కావలెను – Part 1 278

“చెప్పుచ్చుకున్నట్టున్నారు… తర్వాత వాళ్ల ఊసెత్తలేదు. ఆ తర్వాత మా మన్మధుడు పుట్టుకొచ్చాడు”

“మన్మధుడా… ఏదీ ఆ రతి హజ్బెండ్…”

“స్స్…మీ అనిరుద్దిడి అబ్బరా నీయబ్బ…”

“అంకుల్ పేరు మన్మధరావు కదా”

“ఏదో ఓ రావులే… కొడుక్కి తనలోని కళాపోసన అంతా ఉగ్గుపాలతో పోసి తనంతటోడు కావాలని మన్మధరావన్న పేరు పెట్టాడు. ఆ ముసలోడికి మల్లే వీడికి ఉద్యోగం సద్యోగం లేక, సినిమాల్లో నటిస్తానని మద్రాసెళ్లాడు… జ్యోతిలక్ష్మి, జయమాలినీలని హీరోయిన్లుగా చేయమన్నాడు. ఆ సినిమా పిచ్చితో లక్షలకు లక్షలు హారతులిచ్చేసి వచ్చాక బలవంతంగా మెడలు వంచి పెళ్లి చేస్తే మా అనిరుద్ధుడు పుట్టాడు” బామ్మ చెప్పడం ఆపింది.

“ఆ తర్వాతేమైంది బామ్మా..” ఆవులిస్తూ అడిగాడు కార్తీక్.

“నాకు భయం పట్టుకుంది… మా అనిరుద్ధుడు కూడా వాళ్లలా చెడిపోతాడేమోనని”

“అసలు నీకు అట్లాంటి థాట్ ఎవరు ఇచ్చారు బామ్మా…”

“మా అనిరుద్ధుడు కూడా వాళ్లకు మల్లె ఉద్యోగం చేయనని మొండికేయడం వల్ల.

“ఉద్యోగానికీ చెడిపోవడానికీ లింకేమిటి?”

“ఉందిరా కార్తీకుడు… నా మొగుడు తాసీల్దార్ ఉద్యోగం చేస్తుంటే బుద్దిగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత బుద్ధిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటూ ఉండేవాడు… ఇట్టా చెడిపోయి ఆస్తినంతా గుమ్మడికాయ హల్వా చేసేవాడు కాదు…”

“స్స్…స్స్…స్స్…” అన్నాడు ఏమనాలో తోచక కార్తీక్

“నా కొడుకు మన్మధరావు కూడా తండ్రి దారిలోనే వెళ్లక హాయిగా ఏ ఉద్యోగమో చేసుకున్నా బావుండు… ఏ పనీలేక దిక్కుమాలిన పనులతో ఒళ్లు ఇల్లు గుల్ల చేసుకునేవాడు కాదు… నా కొడుకు కారు యాక్సిడెంట్లో పోతూ పోతూ అనిరుద్ధుణ్ణి చేతిలో పెట్టాడు. వాడికి వాడి తండ్రి తాతయ్యల పోలిక రాకూడదనే నా కోరిక”

“అసలు నీ పాయింటేమిటి బామ్మా…”

“నా మనవడు ఉద్యోగం చేయాలి… చిన్నదైనా పెద్దదైనా… అప్పుడే ఓ దారిలోకి వస్తాడు. ఆ తర్వాత వాడికి మంచి పిల్లను చూసి పెళ్లి చెయ్యాలి. బుద్ధిగా ఉద్యోగాన్నీ, పెళ్లాన్నీ కనిపెట్టుకొని ఒక్కరు లేక ఇద్దర్ని కనిపెట్టి నా చేతుల్లో పెడతాడు…. నేను రుక్మిణీ, సీత అనుకుంటూ…”

“కృష్ణా రామా కదా బామ్మ…” “నేను ఆడదాన్ని, మా జాతి వాళ్లనే తలచుకుంటాను” అంది ‘అలాగా’ అన్నట్టు చూశాడు కార్తీక్.

“అదిరా సంగతి… అందుకే నా మనవణ్ణి ఉద్యోగం చేయమంటున్నాను. వాడేమో ఉద్యోగం చేయను అంటున్నాడు” దీర్ఘంగా విశ్వసించి చెప్పింది బామ్మ,

“నీ బాధ వెనుక ఇంత పెద్ద మూడు తరాల ఫ్లాష్ బ్యాక్ ఉందా?” సానుభూతిగా అడిగాడు కార్తీక్.

“ఏం చేయమంటావ్రా… ఉద్యోగం చేసుకుంటే బాధ్యతగా వుండి బుద్ధిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటాడనే… ఉద్యోగం వెతుక్కునే వరకు చిల్లిగవ్వ ఇవ్వనన్నాను. దాంతోవాడు నా దగ్గర డబ్బు తీసుకోవడమే మానేశాడు. అయినా ఈ డబ్బంతా చచ్చేటప్పుడు నేను కట్టుకుపోతానా” అంటూ బొడ్లో నుండి పదివేల రూపాయల కట్ట తీసి కార్తీక్ ఇచ్చింది.

“ఇది నీ ఫ్రెండ్ కివ్వు… నేనిచ్చానని చెప్పకు…” అంటూ కళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయింది బామ్మ

“అమ్మ నా బామ్మ… ఎంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ బాకులా గుండెలో పెట్టుకున్నావ్…” అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు కార్తీక్.

***