాడు శ్రేరాములు నాయుడు.ఆ విసురుకి నేలమీద పడిపోయాడు స్టేషన్ మాస్టర్.”ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకి కంప్లయింట్ చేస్తాను” కిందపడిన స్టేషన్ మాస్టర్ లేచి, తన రూమ్ వైపు పరిగెడుతూ అన్నాడు.శ్రీరాములు నాయుడు ఒక్క అంగలో ముందుకురికి ఎడంచేత్తో స్టేషన్ మాస్టర్ జుత్తుని పట్టుకున్నాడు. “ట్రైన్ ని ఆపకపోతే ఛస్తావ్… దిసీజ్ మై లాస్ట్ వార్నింగ్ నేనెవరో తెలుసా- పిచ్చి, పిచ్చి వేషాలెయ్యకు… కమాన్.”అతని మాటలకు స్టేషన్ మాస్టర్ ఏ మాత్రం చలించలేదు.దూరంగా, పట్టాలమీద పరుచుకొన్న ట్రైన్ కాంతిలో పెనువేగంతో దూసుకొస్తోంది చార్మినార్ ఎక్స్ ప్రెస్. ప్లాట్ ఫారం మొదట్లో కెళ్ళి నిలబడిన శ్రీరాములునాయుడు అనుచరులు కేకలేస్తూ రెడ్ లైట్ ఊపుతున్నారు.
అదే వర్షం ఏ మాత్రం తగ్గకుండా!
అదే గాలి ఏ మాత్రం తగ్గకుండా!
“ఈ ట్రైన్ ఆగదు నువ్వేం చేసుకుంటావో చేసుకో” ట్రైన్ వస్తున్న స్పీడ్ ని అంచనా వేస్తూ చెప్పాడు స్టేషన్ మాస్టర్ కోపంగా.
“ఆగదూ… ఆగదా?”
ఒకే ఒక క్షణం తను తీసుకునే నిర్ణయం గురించి ఆలోచించాడు.
అంతే-
తన చేతుల్లోంచి విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్న స్టేషన్ మాస్టర్ని అమాంతంగా-
రెండు చేతుల్తో పైకెత్తి…ఫ్లాట్ ఫారమ్మీద నుంచి, పట్టాలమీద బస్తాను పడేసినట్టు పడేసాడు.ఊహించని ఆ చర్యకు స్టేషన్ మాస్టర్ కేక వేసాడు బాధతో!నడుం దగ్గర మేలికలో ఏదో ఎముక విరిగిన చప్పుడు. కిందపడిన స్టేషన్ మాస్టర్ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అటెండర్ భయంతో కేకలు వేస్తున్నాడు.ట్రైన్ కీ, స్టేషన్ కీ మధ్య ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఉంది.
“ఒరేయ్….ముసిలాడా! నువ్వు పట్టాలమీంచి పైకొచ్చావా….ఛస్తావ్” అరుస్తూ జేబులోని పిస్టల్ ని తీసి పట్టుకున్నాడు శ్రీరాములు నాయుడు.లేచి, పైకి రాబోతున్న వాడల్లా, నిస్సహాయంగా చూస్తూ నిల్చుండి పోయాడు. ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చెయ్యక తప్పదు.
చేతుల్ని పైకెత్తి, అడ్డంగా ఊపుతూ…..కేకలేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు స్టేషన్ మాస్టర్.తనలో తను నవ్వుకుని…. ముందుకడుగు వేసాడు శ్రీరాములు నాయుడు.
అదే సమయంలో-
హోరు గాలిలో ట్రెయిన్ కూత భయంకరంగా విన్పించింది.
* * * * *
“ఏమిటీ….ట్రెయిన్ వేగం….సడన్ గా తగ్గిపోయిందీ” పక్కనున్న వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేసాడు.ఉలిక్కిపడ్డాడు అర్జున్, గబుక్కున లేచాడు….అతని కళ్ళు, బయట చీకటిని భయంగా చూసాయి. ట్రెయిన్ స్లో అవుతోంది నెమ్మదిగా. గబుక్కున డోర్ దగ్గరకొచ్చారు….బయటకు చూసాడు… దూరంగా కన్పిస్తున్న స్టేషన్ వేపు చూసాడు. ఫ్లాట్ ఫారం అంచున నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు….రెడ్ లైట్…. సిగ్నల్….మసక, మసక వెల్తురులో కన్పించిన భారీ ఆకారం.అవును… వాళ్ళే వాళ్ళు…