“అందుకే గదా మనం ఇంత ఆలోచించేది. మనం ఏ మాత్రం లీక్ అయినా జనం మన భరతం పడతారు. అందుకే ఆచీ తూచీ అడుగు వేయాలి. ఎంత ఆలోచించినా మన పథకంలో లొసుగులు కనబడడం లేదు. దీనికి మనం సూత్రధారులమైతే, ఇక పాత్రధారులు మనకు కావాలి. ఇందులో సహాయపడేందుకు మూడో వ్యక్తి అవసరం” ఆగాడు వెంకట్రామయ్య.
“ఆ వ్యక్తి ఎవరు? మన పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగల వ్యక్తి ఎవరు?”
“ఉంది……”
ఆ వ్యక్తి ఎవరో వినడానికి పులిరాజు చెవులను రిక్కించాడు.
“మోహన….” కొంతసేపు ఆగి తిరిగి చెప్పాడు వెంకట్రామయ్య.
“అవును. ఆమే సరైన వ్యక్తి. మనమీద అభిమానమూ, గోపాలకృష్ణ మీద అసహ్యమూ వున్న వ్యక్తే దానికి ఒప్పుకుంటుంది. గోపాలకృష్ణ మీద ఆమెకు ఎలాంటి ద్వేషం లేకపోయినా మనమీద అభిమానం వుంది చాలు. డబ్బు ఎర చూపించి ఆమెను బుట్టలో వేసుకోగలగాలి.”
“దీనికి ఆమె ఒప్పుకుంటుందా?” పులిరాజు అనుమానంగా అడిగాడు.
“ఒప్పించాలి.”
ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళుంటూ నడుస్తున్నారు.
“మనకు విజయం కలిగించమని క్షుద్రదేవతలను పూజించాం కదా. ఇక గోపాలకృష్ణ పతనం అట్టే దూరంలో లేదు. మోహన మనం వెళ్ళేసరికి ఇంటికి వచ్చి వుంటుంది. ఆమెను ఒప్పిస్తే ఇక మనం చేయాల్సిన పని ఏమీ వుండదు. అన్నీ వాటంతటవే జరిగిపోతాయి” వెంకట్రామయ్య నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు.
“ఇదంతా త్వరగా జరగాలి. మొన్న వసంతాల రోజు అమ్మాయిలు చివరికి పునర్వసు కూడా వాడిమీదే వసంతాలు కుమ్మరించింది, అది తలుచుకున్నప్పుడంతా ఒళ్ళు భగ్గున మండిపోతోంది”
“అవును. ఊరులో ఏ ఫంక్షన్ జరిగినా వాడి చేయి మొదట పడాలి. రథం కదలాలంటే కూడా వాడు వచ్చి మొదటి హారతి ఇవ్వాలి. చివరికి కీలెరిగి వాత పెట్టాలి. ఇకనుంచీ ఈ ఊరికి నేనే రాజు కావాలి. పూటకు గతిలేనివాడు వంశాన్ని అడ్డం పెట్టుకుని రాజభోగాలు అనుభవిస్తాడా! అందుకే మనం ఆ పథకం వేసింది.”
“అవునూ! వాడేమిటి- చివరలో రెచ్చిపోయి టీచరమ్మమీద వసంతాలు పోశాడు” పులిరాజు సడన్ గా అడిగాడు.
“అదే నాకూ అర్థం కావడంలేదు. వాడు ఆ పిల్లమీద మనసుపడి వుండాలి. లేకుంటే ఊరి జనం అంతా చూస్తూ వుండగా అంత డేర్ గా వసంతాలు పోయడు. బహుశా ప్రేమిస్తున్నాడేమో….”
“నాకూ అదేననిపించింది. కానీ వాడు ప్రేమించేదేమిటి! ఒకరోజు వాడుకుని వదిలేస్తాడు.”
“అంతే….. అంతే…..”
ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు.
మోహన వాళ్ళకోసం చూస్తూ రెడీగా వుంది.
“ఏమిటి బాబుగారూ! రమ్మన్నారట” అంది ఆమె వెంకట్రామయ్య కనపడగానే.
“ఇక్కడ అందరూ వున్నారు. మన ముగ్గురికీ తప్ప ఇది మరొకరికి తెలియకూడదు. డాబా మీదకు ఎయా. అక్కడికి ఎవరూ రారు” అని ఆయన మెట్లెక్కడం ప్రారంభించాడు.
రెండు మెట్లెక్కి ఆగి ద్వారం దగ్గరున్న ఇంటి నౌకరుతో “నారాయణా! ఎవరినీ పైకి రానివ్వకు” అని చెప్పి తిరిగి బయల్దేరాడు.
ముగ్గురూ డాబా మీదకు చేరుకున్నారు.
అప్పటికే అక్కడ ఆయనకు రాత్రి సరంజామా అంతా అమరి వుంది
ఆయన కుర్చీలో కూర్చుని మిగిలిన ఇద్దరినీ కూర్చోమన్నట్లు సైగ చేశాడు.
వాళ్ళు కూడా కూర్చున్నారు. మోహన కూర్చోగానే- “అబ్బబ్బ గాలి ఆడడం లేదు” అంటూ పైట తీసి ఒళ్ళో వేసుకుని కొంగుతో విసురు కోవడం మొదలుపెట్టింది.
ఆమె అలవాటే అంత. ఎంత గాలి వీస్తున్నా, ఎక్కడ వున్నా- “గాలి ఆడడం లేదు” అంటూ పైట తీసి ఒళ్ళో వేసుకుంటుంది. ఆమెను అలా చూసి చూసి ఏనుగులా వుండే వూజారి పంతులు పీనుగులా అయి పోయాడు.

There is no new stories to post since 8th onwards.