నేను బాకీ వుంది ఆయనకే 2 88

కొన్నిరోజులకి ఊరు ఊరంతా నేనంటే హడలిపోయే స్థితికి వచ్చింది. నాలాంటి గయ్యాళి, కచ్చబోతు మనిషి, వ్యవహారాల పుండాకోరు. చాడీల మనిషి మరొకరు ప్రపంచంలో వుండదన్న పేరొచ్చింది.

బయటే కాదు. ఇంట్లోనూ అంతే. పనిమనుషులమీద ఎగిరేదాన్ని. ఎంత చిన్న విషయానికయినా నా భర్త మీద విసుక్కునేదాన్ని, కోపగించుకునేదాన్ని, ప్రతిదానికీ పేచీకి దిగేదాన్ని.

నా భర్త నరకం ఎలా వుంటుందో నా ప్రవర్తనలో రుచి చూపించాను. ఆయన కొరుకునే ప్రశాంతత పూర్తిగా కరువైంది. రోజులో ఒక నిముషం కూడా ఆయనకు ప్రశాంతత చిక్కుకుండా చేసేదాన్ని.

ఈ గుణాలన్నీ ఎలా అబ్బాయో నాకు తెలియదు. నాభర్త ప్రశాంతతను ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఆయనమీద పగ సాధించాలన్న కోరికతో నేనలా అయిపోయానో ఏమో తెలియదు.

అందర్లాగే నేనెప్పుడూ నన్ను నేను విశ్లేషించుకోలేదు. నాకు ఏం కావాలో, ఏం తక్కువైందో నా అంతరంగాన్ని వెదికి తెలుసుకోలేదు. గయ్యాళిగా వుండడంతో ఇతరులమీద చాడీలు చెప్పడంలో, అసహ్యంగా మాట్లాడడంలో, ఎదుటివాళ్ళు నైతికంగా ఎలా పతనమైపోతున్నారో చెప్పుకోవడంలో వుండే ఆనందాన్ని అనుభవిస్తున్నాను.

ఇల్లు ఇలా అయిపోవడాన్ని భరించలేకపోయాడు నా భర్త. అందుకే రాత్రయితే పండరి భజనకు వెళ్ళిపోయేవాడు. త్వరలోనే ఆయన పండరి భజనలు నేర్పించే గురువు స్థాయికి ఎదిగిపోయాడు. రోజు రాత్రికాగానే దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు. కుర్రుకారుకి పండరి భజనలు నేర్పించి ఏ అర్థరాత్రో ఇంటికి చేరుకునేవాడు.

ఇదిగో ఇలాంటి సమయంలో మా వూరికి వంశీ వచ్చాడు

అతనిది మావారే. చిన్నప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఊరెళ్ళిపోయాడు. అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాడు. అప్పుడప్పుడూ వచ్చి వెళ్ళేవాడు. ఊరికి వచ్చినప్పుడు ఏ రెండు మూడు రోజులో వండడం వల్ల నేనెప్పుడూ అతన్ని పరిశీలించలేదు.ఈమధ్య అతని తాతయ్య పోయాడు. దాంతో అక్కడున్న పొలమూ, పుట్రా అమ్ముకుని అతని అమ్మమ్మ కూతురి దగ్గరికి వచ్చేసింది. అమ్మమ్మతోపాటు అతనూ పర్మినెంట్ గా ఊరికి వచ్చేశాడు.
అతను వచ్చిన రెండోరోజో, మూడోరోజో వీధిలో వెళుతుంటే చూశాను. బంధువుల అబ్బాయి కనుక పలకరించాను.

“ఏం వంశీ! ఎప్పుడు రాక?”

“మొన్న వచ్చాను. అంతా బావున్నారా?” అంటూ నేనున్న వరండాలోకి వచ్చాడు.

“ఆఁ”

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.