నేను బాకీ వుంది ఆయనకే 2 88

చాలా ప్రేమలు గంధం పూయడంతోనే పుట్టేవి, మిగిలిన వాళ్ళకూ తెలిసేవి.

ఆ సంవత్సరం ఉత్సవాలు ప్రారంభమయిన మొదటిరోజు మొదటి సారిగా నేను గంధం తీసుకున్నాను. గంధం చేతిలో రాసుకున్నాక అమ్మాయిలతో పాటు నేనూ దేవాలయం వెనుకకు వచ్చేశాను. మిగిలిన స్నేహితురాళ్ళు తమకు ఇష్టమయిన అబ్బాయిల కోసం వెయిట్ చేస్తున్నారు.

మొదటిగా దేవాలయం ముందు భాగం నుంచి శీను వీధుల్లోకి రావడం మొదలుపెట్టాడు. అతను ఖచ్చితంగా గంధం రాయడానికే వస్తున్నాడని తెలుసు. ఆలస్యమైతే అమ్మలూ, అమ్మమ్మలూ ప్రసాదానికి అక్కడికి చేరుకుంటారు గనుక ఈ గంధం. కార్యక్రమాన్ని పెద్దవాళ్ళు చూడకుండా ముగించాలని అటు ఆడపిల్లలూ, ఇటు అబ్బాయిలూ తొందరపడుతుంటారు.

శీను మా దగ్గరికి వచ్చి ఓ క్షణం నిలబడ్డాడు. అతను తన కోసమే వచ్చాడని తెలిసిన సునంద ఠక్కున మా వెనుక దాక్కుంది.

కాసేపు అలానే వుంటే అతను వెళ్ళిపోతాడన్న అనుమానంతో కాబోలు ఆమె కొంటెగా నవ్వుతూ తల పక్కకు పెట్టి చూసింది అంత చాలు ఆమె ఉనికిని అతను గుర్తుపట్టడానికి. అతను రెండు అంగల్లో ఆమెను చేరుకొని ఎడమచేత్తో ఆమె చేయి పట్టుకుని లాగి, కుడిచేతిలో వున్న గంధాన్ని అంతే స్పీడుతో ఆమె చుబుకం కింద పూశాడు.

ఆ స్పీడ్ లో అతని చేయి ఎక్కడెక్కడ తగలాలో అక్కడంతా తగిలింది. క్షణం ఆలస్యం చేస్తే ఎవరైనా వస్తారుమోనని అతను మరో రెండు అంగల్లో వీధిలోకి రాబోయాడు. అప్పుడు సునంద పరుగెత్తి అతని వెనక నుంచి ముందు చేయి పోనిచ్చి బుగ్గలకు గంధం రాసింది.
ఇలా అక్కడున్నవాళ్ళు తమ హీరోలకు గంధం రాసి, గంధం రాయించుకున్నారు.

చివరికి నేను మిగిలిపోయాను. నా చేతిలోని గంధం అప్పటికే గట్టిపడుతోంది. అప్పటివరకు నాకంటూ ఒక వ్యక్తి లేడు. అలా ఆలోచిస్తుంటే ఠక్కున నాకు సుధీర్ గుర్తొచ్చాడు. అతను సాయంకాలం అలా వీధిలో వెళుతుంటే చూశాను. ఆరోజే యూనివర్శిటీ నుంచి వచ్చాడన్న మాట.

కానీ అతను దేవాలయం వెనక్కి వచ్చే అవకాశం లేదు. నేను ముందుకు వెళ్ళలేను. ఎం చేయాలో అని ఆలోచిస్తూ వుండిపోయాను. చివరికి పక్కనున్న మీనాకి పూద్దామని అనుకున్నానుగానీ- చెప్పాను గదా, హార్మోన్లు డానికి అనుమతించలేదు.

మరికొంతసేపు నిరీక్షించాలని నిర్ణయించుకున్నాను.

మరి నా మొర ఆ శ్రీరామచంద్రుడు ఆలకించాడేమో తెలియదుగానీ ఇంటి నుంచి దేవాలయానికి వస్తున్న సుధీర్ కనిపించాడు. ఏదో థ్రిల్ మనసును ఊపేసింది. శరీరమంతా మధురమైన కంపనాలు. అంతవరకు అనుభవించిన ఫీలింగ్ అది. మత్తుగా, గమ్మత్తుగా వుంది.

అతను దగ్గర పడుతున్నాడు.

ఆగలేకపోయాను. వీధి అని కూడా ఆలోచించకుండా మసకచీకట్లోంచి ముందుకు కదిలి అతని బుగ్గలమీద సుతారంగా గంధం పూశాను. నా చేయి వణకడం, నాలుక తడారిపోవడం తెలుస్తూనే వుంది.

అతను మొదట ఆశ్చర్యపోయి, ఆ పిమ్మట నన్ను గుర్తించి చిన్నగా నవ్వాడు.

అంత జరిగాక ఆ రాత్రి నిద్ర పడుతుందని నాకు అనిపించలేదు. తెల్లవారేవరకు అలా నవమి మహోత్సవాలు జరుగుతూనే వుంటే బావుంటుందని అనిపించింది. కానీ వెంటనే ప్రసాదం పెట్టడం ప్రారంభించారు.

ప్రసారం తీసుకున్నాక ఇంటికొచ్చానుగానీ ఏమీ చేయలేక పోయాను. అతని బుగ్గల గరుకుదనం నా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పడకమీద పడుకున్నానుగానీ కళ్ళమీద నిద్ర వాలడం లేదు. అలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాను. ఏవేవో రంగురంగుల కలలు కన్నాను.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.