నేను బాకీ వుంది ఆయనకే 2 88

తన అల్లుడ్ని కూర్చోబెట్టుకుని కళ్ళు మూసింది.

మేమంతా తలో దిక్కుకు పరుగెత్తాం. నేను వాళ్ళింటి వెనుక నున్న గడ్డివాములో దాక్కున్నాను.

కాసేపటికి దొంగ మమతను కనిపెట్టాడని. అందరూ వచ్చేయమణి సుగుణ కేకపెట్టింది. నన్ను ఎవరూ కనిపెట్టలేదన్న ఆనందంతో వచ్చాను. వంశీని చూసి గర్వంగా నవ్వాను.

ఈసారి మమతకు కళ్ళు మూశారు.

నేను తెలివిగా ముసలమ్మ వెనకే నక్కాను. ముసలమ్మ కళ్ళకు కట్టిన చేతుల్ని తీసేశాక మమత వెదకడానికి బయల్దేరింది.

ఈసారి వంశీ దొంగయ్యాడు.

“భలే భలే….. నువ్వు దొంగవన్న మాట” చిన్నపిల్లలూ చప్పట్లు చరిచాను. ఆ ఆట ఆడుతూ నేను చిన్నపిల్లనే అయిపోయాను.

అమ్మావాళ్ళు నాకిష్టం లేకపోయినా మామయ్యకిచ్చి పెళ్ళి చేయడం గానీ, మా ఇద్దరిమధ్యా పేరుకుపోయిన అసంతృప్తిగానీ, నాకింకా పిల్లలు కలగలేదన్న బాధగానీ ఏమీ గుర్తుకు రావడం లేదు. చాలా కాలానికి నన్ను నేను మరిచిపోయాను. నాకింకా పెళ్ళి కానట్లు, సరదాగా మసక వెన్నెల్లో, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లుంది.

వంశీ కళ్ళు మూసింది ముసలమ్మ. ఎట్టి పరిస్థితిలోనూ వంశీకి కనబడ కూడదని ఎక్కడ దాక్కోవాలో ఆలోచించాను. మా డాబా సరైన స్థలమనిపించింది.

సుగుణ ఇంటినుంచి నేరుగా వెళ్ళి మా ఇంటి దొడ్లోకి చేరి అక్కడ నుంచి వెనక దారిగుండా ముందుకు వచ్చి మెట్లెక్కాను. ఓ మూల ఒదిగి కూర్చున్నాను.

పండరి భజన మెల్లగా విన్పిస్తోంది. వీధుల్లో లైట్లు వుండడంతో పలుచటి వెలుగు చీకటి దేహం మీది పొలుసులా వుంది. ఒక్క పొద్దు నీరసంతో గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశంలో అక్కడక్కడా వున్న నక్షత్రాలు శివుని పూజించడానికి దేవతలు ఏరుకొచ్చిన తుమ్మపూల్లా వున్నాయి.

వంశీ వచ్చినా కనబడకుండా వుండడానికి తల వంచుకుని పిట్టగోడ నీడలో కూర్చున్నాను.

అయిదు నిముషాలు గడిచాయి.

ఇక వంశీ ఇక్కడికి రాడని అనుకుంటూ వుండగా ఎవరో నా గడ్డం పట్టుకుని పైకి లేపుతున్నట్లు అనిపించింది.

చివాలున తలెత్తాను.

నా ఎదురుగ్గా మోకాళ్ళమీద కూర్చున్న వంశీ తదేకంగా చూస్తున్నాడు. ఏదో మాట్లాడబోయి అతన్ని చూసి మానుకున్నాను.

అతను నా ప్రమేయం ఏమీ లేకుండానే నా మీదకు వంగి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.