నేను బాకీ వుంది ఆయనకే 2 87

మా వూరికి రెండు ఫర్లాంగుల దూరంలో శివాలయం వుంది. సుగుణా వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి ఆరయింది. అప్పటికే రాత్రంతా మేల్కొని వుండటం ఎవరికి వారు తమకు ఇష్టమైన కాలక్షేపాన్ని వెదుక్కుంటున్నారు.

నా భర్త అప్పటికే రెడీ అయిపోయి నాకోసం చూస్తున్నారు. మొలకు కాషాయవస్త్రం, చేతుల్లో చిటికెలు చూడటంతోనే ఆయన పండరి భజనకి వెళ్ళడానికి తయారైనట్లు అర్థమైంది.

“నేను భజనకి వెళుతున్నాను. ఈరోజు తెల్లారేవరకు భజన వుంటుంది. వడ్డించు తిని వెళతాను” అని చిటికెలు టేబుల్ మీద పెట్టారు.

ఆయనకి భోజనం పెట్టాను.

మరో పదినిముషాలకు బయల్దేరాడు.

“మరి నీ కాలక్షేపం ఏమిటి? కబుర్లాడుకునేందుకు వంశీ కూడా వచ్చినట్లు లేడే?” అన్నాడు.

“ఉదయం నుంచీ కనబడలేదు. బహుశా సినిమాకేమైనా చెక్కేశాడేమో. ఈరోజు ఒక టిక్కెట్టుకు రెండు షోలు కదా.”

“బోర్ కొడితే అలా దేవాలయం దగ్గరికి రా. ఈరోజు భజన బ్రహ్మాండంగా వుంటుంది. తబలా మాస్టార్ ని తిరుపతి నుంచి పిలిపించాం.

“అలానే!”

ఆయన అత్యుత్సాహంతో వెళ్ళిపోయాడు.

మళ్ళీ మళ్ళీ వంటగిన్నెలన్నీ సర్దడం ఎందుకని నేనూ భోజనం ముగించి వీధిలోకి వచ్చి నిలబడ్డాను.

ఆ కోలాహలం చెప్పడానికి మాటలు చాలవు.

వీధి దీపాలకింద గుంపులు గుంపులుగా జనం. వయసులో వున్న ఆడపిల్లలు జట్లు జట్లుగా విడిపోయి నాలుగురాళ్ళ ఆట ఆడుతున్నారు. మరికొందరు తొక్కుడు బిళ్ళకు ఉపక్రమించారు. మరికొందరు వెన్నెల కుప్పలు ప్రారంభించారు. ఇంకొందరు కుంటాట అందుకున్నారు. కాస్త వయసు ముదిరిన స్త్రీ పురుషులు వరండాల్లో జేరి దాయాలాట ఆడుతున్నారు. వృద్ధులు పులీమేక ఆటలో లీనమైపోయారు. మరికొందరు భజన దగ్గరికి బయల్దేరారు.

నేనూ ఏదో గ్రూప్ లో చేరిపోదామని అనుకుంటూ వుండగా సుగుణ, మమతా వచ్చారు.

“ఏం చేద్దాం?”

“అదే ఆలోచిస్తున్నాను.”

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.