నేను బాకీ వుంది ఆయనకే 2 88

అమ్మ చెప్పిన సుగుణాలన్నీ ఏమోగానీ నాకు మాత్రం చలపతిలో కనిపించిన సుగుణం ఒక్కటే. ప్రశాంతతను కోరుకునే మనస్తత్వం. చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడి కూడా ఎరుగడు. కామ్ గా వుండేవాడు. ఇంట్లో కూడా ప్రశాంతత కొరుకునేవాడు. ఇల్లు ఎప్పుడూ మౌనంగా ఋషిలా వుండాలనేవాడు. మా అమ్మ ఎప్పుడైనా ఎవరిమీదైనా కేకలేస్తుంటే వెంటనే అడ్డుకునేవాడు. మనం నష్టపోయినా సరే ప్రశాంతంగా వుండే పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలనేవాడు.

ఈ ఒక్క సుగుణానికి కట్టుబడి అతన్ని పెళ్ళి చేసుకోవడం అసంభవం. అదే మాట చెప్పి కిందకి వచ్చేశాను.

మరుసటిరోజు నాన్న నాకు క్లాసు తీసుకున్నాడు. మావయ్యను చేసుకొమ్మని బ్రతిమిలాడాడు. బుజ్జగించాడు. చివరి అస్త్రం అన్నట్లు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించాడు.

ఇంట్లో అమ్మా నాన్నే ఇలా శత్రువులుగా మారిపోతే ఆడపిల్లను నేనేం చెయ్యగలను? చివరికి విధిలేని పరిస్థితుల్లో తల వూపాను.

పెళ్ళి అంటే కలగాల్సిన థ్రిల్ లేదు. నా ఊహలకు, నా రంగుల కలలకు అంత్యక్రియల్లా అనిపించింది. మావయ్యతో నా పెళ్ళి నిశ్చయమయ్యాక ఊర్లోణి నాతోటి ఆడపిల్లలు నా వైపు జాలిగా చూస్తున్నట్లు అనిపించి, బాధ పొంగి పోర్లేది.

పెళ్ళి పనులు మొదలయ్యాయి మా ఇంట్లో.

కాంచీపురం వెళ్ళి చీరలు తెచ్చారు. తిరుపతికి వెళ్ళి బంగారు నగలు తెచ్చారు. పెళ్ళికూతురి అలంకరణకోసం అన్ని కాస్మిటిక్స్ మద్రాసు నుంచి తెప్పించారు.

ఇవి ఏవీ నాకు ఆనందాన్ని కలిగించలేదు. నా యవ్వన సామ్రాజ్యానికి కాపలకాసే ఇంద్రచాపంలా వుండాల్సిన పట్టుచీర ఉత్తిబట్టలా అనిపించింది. నా శరీరపు రంగును చూసి తలలు వేలాడదీసినట్లు అనిపించాల్సిన బంగారు ఆభరణాలు ఉత్తిలోహపు పిచ్చి డిజైన్లలా కనిపించాయి. నా ఆనందానికి మెరుగులు దిద్దడానికి పుట్టినట్లు అనిపించాల్సిన కాస్మిటిక్స్ ఉత్తి రసాయన జిగురుల్లా తోచాయి.

నాకేమీ థ్రిల్స్ అనిపించకనే నా పెళ్ళి అయిపోయింది.

నా ఫస్ట్ నైట్ ఎలా రసహీనంగా తెల్లవారిందో మిగిలిన రోజులూ అలానే అనిపించాయి. మధ్య వయసులో ఎలాంటి స్పందన వుంటుందో అంతే ప్రదర్శించేవాడు నా భర్త. నా అభిరుచులకు, ఆయన మనస్తత్వానికీ ఎక్కడా పొంతనలేదు.

ఒ రెండేళ్ళు గడిచిపోయాయి అమ్మ టైఫాయిడ్ తోనూ, నాన్న క్షయతోనూ చనిపోయారు. నాకు పిల్లలు కూడా కలగాలేదు. దీంతో మళ్ళీ నేను ఒంటరిదాన్నయి పోయాను. నాకు పెళ్ళి అయిందన్న విషయం కూడా అప్పుడప్పుడూ గుర్తుండేది కాదు.

నా ప్రవర్తనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బాగా గయ్యాళితనం వచ్చింది. కానిదానికీ, అయినదానికీ పనివాళ్ళమీద విరుచుకుపడే దాన్ని. బయట మనుష్యులతో కూడా అలానే ప్రవర్తించేదాన్ని. చిన్న విషయానికి కూడా కటువుగా రియాక్టయ్యేదాన్ని. నానా తిట్లూ అబ్బాయి. బూతులు కూడా అలవాటయ్యాయి. జనాన్ని చూస్తేనే శివాలెత్తి పోయేదాన్ని. మనుష్యులంతా అసహ్యంగా కనిపించేవాళ్ళు. ఇరుగు పోరుగంటే నన్ను పీక్కుతినడానికి తిష్టవేసిన వాళ్ళలా అనిపించేవాళ్ళు.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.