నేను బాకీ వుంది ఆయనకే 2 88

ఈ ఎండలో అలాంటివి భరించగలమా? అందుకే ఇక్కడికి వచ్చేశాను. హాయిగా పైట తీసేసి ఎంచక్కా నిద్రపోవచ్చుగదా” ఇలా చెప్పి ఆమె కళ్ళు మూసుకుంది.

క్షణంలో ఆమెకు నిద్రపట్టేసిందని అర్థమైంది అతనికి.

ఆమె పైటను చూస్తున్న అతనికి నిద్ర రావడం లేదు.

చుట్టూ పిండివంటలు పెట్టి మూతిని కట్టేసినట్టు అతను గింజుకు పోతున్నాడు.

అతనికి పాతికేళ్ళుంటాయి. సన్నగా, పొడవుగా. మంత్రగాడి ముఖాన దిద్దుకున్న ఎర్రటి నామంలా వుంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలంతటికీ ఏకైక భూతవైద్యుడు అతనే. ప్రతి ఆదివారం దెయ్యాలు పట్టిన వాళ్ళంతా వైద్యం కోసం అతనింటికి వస్తారు. ఆరోజంతా హడావుడిగా వుంటాడు. దెయ్యాలన్నిటినీతరిమికొట్టి వాళ్ళిచ్చిన తృణమో, పణమో స్వీకరిస్తాడు. ఇక వారంలో మిగిలిన రోజుల్లో ఏ పనీ వుండదు. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప మిగిలిన రోజుల్లో భూతవైద్యం చెయ్యడు. దెయ్యం మరీ ఉద్ధండపిండమైతే అమావాస్యరోజు దాని పని పడతాడు.
అతనికి అమ్మ నాన్న లేరు. శ్మశానంలో మంత్రం తప్పుగా చదవడంవల్ల అతని తండ్రిని పీక్కు తిన్నదని చెప్పుకుంటారు. ఇందులో నిజమెంతో తెలియదుగాని అతని తండ్రి స్మశానంలోనే చనిపోయాడు. చిన్నప్పట్నుంచీ తండ్రి నేర్పిన మంత్రాలే ఇప్పుడతనికి తిండి పెడుతున్నాయి.
సరిగ్గా ఎప్పుడో తెలియదుగానీ అతను ఇటీవల పునర్వసు ప్రేమలో పడ్డాడు. ఆమెకు ఇరవై ఏళ్ళుంటాయి. దేవుడు ముందు పెట్టిన నిమ్మకాయలా పచ్చగా మెరిసిపోతుంటుంది ఆమె. శరీరంలో ప్రతి అవయవమూ పెద్దదే. కళ్ళ నుంచి కాళ్ళ వరకూ వుండాల్సిన సైజుకంటే కాస్త ఎక్కువగా వుంటాయి. సన్నగా, పీలగా వున్న తను ఆమె ప్రేమలో ఎలా పడ్డానా అని పులిరాజు అప్పుడప్పుడూ ఆశ్చర్యపోతుంటాడు.
అతని ప్రేమ గొడవంతా పునర్వసుకు తెలియదు. ఇప్పటివరకు ఒన్ సైడ్ లవ్ గానే వున్న తన ప్రేమను డబుల్ సైడ్ లవ్ గా చెయ్యాలని అతను తెగ ఆరాటపడి పోతున్నాడు.
ఈరోజు ఎలాగయినా తన ప్రేమను ఆమె ముందు ఏకరువు పెట్టాలని నిర్ణయించుకునే అతను బయలుదేరాడు. కానీ ఎక్కడో ఏదో జంకు వెనక్కి లాగుతోంది.

ఆ వీధి మలుపు తిరగగానే పులిరాజు గుండె వేగం హెచ్చింది. వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. మరో నిముషంలో పునర్వసు కనిపిస్తుందన్న ఆలోచనలతో శరీరం చిన్న జర్క్ ఇచ్చింది.
దెయ్యాలను తరిమే తనలాంటివాడు కూడా ప్రేమ విషయం వచ్చేసరికి భయపడడం వింతగా అనిపిస్తోంది అతనికి. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలన్న తపన ఎక్కువైంది. ఆమె ఒంటరిగా ఎప్పుడు కనబడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. తను కనపడగానే ఏమేం చెప్పాలో చాలాసార్లు రిహార్సల్స్ వేసుకున్నాడు. తన తండ్రి వశీకరణమంత్రం నేర్పించనందుకు తిట్టుకున్నాడు కూడా.
అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. తూర్పు ఆకాశంలో చంద్రుడు అప్పటికే తెల్లగా నవ్వుతున్నాడు. గాలి పూలలోని పుప్పొడిని ఒంటికంతా స్ప్రే చేసుకున్నట్లు సువాసనలను విరజిమ్ముతోంది.

పునర్వసు ఇల్లు దగ్గరపడింది.

అతని అడుగులు తడబడ్డాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూశాడు. పునర్వసు ఎక్కడా కనపడలేదు. ఆ ఇంటిని దాటి వెడుతూ లోపలికి చూశాడు.
పెరట్లో పాలు పితుకుతోంది ఆమె. చిత్రపటంలో లాగా ఆమె మొదటిసారి చిన్నగా కనిపించింది. ఓ సెకనుపాటు నిలబడ్డట్టు ఆగి, ఆపై ముందుకు సాగిపోయాడు.

గుండె వేగం అప్పటికి తగ్గింది. ఆమెను మరోసారి చూడాలన్న ఆరాటం శరీరాన్ని ముందుకు తోస్తోంది. వీధి చివరికంటా వెళ్ళి వెనక్కి తిరిగాడు.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.