నేను బాకీ వుంది ఆయనకే 2 87

నా భర్త ఎదురుపడ్డప్పుడు కూడా నేనంత షాక్ ను గురికాలేదు. ఆశ్చర్యంతో నా ఒళ్ళు ఉబ్బింది.

నేను వింటున్నది నిజమేనని నమ్మకం కలిగించడానికి కాబోలు రెండవసారి చెప్పాడు. “మీ ఇద్దరి సంబంధం జీవితాంతం కొనసాగాలి.”

నాకు నోటమాట రాలేదు. తడిలేక పెదవులన్నీ బిగుసుపోయాయి. ఒంట్లోని శక్తంతా ఆవిరైపోయినట్లునిపించింది.

“ఏమిటి మీరనేది?” ఎలాగో నోరు పెగుల్చుకుని అడిగాను.

“నేను ఇలా అడగడానికి కారణం వుంది. నీకు గయ్యాళితనం జబ్బు ఎలా వచ్చిందా అని మన పెళ్ళి అయినప్పట్నుంచీ ఆలోచిస్తున్నాను. ఆ జబ్బుకు విరుగుడు ఏమిటా అని ఇంతకాలం తలబద్దలు కొట్టుకున్నాను తమాషా ఏమిటో తెలుసా? ఆ జబ్బు నయమవడం ప్రాంభించాక, ఆ జబ్బుకు కారణం ఏమిటో, దానికి ఔషధం ఏమిటో నాకు తెలిసింది. అందుకే వంశీని ఎప్పటికీ వదిలిపెట్టద్దు”

నేను ఏమీ మాట్లాడలేదు.

“వంశీని ఎప్పటికీ వదలనని నువ్వు నాకు మాటివ్వకపోతే నేను ఇప్పుడే ఉరేసుకుని చచ్చిపోతాను. అతను మనింటికి ఎప్పుడూ వస్తూ పోతుండాలి.”

నాకు ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.

నేను ఏమీ మాట్లాడకపోయేసరికి ఆయన సీరియస్ గా దేవుడి రూమ్ లోకి నడిచి, అంతే వేగంతో తలుపు గడియ పెట్టుకున్నాడు.

భార్య ప్రియుడు ఎప్పుడూ ఇంటికొచ్చి వెళుతుండాలన్న హామీ కోసం ఉరేసుకుంటున్న భర్తకు ఏం జవాబు చెప్పాలో ఎవరికి మాత్రం ఏం తెలుసు?

అలా ఉపేక్షిస్తూ వుంటే ఆయన చచ్చిపోతాడనిపించి “అలాగేనండీ మీరు చెప్పినట్లే మా సంబంధం కొనసాగుతుంది. తలుపు తీయండి” అంటూ నేను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని తలుపులు బాదడం ప్రారంభించాను.

మరో క్షణానికి తలుపు తెరుచుకుంది.

లహరి చెప్పడం పూర్తిచేసి గోపాలకృష్ణ రియాక్షన్ చూడటానికి కళ్ళను మరింత సాగదీసింది.

“మరి ఆ ఊరేందుకు వదిలిపెట్టి ఇక్కడకు వచ్చారు?” గోపాలకృష్ణ అడిగాడు.

“మా ఊర్లో ఎందుకనో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీరు వసతి పూర్తిగా కరువైపోయింది. దాంతో ఊర్లోని జనం తమకు అనువైన చోట్లకు వెళ్ళిపోయారు. మేం ఇక్కడికి వచ్చేశాం.”

“వంశీ?”

“మిలటరీలో చేరిపోయాడు. నాలుగేళ్ళయింది. అతన్ని చూసి.”

ఆ తరువాత వాళ్లిద్దరూ చాలాసేపటివరకు ఏమీ మాట్లాడుకోలేక పోయారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు.

చివరికి గోపాలకృష్ణే ఆలోచలనుంచి బయటపడి లహరిని తనవైపు తిప్పుకున్నాడు.

ఆమెని గతం నుంచి బయటపడవేయడానికి “వెన్నెల చాలా బావుంది కదా” అని అడిగాడు.

“ఊఁ” అంది.

“ఈ వెన్నల్లో నువ్వెలా వున్నవో తెలుసా? ఎవరో గంధర్వకన్య శాపవశాత్తూ భూమి మీదికి దిగివచ్చి నా పక్కకు చేరినట్టుంది.”

ఆమె పెదవి విడీ విడవకుండా నవ్వింది.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.