నేను బాకీ వుంది ఆయనకే 2 88

మావాడు నీళ్ళు నములుతూ “మీ అప్పు తొందర్లోనే…..” అని ఏదో అంటూ వుండగా శెట్టి అడ్డు తగిలాడు.

“అప్పు గురించి మరిచిపో. నువ్వు నాకు అప్పు తిరిగి కట్టక్కర్లేదు. అవునయ్యా సుధాకర్ ! నీలాంటి మంచి మనిషి పెళ్ళికి యిచ్చిన సొమ్ము తీసుకోవడానికి మనసు రావడం లేదు. నేనా ఏకాకిని. పెళ్ళాం, పిల్లలూ లేని ఒంటరివాడ్ని ఉన్న డబ్బునే ఏం చేయాలో తెలియడం లేదు.”

మావాడు తబ్బిబ్బపోయాడు. “మీరు చెబుతున్నది…”

“వద్దు ఇక ఏమీ మాట్లాడ్క. ఇదిగో నువ్వు రాసిచ్చిన ప్రామిసరీ నోటును చించివేస్తున్నాను” అని జేబులోంచి కాగితాన్ని తీసి ముక్కలుగా చేసి కిందపడేశాడు.

మావాడి ఆనందాన్ని వర్ణించలేం.

“శెట్టిగారూ! లేవండి. ఎప్పుడు బయల్దేరారో ఏమో భోజనం చేద్దురు” అని పిలిచాడు మావాడు మెలికలు తిరిగిపోతూ.

“భోజనం ఏమీ వద్దుగానీ ఓ చాపా దిండు ఇప్పించు. నీకు పుణ్యం వుంటుంది. వారం రోజులుగా కంటిమీద కునుకులేదు” అని శెట్టి ఆవులించాడు.

ఎంత నిద్రమీదున్నాడో ఏమో తెలియదుగాని నడుం వాల్చగానే గురక పెడుతున్నాడు శెట్టి.

నెక్ట్సు ట్రిప్ బస్సులో కళావతి వచ్చింది.

“వదినా! నేను పడుకుంటాను. వారంరోజులుగా నిద్రలేదు. మా ఆయనకి నీ చేతులతో వడ్డించేసెయ్” అంటూ ఆమె పడకమీద వాలిపోయింది.

మావాడి అప్పు ఎలా తీరిందో నాకప్పుడు అర్థమైంది.

అంతా విని గోపాలకృష్ణ వెన్నెల్లో వెన్నెలంత హాయిగా నవ్వడం చాలా బావుంది లహరికి.

అతను ఆమె భుజం మీద చేయివేసి “అలా తీరిందన్నమాట మా కజిన్ అప్పు” అని అదంతా గుర్తొచ్చి మళ్ళీ నవ్వాడు.

ఇద్దరూ కొండ ఎక్కుతున్నారు.

“ఈ వెన్నెల్లో నీలాంటి అందమైన ఆడపిల్లతో నడవడం గొప్ప అనుభవం” అన్నాడు.

ఆమెలో గర్వంలాంటి ఫీలింగ్.

“నిన్ను నీ పేరుతోగాక ముద్దు పేరుతో పిలవాలని వుంది. అమెరికాలో అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ ని ముద్దుగా ‘హనీ’ అని పిలుస్తారట.”

“నన్ను ఏ పేరుతో పిలుస్తారు?”

“వెన్నెల”

ఎక్కడో ఆమె గుండెల్లో ప్రారంభమైన చిన్న కదలిక ప్రతి అవయవానికి పాకి ఉత్తుంగతరంగమై ఊపేసింది.

తన ప్రేమనంతా తెలియచేయడానికి భుజం మీదున్న అతని చేతిపై చేయివేసి బలంగా నొక్కింది.

అతను ఆమె మీదకి వంగి ముద్దు పెట్టుకున్నాడు.

ఆమె అనాలోచితంగా కళ్ళు మూసుకుంది. ముద్దు పూర్తయ్యాక కూడా కళ్ళు తెరవలేకపోయింది. పెదవులమీద అతని పెదవులు రేపిన సంచలనం రక్తంలో సాగిపోతూ వుంది. కళ్ళు తెరిస్తే ఆ భావన పోతుందేమోనన్న సందేహంతో అలానే వుండిపోయింది.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.