నేను బాకీ వుంది ఆయనకే 2 88

ఇదంతా దేనికి ఉపోద్ఘామో చివరి వాక్యంవల్ల అర్థమైంది నాకు. చలపతి మా అమ్మ తమ్ముడు. ఊర్లో మాకు పదెకరాల పొలమూ, రెండు మోటార్లూ వుండేవి. అమ్మావాళ్ళకు నేనొక్కదాన్నే సంతానం. అందుకే వ్యవసాయంలో తోడు వుంటాడని మా మావయ్యని ఇంటికి పిలిపించుకున్నారు. అతను వచ్చి రెండేళ్ళయింది. అప్పట్నుంచీ మా ఇంట్లోనే వుండి అన్నీ చూసుకునేవాడు.

అప్పటికి అతనికి నలభై ఏళ్లుండేవి. నాకంటే దాదాపు రెట్టింపు వయసు. అందుకే కాబోలు నేనెప్పుడూ అతని గురించి ఆలోచించలేదు. అమ్మ తమ్ముడు అన్న భావన తప్ప మరో అభిప్రాయం లేదు. ఇప్పుడిలా సడన్ గా అడిగేసరికి నాకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు.

దీన్ని గమనించే అమ్మ అంది. ‘వాడికి కాస్త వయసు ఎక్కువ అన్న మాట తప్ప మరేం లేదు. కళ్ళు వంకరా, కాళ్ళు వంకరా? రాయిలా వుంటాడు. అయినా వాడికి ఏం వయసుందని? మహావుంటే ముప్ఫై ఐదుఏళ్ళు వుంటాయేమో. ఈ కాలంలో అదేమంత ఎక్కువ వయసుకాదు. నీకూ వాడికి ఈడూజోడూ బాగా వుంటుంది. చిలకా గోరింకల్లా వుంటారు. ఎవరైనా ఎప్పటికయినా ముసలివాళ్ళు అయిపోవలసిందే కదా. బాగా ఆలోచించు

ఎవరయినా ముసలివాళ్ళు అయిపోతారని ఇప్పుడు నలభై ఏళ్ళు నిండినవాడ్ని కట్టుకోమంటున్న అమ్మ లాజిక్ నాకు అర్థం కాలేదు.
“కానీ-”

“అలా నసగొద్దు. నువ్వు నాకు ఒక్కదానివే. నీ ముందూ వెనకా ఎవరూ లేరు మాకు. నువ్వు ఎవర్నో చేసుకుని ఎక్కడో కాపురం చేసే దానికన్నా ఇక్కడే మనింట్లోనే వుండిపోవాలని మా కోరిక. నీకు పెళ్ళి అయి నీ కడుపునా ఓ కాయ కాస్తే వాడితో ఆడుకుంటూ ఈ శేష జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. నిన్ను చేసుకొని ఇక్కడే ఇల్లరికం వుండిపోయే వాడు మనకు దొరకద్దూ. చలపతి అయితే ఆల్ రెడీ ఇక్కడే వున్నాడు. నిన్ను చేసుకున్న తరువాత కూడా ఇక్కడే వుండిపోతాడు.”

“అదిగాదే”

“ఇంక నీ సందేహాలూ, అపనమ్మకాలూ నేను వినను. ఇంకో రహస్యం చెప్పనా? ఈ ఆస్థి అంతా ఎవరో తినిపోవడం కన్నా మన ఆస్థి మనమే తింటే పోలా. వాడు ఎవరో పరాయివాడు కాడు. నాకు తమ్ముడు. మీ నాన్నకు పెదబామర్ది. నీకు మావయ్య. మన ఆస్థి మన దగ్గరే వుండాలంటే వాడయితేనే బెస్టు. పెళ్ళి అంటే ఏదో సంవత్సరం, రెండు సంవత్సరాల ముచ్చట కాడు నూరేళ్ళ పంట.”

అదే నా బాధ అంతా. నూరేళ్ళలో అప్పటికే నలభై ఏళ్ళు అయి పోయినవాడ్ని చేసుకోమనడం దారుణం. అందుకే నిక్కచ్చిగా చెప్పాను. “ఒద్దే అమ్మా! నువ్వు నూరు చెప్పు, లక్ష చెప్పు, నలభై ఏళ్ళవాడిని నేను చచ్చినా చేసుకోను.”

అమ్మ ఈసారి మరింత అనునయిస్తూ “అలా అనకు. ఇంత చిన్న కారణం వలల్ నీ జీవితాన్ని మరొకరితో ముడిపెట్టుకుని బాధలు పడవద్దు. మేము నీ తల్లిదండ్రులం గానీ శత్రువులం కాము. వాడికి ఏమైనా దురలవాట్లు వున్నాయా అంటే అదీ లేదు. సిగరెట్ తాగడు. మందు పుచ్చుకోడు. ఆడవాళ్ళ వెంట పడడు. అడపా దడపా ఆ లాటరీ టికెట్లు కొనడం తప్ప మరో యావలేదు” అని మావయ్య సుగుణాలను ఏకరుపు పెట్టింది.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.