కావలెను – Part 1 278

“ఇప్పుడా?… ఇప్పుడు నా బంగారుకొండ నిద్ర చెడిపోదూ….”

నోరు వెళ్లబెట్టి “అందుకని నా నిద్ర చెడగొడతావా? నీ కన్నా ఇడీ అమీన్ బెటర్ బ్రతికున్న రోజుల్లో మెదళ్లు గుండెకాయలు తిన్నా చచ్చి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వేంటి అంటే నిద్రపోతున్న నన్ను నిద్రలేపి క్లాసు పీకుతున్నావు” కోపం, నిద్ర చెడిపోయిందన్న ఒళ్లు మంటనీ మిక్స్ చేసి అన్నాడు కార్తీక్.

“ఒక్కరోజు నిద్ర పోకపోతే వచ్చే నష్టమేమీ లేదు. రేపట్నుంచి దుప్పటెం ఖర్మ… ఏకంగా పరుపే కప్పుకొని పడుకుందువుగానీ… నేను పోయాక నా పరుపు నీ పేరు మీదే రాసిస్తాలే” బామ్మ అంది.

ఒకసారి బామ్మ వంక పిచ్చిచూపులు చూసి, “రేపట్నుంచి ఇక్కడ పడుకుంటే ఫోర్క్ మాంసం తిన్నంత ఒట్టు” కసిగా అన్నాడు కార్తీక్.

“నువ్వు ఫోర్క్ తింటే నాకెందుకు…. ఎలుగొడ్డు మటన్ ఫ్రై చేసుకుంటే నాకెందుగ్గానీ… ఒరే కార్తీకుడూ… నువ్వూ నా మనవడిలాంటివాడివే కదరా…”

“అబ్బ… సెంటిమెంట్తో ఆయింటిమెంట్ లేకుండా వాతలు పెడతావు కదా బామ్మా…. నీ బాధేమిటో చెప్పు?” అన్నాడు బుద్ధిగా లేచి మంచంలో పద్మాసనం వేసి కూర్చొని.

బామ్మ లేచి నిలబడింది. కురుక్షేత్రంలో కృష్ణుడి విశ్వరూపం కనిపించింది కార్తీక్ కి.

“చెప్పేది… మొత్తుకునేది… చస్తానని బెదిరించేది అంతా నేనే… అది నైన్టీన్ థర్టీసిక్స్…

“ఎ లవ్ స్టోరీనా?” కూసింత ఆసక్తిగా అడిగాడు కార్తీక్.

“కాదు… ఎ ట్రాజెడీ స్టోరీ… మధ్యలో టీవీ సీరియల్ లో చాలాసేపు వచ్చే యాడ్స్ లా డిస్ట్రబ్ చేయకు….”

“సరే బామ్మా… నువ్వు కూడా డైలీ సీరియల్ మాదిరి కాకుండా, ఇంగ్లీష్ సినిమాలా క్లుప్తంగా చెప్పు”.

బామ్మ చెప్పడం మొదలుపెట్టింది.

“మా ఆయన మంచి కళాపోషకుడు.. కంటికి నదురుగా కనిపించిన అమ్మాయిలను పోషించడంలో సకల కళా వల్లభుడే… తండ్రితాతల ఆస్తి. ఉద్యోగమూ సద్యోగమూ లేదు. చేతి నిండా డబ్బు… ఒంటి నిండా బంగారం… ఇంకేం… ఆ రోజుల్లో ఊరి చివర వుండే చిత్రాంగి దగ్గర్నుండి నాలుగూళ్ల అవతల వుండే చింతామణి వరకూ ఆయన పాత ఖాతాలే…

“తాతయ్యకు అంత గొప్ప హిస్టరీ ఉందా? మరి నిశ్శబ్దాన్ని ఛేదించలేదా?. ”

“ఏ నిశ్శబ్దం?”

“అదే బామ్మా.. నిశ్శబ్దాన్ని ఛేదించండి…. పులిరాజా వస్తున్నాడు…” బామ్మకు విషయం సగం అర్ధమైంది.

“ఆయన పులిరాజా లాంటివాడే కానీ పులిరాజా కాదు. ఆ రోజుల్లో ఇలాంటి దిక్కుమాలిన జబ్బుల్లేవ్… అయినా స్టోరీ మధ్యలో ఇంటర్ఫియరవ్వకు…” బామ్మ కసురుకుంది. కార్తీక్ అలాగే అన్నట్టు బుద్ధిగా తలూపాడు.

“వీళ్ల తాతని ముద్దుగా మైనర్ బాబు అని పిలిచేవాళ్లు ఊల్లోని ఆడంగులు… తాసిలార్ ఉద్యోగం చేయబోతున్నాడని చెప్పి నా గొంతు కోశారు….” ముక్కు చీది కార్తీక్ చొక్కాకు తుడిచి కొ…న…సా…గిం…చిం…ది.

“అలా అలా ఆ రోజుల్లోనే అంజలీదేవిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. వహీదా రెహ్మాన్ దగ్గరికి వెళ్లి, ‘నన్ను పెళ్లి చేసుకోవా?’ అని అడుగుతానన్నాడు… చెప్పా పెట్టకుండా మెడ్రాస్ రెయిలెక్కి వెళ్ళొచ్చాడు” .

“వాళ్లు ఒప్పుకున్నారా?” కుతూహలంగా అడిగాడు కార్తీక్.