నేను బాకీ వుంది ఆయనకే 4 116

ఆమె పెదవుల మధ్య చిర్నవ్వు పాల నురగలా పొంగింది.

“రా” అని చేయి పట్టుకున్నాడు.

ఇద్దరూ కొండ ఎక్కారు.

భవనానికి పక్కగా ఆరుబయల్లో వాళ్ళిద్దరికీ పడక ఏర్పాటు చేశాడు నరుడు. అతను అప్పటికే లోపల గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.

ఇద్దరూ వెళ్ళి పడకమీద కూర్చున్నారు.

“అవునూ! ఇంతకీ మీ టీచర్ ఏముంటుంది?” అని అడిగాడు.

అప్పుడు మరో స్త్రీ ప్రస్తావన రావడం ఇబ్బంది అనిపించలేదు ధాన్యకు. వర్ష గురించి డీటైల్స్ అనీ విన్నాక తను ఇంతవరకు ఎవరికీ చెప్పని సంఘటన గురించి అడిగాడు.

ఇది కాస్త చెప్పేస్తే ఇక ఆలస్యం వుండదన్న ఆత్రుతతో ఆమె చెప్పడం ప్రారంభించింది.

“ఈ సంఘటన మరొకరికి చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అందుకే ఎక్కడ నుంచి ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు” అని ఓ క్షణం ఆగి తిరిగి కొనసాగించింది.

“అప్పుడు నేను మద్రాసులో వుండేదాన్ని. డిగ్రీ చదవడానికి అక్కడికి వెళ్ళాను. కోడంబాకంలో మా మేనత్త వుండేది. ఆమెకు ఎవరూ లేరు. ఒక్కత్తే వుండేది. ఆమెతోపాటు వుండి చదువుకోవడనికి నిర్ణయం జరిగింది రోజూ కాలేజీకి వెళ్లడం, తిరిగి రావడం ఇలా జరుగుతున్నాయి. రోజులు.

ఓరోజు మా మేనత్త ఎవరో బంధువు చనిపోయాడంటే ఊరెళ్ళింది. నేనొక్కదాన్నే ఇంట్లో.

సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక బోర్ గా అనిపించడంతో సాలెగ్రామ్ కు వెళ్ళాలనుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్ వుంది. దాంతో పిచ్చాపాటీ వేసి ఏడుగంటలకల్లా తిరిగి ఇల్లు చేరుదామని నిర్ణయించుకుని బయల్దేరాను.

సిటీబస్సులు మారి దానిల్లు పట్టుకునేటప్పటికి వీధిదీపాలు వెలిగాయి. ఆకాశం బాగా మబ్బు పట్టడం వాళ్ల అప్పుడే చీకట్లు ముసురుకున్నాయి.

ఇంత కష్టపడి అక్కడికి వెళితే నా ఫ్రెండ్ లేదు. సినిమాకెళ్ళిందని చెప్పారు. ఉసూరుమంటూ తిరిగి బయల్దేరాను. వీధిలోకొచ్చేటప్పటికి ఓ వాన చుక్క నా ముక్కమీద పడి బ్రద్దలైంది.

నాలుగు అడుగులు వేశానో లేదో చినుకులు ప్రారంభమయ్యాయి. వడివడిగా నడుస్తూ బస్సు టెర్మినల్ దగ్గరకొచ్చాను. మా కాలనీ బస్సు కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను.

నాకు అటుగా వున్న ఓ యువకుడు నన్ను అదేపనిగా చూస్తున్నాడు. నేను గమనించినా అతను చూపులను మరల్చుకోవడంలేదు. సిటీలో ఇలాంటివి మామూలే గనక నేను పట్టించుకోలేదు. కానీ అతను మాత్రం నన్ను తినేసేలా చూస్తుండటం క్రీగంట గమనిస్తూనే వున్నాను. అతని చూపులు ఎక్కడెక్కడ తగుల్తున్నాయో తలెత్తి చూడకపోయినా తెలుస్తూనే వుంది.

చినుకులు ఎక్కువయ్యాయి. జల్లు మీద పడుతుండడంతో నేను మరి కాస్త వెనక్కి జరిగాను.

వర్షానికి అక్కడ చాలామంది గుమికూడడం ప్రారంభించారు. బాగా రష్ గా వుంది.

“ఛీ….. ఛీ….. వెధవ వాన” అని నాలో నేనే విసుక్కున్నాను. నా పెదవుల కదలికలను కనిపెట్టి కాబోలు “మీరు తెలుగా?” అని అడిగాడు అతను.

దూరంగా నిలుచున్నా అతను నా పక్కకు ఎప్పుడు చేరాడో నేను గమనించలేదు. నా పక్కన నిలబడడమే గాకుండా ఎంతో చనువుగా మేనత్త కూతుర్ని పలకరించినంత సునాయాసంగా మాట్లాడుతున్న అతన్ని చూసి నిజంగానే ఒక్కక్షణం భయమేసింది. అదే క్షణంలో కోపం కూడా వచ్చింది.

1 Comment

  1. There is no new stories to post since 8th onwards.

Comments are closed.