నేను బాకీ వుంది ఆయనకే 4 116

అలాగేనన్నట్లు తల వూపాడు.

వసంతోత్సవం ప్రారంభమైనట్లు పంతులు జనంవైపు చూసి సంజ్ఞ చేశాడు. దీనికోసమే ఎదురుచూస్తున్న యువకులు ఒక్కసారిగా ముందుకు దూకారు. తమమీద ఎవరైనా వసంతాలు పోస్తారేమోనని తమను తాము రక్షించుకోవడానికి కొందరు ఇళ్ళవైపు పరుగెత్తారు. వాళ్ళను వెంటాడుతూ చెంబులోని వసంతం చిందిపోకుండా పరుగెడుతున్నారు మరికొందరు.

క్షణంలో అక్కడి వాతావరణం కోలాహలంగా తయారయ్యింది.

అంతలో పునర్వాసు జనం మధ్యలోంచి దూరి వసంతాన్ని తీసుకుని, అంతే వేగంతో వచ్చి గోపాలకృష్ణ మీద దాన్ని కుమ్మరించింది. తెల్లటి బట్టలు ఎర్రగా, అక్కడక్కడా పసుపుపచ్చగా తయారై సాక్షాత్తూ ఆ మన్మథ దేవుడు అక్కడ ప్రత్యక్షమైనట్లు అతను మెరిసిపోయాడు.

పులిరాజు కళ్ళల్లో వసంతం పడి మండినట్లు గిజగిజలాడిపోయాడు. అతనికి తెలియకుండానే అతని పిడికిలి గోపాలకృష్ణ మీద కసితో బిగుసుకుంది.

తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి అలా పరాయి మగాడిమీద వసంతం పోయడం అతను భరించలేకపోతున్నాడు. దీన్ని గమనించిన వెంకట్రామయ్య అతని భుజంపై బాధపడవద్దన్నట్లు చేత్తో చరిచాడు.

పునర్వసు అలా గోపాలకృష్ణమీద వసంతం పోయడాన్ని మిగిలిన జనం బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు చప్పట్లు చరిచారు.

ఆమె అటు వెళ్ళగానే మరో అమ్మాయి వసంతాన్ని అతనిమీద పోసింది. మళ్ళీ జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. అతను అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవడాన్ని చూసి పులిరాజు ఈర్ష్యతో ఉడికిపోతున్నాడు. ఊర్లో అతని డామినేషన్ చూసి వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతున్నాడు. కోపం కంటే ఈర్ష్య డేంజరస్. అందుకే పులిరాజు నిలువెల్లా దహించుకుపోతున్నాడు.

గోపాలకృష్ణకు నీళ్ళు పైన పడుతుండడం వల్ల ఊపిరి ఆడడం లేదు. కళ్ళల్లో సన్నటి మంట. అయితే దాన్ని లెక్క చేయకుండా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వర్షవైపు చూస్తున్నాడు.

అతను అలా తనవైపే చూస్తున్నాట్లు భ్రమిస్తోంది ధాన్య.

“నా హీరో నావైపే చూస్తున్నాడు. అలా వెళ్లి కాసింత వసంతం చిలకరించి వస్తాను” అంది వర్షతో.

“అలా చేశావంటే నేను వెళ్ళిపోతాను. ఆచారం పేరుతో ఆడపిల్లల్ని నాశనం చేసే అతను హీరోనా? తాతా ముత్తాతల పేరు చెప్పుకుని నయా పైసా పని చేయకుండా వేళకు షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగించే ఆ సోమరిపోతు నీ హీరోనా? నాన్సెన్స్…… నువ్వు వసంతం పోయడానికి వెళితే నేను ఇంటికి వెళ్ళిపోతాను….. అంతే” చివరగా బెదిరించింది వర్ష.

“అయితే పోయానులే. నువ్వు వెళ్ళిపోయావంటే నాకు తోచదు” లోపల మనసు పడుతున్న కష్టాన్నంతా కళ్ళల్లో వ్యక్తపరుస్తూ చెప్పింది ధాన్య.

అమ్మాయిలు ఒక్కొక్కరే వచ్చి గోపాలకృష్ణ మీద వసంతాలు పోస్తున్నారు నరుడు ఉత్సాహంగా గురువుగారికి జరుగుతున్న వసంతా భిషేకాన్ని చూస్తున్నాడు.

అంతలో గోపాలకృష్ణకు ఓ కొంటె ఆలోచన వచ్చింది. దాన్ని తలుచుకుంటుంటే తెలియని ఉత్సాహం రక్తాన్ని ఊపేస్తోంది.

అనాది ప్రేమికులంతా అతన్ని ముందుకు నెడుతున్నారు. అజ్ఞాత శక్తులు అతన్ని ప్రేరేపిస్తున్నాయి. ధైర్యం, అంతకంటే మించిన తెగువ మున్ముందుకు తోస్తున్నాయి. ఏదో ఉద్రేకం విచక్షణాజ్ఞానాన్ని మింగేసింది.

అంతే….. తనమీద వసంతం పోసి ఎదురుగా నిల్చుని నవ్వుతున్న అమ్మాయి చేతిలోని వెండి చెంబును లాక్కున్నాడు.

అలా నిలబడి బుద్ధిగా వసంతాలు పోసుకోవడమే తప్ప, ఎన్నడూ వసంతాలు ఎవరిమీదా పోయాని గోపాలకృష్ణ మొదటిసారి చెంబు చేతుల్లోకి తీసుకోవడంలో జనం ఉత్కంఠతో నిలుచుండిపోయారు. ఆ తరువాత అతను ఏం చేయబోతాడోనని రెప్పలు వాల్చకుండా చూస్తున్నారు.

గోపాలకృష్ణ నెమ్మదిగా నడిచి చెంబు ముంచాడు. ఎర్రటి వసంతం చెంబు నుంచి జారుతుండగా పైకి లాగాడు.

తల పైకెత్తాడు తనమీద పోయడానికే వసంతం నింపుకున్నాడని అంతకు ముందు అతని మీద వసంతాలు పోసిన స్త్రీలంతా ఎవరికి వారే అనుకుంటూ టెన్షన్ గా నిలబడి చూస్తున్నారు.

అయితే గోపాలకృష్ణ చూపులు ధాన్యవైపు ప్రసరించగానే జనం కీ ఇచ్చిన బొమ్మల్లాగా అటువైపు తలలు తిప్పారు.

ధాన్య అయితే చిన్నపిల్లలా కేరింతలు కొడుతోంది.

అతను నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ధాన్య మరికొంత ముందుకు వచ్చి నిలబడాలని అనుకుంది గానీ కాళ్ళు కదలడం లేదు.

అతను మరింత దగ్గరయ్యాడు.

వసంతం పోసుకోవడానికి ప్రిపేర్ అయిపోయిన ఆమె కళ్ళు మూసుకుంది. జనం బిర్రబిగుసుపోయి చూస్తున్నారు.

గోపాలకృష్ణ దాన్యను సమీపించి, పక్కకు ఓ అడుగువేసి చెంబు ఎత్తి వర్శపై కుమ్మరించాడు.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.