నేను బాకీ వుంది ఆయనకే 1 196

మొన్న దసరా ఉత్సవాలకు నెరబైలులో నాటకం వేశాము. సుభద్రా పరిణయం, నాటకం ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభం అవుతుందనగా కృష్ణుడు, సుభద్ర పరార్. నాకు బీపీ రైజ్ అయిపోయింది. హార్మోనియం పెట్టెను అలా వదిలేసి లాంతర్లు తీసుకుని బయల్దేరాం వాళ్ళను వెదకటానికి. గుట్టలూ, పుట్టలూ అన్నీ తిరిగాం. ఎక్కడా కనిపించలేదు. ఆరుబయలు తిరుగుతున్నా చెమట్లతో తడిసి ముద్దయిపోయింది నా శరీరం. మరో అరగంటపాటు రాళ్ళల్లో, ముళ్ళల్లో తిరిగితే చివరికి ఓ బ్రిడ్జికింద దొరికారు. వాళ్ళను చూడగానే నిర్వాహకుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఎక్కిళ్ళ మధ్య అడిగాడు ఎందుకిలా పారిపోయి వచ్చారని? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. దాంతో రాత్రయ్యేటప్పటికి బ్రిడ్జి కింద చేరిపోయారు.

“కృష్ణుడు వేషం వేసింది నెరబైలు వ్యక్తికాదా?” గుంపులోంచి ఓ వ్యక్తి అడిగాడు.

“కాదు. చివరి నిమిషంలో ఆయనకు టైఫాయిడ్ పట్టుకునేసరికి హీరోయిన్ గా చేసే అపర్ణకే మొదటి కృష్ణుడ్ని తెమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. ఇంకొకరు ఎందుకులెమ్మని ఆమె తన భర్తనే తెచ్చింది.”

“వాళ్ళిద్దర్నీ బ్రీడ్జి నుంచి పట్టుకొచ్చి నాటకం మొదలెట్టారా?”

“ఆఁ మేం వచ్చేటప్పటికే చుట్టూ వున్న డేరాలో సగాన్ని చించేశారు ఆడియన్స్. వాళ్ళ కోపాన్ని తగ్గించి నాటకం మొదలు పెట్టేసరికి తెల్లవారుఝామున మూడయింది.”

వింటున్న వారందరూ నవ్వారు. వర్ష కూడా పెదవి విడీవిడకుండా నవ్వింది.

నాగరికతకు దూరంగా విసిరేసినట్టుండే ఇలాంటి పల్లెట్టూళ్ళలో సెక్స్ ఒక్కటే రిక్రియేషన్. ఆ కబుర్లతోనే కాలక్షేపమని బోధపడింది ఆమెకు.

వాళ్ళు మాటల్లో వుండగానే ఊరొచ్చింది.

ఊరి పొలిమేరల్లో ప్రవేశిస్తుంటే అదో విధమైన ఉద్వేగం మొదలయింది ఆమెలో. ఆ క్షణం వరకు ఎలాంటి సంబంధంలేని ఆ గ్రామంలో సుమారు మూడేళ్ళపాటు పనిచేయ్యాల్సి రావడం విచిత్రంగానే అనిపించింది. జీవితమంటేనే మనం ఊహించని సంఘటనల సమ్మేళనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోవడం జీవితంలో అత్యంత విషాదం. అదే సమయంలో వినోదం కూడా, జరిగే పరిణామాలను బట్టి అది ఆధారపడి వుంటుంది.

వీధి మొదట్లోకి రాగానే “అదిగోనమ్మా! సర్పంచ్ ఇల్లు. అక్కడికెళ్ళి ఆయనను కలుసుకోండి. మీకు అన్ని సదుపాయాలూ అమరుస్తాడు” అని చెప్పి డ్రామా మాష్టారు మరో వీధిలోకి దారి తీశాడు.

అలాగేనన్నట్టు తలవూపి ముందుకు సాగింది.

సర్పంచ్ ఇల్లు పెద్దదే. ఇంటిముందున్న వరండాయే టౌన్లో ఆమె ఇల్లంత వుంది. ఉదయపుటెండలో ఆ ఇల్లు దేవతల రాజు తలమీది కిరీటంలా వుంది.

ద్వారం దగ్గర నిలబడి “ఏమండీ!” అంటూ పిలిచింది.

కొంతసేపటికి ఓ అమ్మాయి ద్వారం దగ్గరికి వచ్చి “ఎవరూ!” అంటూ ప్రశ్నార్థకంగా చూసింది.

ఆమెకూ వర్ష వయసే వుంటుంది. ఇంకా పెళ్ళికాలేదు. అందంగా, అంతకంటే నాజూగ్గా వుంది. ఒంటిమీద కనిపించీ కనిపించకుండా వున్న పసుపుఛాయ. దేవతల వెనక కనిపించే వెలుగులా వుంది.

“నేను ఈ వూరికి కొత్తగా వచ్చిన టీచర్ని. పేరు వర్ష. సర్పంచ్ గారున్నారా?” అంటూ తనను తాను పరిచయం చేసుకుంది.

“టీచరా! లోపలికి రండి. నాన్నగారు వస్తారు” అని లోపలికి ఆహ్వానించింది ఆమె.

వర్ష లోనికి అడుగులు వేసింది.

ఇంటి దొడ్లో వున్న పొయ్యి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ ఓ స్టూలు వేసి కూర్చోమంది. వర్ష కూర్చున్నాక ఆమె వివరాలు అడిగి తెలుసుకుంది.

తన గురించి అంతా చెప్పాక “నా గురించి అన్నీ అడిగావు. మరి నీ గురించి చెప్పవేమిటి?” అని అడిగింది వర్ష. వాళ్ళిద్దరూ ఆ కొద్ది సమయంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఏకవచనంలోకి దిగారు.

“నా గురించి చెప్పుకోవడానికేముంది? నాపేరు ధాన్య. మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకా పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో వుండే చదువుకున్నాను. ఆపైన చదివించడం నాన్నకు ఇష్టం లేకపోవడంతో ఇక్కడకు వచ్చేశాను. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేనూ నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు.”

“నీ పేరు చాలా బావుంది.”

“థాంక్స్” ఆ పదాన్ని చాలారోజుల తరువాత ఉచ్ఛరించింది ధాన్య.

అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురితోపాటు మరో అమ్మాయిని చూసి, ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు.