నేను బాకీ వుంది ఆయనకే 1 196

ఆమెతోపాటు బస్సు దిగిన వాళ్ళంతా కూడా అటే నడుస్తున్నారు. మెల్లగా ఆమె వాళ్ళను వెంబడించింది.

వాళ్ళు ఓ రెండు జట్లుగా విడిపోయి నడుస్తున్నారు. ముందు ఆరుగురు వ్యక్తులు వడివడిగా నడుస్తుంటే వెనక నలుగురు కబుర్లాడుకుంటూ తాపీగా నడుస్తున్నారు.

ఆమె వాళ్ళ మాటలను వింటూ నడుస్తోంది.

నలుగురిలో కాస్తంత నాగరికంగా వున్న వ్యక్తి చెబుతున్నాడు.

“మొన్న అంటే ఈ మధ్య నాటకం నేర్పించడానికి ఒప్పుకున్నాను. నాటకం గయోపాఖ్యానం. మొదటి కృష్ణుడు ఆ ఊరి సర్పంచ్ వేస్తున్నాడు.

నాటకం ఖర్చూ, నా ఖర్చూ భరిస్తోంది ఆయనే. ఇంతవరకు బాగానే వుందిగానీ అక్కడ వచ్చింది పేచీ. కథరీత్యా గయుడు ఉమ్మిన ఉమ్ము కృష్ణుడి చేతుల్లో పడాలిగదా. కానీ దీనికి రవీంద్రరెడ్డి ఒప్పుకోవడం లేదు. ఎవడిదో ఉమ్మును నా దోసిళ్ళతో పట్టుకోవాలా? నా సర్పంచ్ గిరికే ఇది ఇన్సల్ట్. అంతగా కావాలంటే వాడి కిరీటం ఊడి నా చేతుల్లో పడేటట్టు కథ మార్చమని సర్పంచ్ పట్టుబట్టాడు. అయ్యా! మహానుభావా! అది నాటకం. మనం ఇష్టం వచ్చినట్లు మారిస్తే జనం చప్పట్లు కొట్టరు. చెప్పులతో కొడతారు అంటే వింటేనా? ఆయన్ను నాటకం నుంచి తప్పిద్దామంటే ఖర్చు పెట్టుకోగల మరో మనిషి లేడాయె. ఉంచుకుందామంటే లడాయి. చస్తున్నాననుకో ఎటూ తేల్చుకోలేక.”

వింటున్న వాళ్ళంతా నవ్వుతున్నారు.

ఆ వ్యక్తి డ్రామాలు నేర్పించే మాస్టారని అర్థమైంది ఆమెకు. పల్లెటూళ్ళలో ఇఅలామ్తి భేషజాలు, పట్టింపులు మామూలే. ఇన్ని వున్నా పట్టణాలకంటే పల్లెటూళ్ళే చాలా మెరుగని ఆమె నమ్మకం.

తమ వెనుక ఎవరో వస్తున్నట్లు కనిపించడంతో డ్రామా మాస్టారు వెనక్కి తిరిగాడు. చక్కగా, నాగరికంగా కనిపిస్తున్న వర్షను చూసి ఆగాడు.

“ఎవరమ్మా?” అంటూ పలకరించాడు.

“నా పేరు వర్ష. ఈ ఊరికి కొత్త టీచర్ని. ట్రాన్స్ ఫర్ మీద ఈ ఊరికి వచ్చాను.”

“అలానా” అని మరొకడివైపు తిరిగి “రేయ్ గంగయ్యా! ఆ సూట్కేసు అందుకోరా. పాపం ఆడకూతురు అంతంత బరువులు మోస్తోంది” అన్నాడు.

ఓ వ్యక్తి ఆమె చేతిలో వున్న సూట్కేసు అందుకున్నాడు.

తిరిగి అందరూ కదిలారు. ఆమె వాళ్ళ వెనకే మెల్లగా అడుగులేస్తోంది.

డ్రామా మాస్టారు మళ్ళీ తన నాటకాల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు.