నేను బాకీ వుంది ఆయనకే 2 88

అతను భూతవైద్యుడు గనుక స్త్రీలకి ఓ విధమైన భయం వుంది. అతను మామూలు మనిషి కాదన్న భావన వుంటుంది. అతని వృత్తి అలాంటిది. అది దెయ్యాలను దూరంగా తరుముతుంది. గానీ, మనుష్యులను దగ్గరకు చేరనివ్వదు. అంతేగాక ఆమె తన అంతరంగం ఏమిటో తెలుసుకో గలిగింది. ఈ మేరకు ఆమె తెలివైనదే. అందుకే ఏం జవాబు చెప్పాలోనని ఆమె గింజుకోలేదు. అయితే దాన్ని ఎలా చెప్పాలో అని మాత్రమే ఇబ్బంది పడుతోంది.

“ఎన్నో రోజులుగా చెప్పాలని…… కానీ”

“పిల్లి అడ్డొచ్చిందా” అని నవ్వింది ఆమె. ఆ నవ్వు వెనకనున్న అర్థం ఏమిటో తెలియక అతను తల్లడిల్లిపోయాడు.

స్త్రీలు అంతే! అంతవరకూ సీరియస్ గా వున్న ఆమె తన మనసేమిటో తెలుసుకున్నాక ఈజ్ అయిపోయింది. తనకు కావల్సిందానిని వాళ్ళు ఎంత గాఢంగా కోరుకుంటారప్ తనకు అక్కర్లేని దానిని అంతే తృణీకారంతో చూస్తారు.

ఇప్పుడు పులిరాజు కూడా ఆమెకు అలానే కనిపిస్తున్నాడు. తనకు అవసరం లేదనుకోగానే అతను చులకనైపోయాడు.
“మరెందుకు చెప్పలేదు?”

“అదీ….. అదీ”

“మంత్రాలను పొల్లుపోకుండా చెబుతావు కదా. ఇంత చిన్న వాక్యాన్ని చెప్పడానికి ఇంత టైమ్ తీసుకోవాలా?” ఆమె నవ్వును ఆపటం లేదు.

“చెప్పాలనే…. ఏదో జంకు, తెలియని బెదురు.”

“పోనీలే ఇప్పటికైనా చెప్పావు. కానీ…..” అతని రియాక్షన్ కోసం ఆగింది. అప్పటికే అతని గుండెలో విస్పోటనం జరిగిపోయింది.

“ఏమీ అనుకోవద్దు పులిరాజూ! నువ్వంటే నాకలాంటి ఉద్దేశం లేదు. ఎందుకు లేదు అని అడగొద్దు. నీమీద ఎందుకు ఇష్టం లేదో చెప్పలేనట్లే గోపాలకృష్ణ మీద ఎందుకు నాకంత ఇష్టమో కూడా చెప్పలేను.”

ఆ తరువాత ఆమె చెప్పిన ఒక వాక్యమో, రెండు వాక్యాలో వినిపించలేదు అతనికి.

నిమ్మకాయను కొస్తే ఎర్రటిరక్తం ఎగజిమ్మినట్టు, బుట్టలో పెట్టిన తాడు తాచుపామై కాటేసినట్లు, తోక ముడిచి పారిపోవాల్సిన దెయ్యం తిరగబడి తనను తినేస్తున్నట్టు అతను. వణికిపోయాడు.

రక్తంలో విషంలా ఏదో తెలియని బాధ ఒళ్ళంతా చరచరా పాకడం తెలుస్తూనే వుంది నరాలు చిట్లి దారాలుగా సాగడం బోధపడుతూ వుంది. కళ్ళల్లో నీళ్ళు ఊరి, దృశ్యాలన్నీ మసకయిపోవడం గమనిస్తూనే వున్నాడతను.

“పులిరాజా! ఇక వెళ్ళిరా” అని అతను ఏమైపోతున్నాడని గమనించ కుండానే లోపలికి వెళ్ళిపోయింది

ఎలా నడిచాడో ఏమో తెలియదు. మరో పదినిముషాలకు ఊరి పొలిమేరలు దాటాడు. పొలాల వెంబడి నడుస్తున్నాడు. అప్పుడప్పుడూ తల పైకెత్తి చూస్తున్నాడు. చిన్నపిల్లాడు పౌడర్ నంతా చేతుల్లో ఒంపుకుని ముఖానికి పూసుకున్నట్టు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అలా ఎంతసేపు తిరిగాడో అతనికే తెలీదు. చందమామ ఆకాశం మధ్యలోకి వచ్చి నిలబడి లోకంవైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది.
అతను నడుస్తున్నవాడల్లా ఠక్కున ఆగాడు. ఎవరో మాట్లాడుతున్నట్లు మాటలు విన్పిస్తున్నాయి. అప్పుడు చుట్టూ పరికించి చూశాడు. తను ఎక్కడ వున్నాడో తెలుసుకోవడానికి అయిదు నిముషాలు పట్టింది. తను గోపాలకృష్ణ బంగళా దగ్గరకు వచ్చాననీ, కొండశిఖారాగ్రాన వున్నానని తెలిసింది. మాట్లాడుతున్నాది గోపాలకృష్ణ, మరో స్త్రీ అని కూడా బోధ పడింది. ఆరోజు పౌర్ణమి అవునో కాదో తెలుసుకోవడానికి పైకి చూశాడు. కొరవలు లేని చందమామ నిండుగా వుంది. అతని వృత్తికి పౌర్ణమి పడదు. గోపాలకృష్ణ ప్రవృత్తికి అమావాస్య పడదు. ఇలా రెండు విభిన్న ధృవాలయిన వారిద్దరూ శత్రువులై భయంకరమైన యుద్దానికి తలపడడానికి బీజాన్ని పునర్వసు వేసింది. ఆమె అతడిని ప్రేమించకపోగా, తను ఎవరిని ఇష్టపడుతూ వుందో చెప్పింది. దాంతో గోపాల కృష్ణ మీద ద్వేషం బయల్దేరింది అతనిలో. ఆ ద్వేషమే అతనికి తెలియకుండానే అతన్ని అక్కడికి లాక్కొచ్చింది. గోపాలకృష్ణ పక్కన మరో స్త్రీ వుందంటే ఆరోజు ఖచ్చితంగా పౌర్ణమి అయి వుంటుందని పులిరాజుకి తెలుసు. తను కనబడకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ అక్కడున్న పెద్దరాయి వెనకకు వెళ్ళి నిలబడ్డాడు. అక్కడ్నించి చూస్తే గోపాలకృష్ణ ఓ అమ్మాయి స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పులిరాజు మోకాళ్ళు కింద ఆనించి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడం ప్రారంభించాడు.

“విశాఖా! మరి నీ జీవితంలో ఎవరికీ చెప్పని సంఘటన గురించి చెప్పు…..” మురిపెంగా ఆమె చుబుకాన్ని పైకెత్తి అడిగాడు గోపాలకృష్ణ.
అంటే ఆరోజు విశాఖ వంతు వచ్చిందన్నమాట అనుకున్నాడు పులిరాజు. ఆమె రఘుపతి భార్య ఇరవై ఎనిమిదేళ్ళు వుంటాయి. లావుగా బొద్దుగా, అందంగా వుంటుంది.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.