నేను బాకీ వుంది ఆయనకే 4 116

ఊరేగింపులో వసంతోత్సవాల ఘట్టం అంతే నరుడికి చాలా ఇష్టం.

అబ్బాయిలు, అమ్మాయిలు చక్కగా ముస్తాబై వసంతాన్ని నింపుకుని తమను మనసుపడ్డవాళ్ళ కోసం హాడావుడిగా వెదకడం- వాళ్ళు కనిపించగానే తొందర తొందరగా వసంతాన్ని నెత్తిమీద కుమ్మరించడం వసంతం తనను పూర్తిగా తడిపేసినప్పుడు కళ్ళు తుడుచుకుంటూ తన మీద వసంతాన్ని పోసిన వ్యక్తికేసి కొంటెగా, అంతకంటే ఆత్మీయతతో చూడడం అబ్బాయిలయితే అమ్మాయిలవైపు ‘తెలిసిందిలే- గుట్టు తెలిసిందిలే’ అన్నట్లు చూడడం- అమ్మాయిలు సిగ్గు బరువుతో ఎదుటి వ్యక్తికేసి ఆరాధనతో పెదవులపై చిరునవ్వులను పూయించడం. ఇవన్నీ చూస్తూ చిన్నపిల్లాడే అయిపోతాడు అతను. అందుకే నాలుగు గంటల నుంచే రథం దగ్గరకు వెళదామని తన గురుడ్ని పోరుపెట్టాడు.

గోపాలకృష్ణకూ తొందరగా అక్కడికి వెళ్ళాలని వుంది. వర్ష తప్పక అక్కడికి వస్తుందని తెలుసు. గ్రామంలోని వాళ్ళంతా వసంతాల దగ్గర గుమికూడుతారు. అందులో చాలామందే పాల్గొంటారు. వసంతాల దగ్గర గుమికూడుతారు. అందులో చాలామందే పాల్గొంటారు. వరసయిన వాళ్ళ మీద వసంతాలు చల్లడం అక్కడి సాంప్రదాయం. కాస్త వయసైన వాళ్ళు మాత్రం అందులో పాల్గొనకుండా ప్రేక్షకులైపోయి, వసంతాలు పోసుకుంటున్న వాళ్ళను చూస్తూ ఎంజాయ్ చేస్తారు.

వసంతాలను చూడడం ఎవరూ మిస్ చేయారు. కాబట్టి వర్షను ధాన్య అక్కడికి తీసుకువస్తుందని అతని నమ్మకం. కాని మరీ నాలుగు గంటలకే అక్కడికి వెళ్ళడం ఇబ్బందిగా అనిపిస్తుందని వెళ్ళలేకపోయాడు.

చివరికి ఆరుగంటల ప్రాంతాన ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు.

వీధుల్లో నీళ్ళు చల్లడంతో మట్టి వాసన గమ్మత్తుగా ఆ ప్రాంతమంతా ఆవరించింది. ముగ్గులు ఎవరో వనదేవత మెడలోని ముత్యాలదండల్లా వున్నాయి. కాలం చెక్కమీద సంధ్యకాంతిని అరగదీసి కలిపినట్టు వసంతం నీళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి.

పంతులు రథం ఎక్కి అందులోని ఉత్సవ విగ్రహానికి పూజ చేస్తున్నాడు. గోపాలకృష్ణను చూడగానే అందరూ అడ్డు తొలిగారు. అతనూ, నరుడూ ముందుకు సాగి రథం ముందు నిలుచున్నారు.

గోపాలకృష్ణ కళ్ళు వర్ష కోసం వెదుకుతున్నాయి. ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఏదో తెలియని నిరాశ గుండెను మెలిపెడుతోంది.

ఇంకా పంతులు పూజ చేస్తున్నాడు.

అప్పటికే కుర్రకారంతా చేతుల్లో చెంబులు పుచ్చుకుని పూజ ఎప్పుడు ముగుస్తుందా, వసంతాలు చల్లుకుందామా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఎవరిమీద వసంతం పోయాలోనని ఆలోచిస్తున్నారు.

పంతులు చివరిసారిగా మంత్రాలు బిగ్గరగా చదివి, విగ్రహం మెడలోని పూలమాలను సరిచేసి కిందకు దిగాడు.

వృద్ధులు అలా చేతులు జోడించి ఉత్సవమూర్తిని భక్తి పారవశ్యంతో చూస్తున్నారు.

పులిరాజు, వెంకట్రామయ్య ఓ మూలచేరి గోపాలకృష్ణ వంక గుర్రుగా చూస్తున్నారు. ఇంకెంత కాలం ఈ భోగం అన్నట్లు వాళ్ళిద్దరూ అతనివైపు చులకనగా చూస్తూ ఏదో గొణుక్కుంటున్నారు. ఈ మసక వెలుతురులో వాళ్ళు వేటకు బయలుదేరిన నక్క, తోడేలు జంటలా వున్నారు.

అలా కళ్ళు తిప్పుతున్న గోపాలకృష్ణ ఓ దగ్గర ఆగిపోయాడు.

అక్కడ ధాన్య, ఆమె వెనక వర్ష నిలబడి చూస్తున్నారు.

ఆరోజు విచిత్రంగా చంద్రోదయం ఆకాశంలో కాకుండా జనంలో జరిగినట్టు మెరిసిపోతున్న వర్ష ముఖారవిందాన్ని చూసి అతను ఎగ్జయిట్ మెంట్ కు గురయ్యాడు.

అక్కడి నుంచి చూపులను మరల్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఏదో ట్రాన్స్ లో వున్నట్లు అతను అటువైపే చూస్తున్నాడు.

“వసంతాలు ప్రారంభిద్దామా బాబుగారూ?” పంతులు మెల్లగా అడిగాడు అతడ్ని.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.