కావలెను – Part 1 278

“ఎక్స్ క్యూజ్ మీ… మేము డ్రీమ్ టీవీ నుండి వస్తున్నాం.

‘ఏం చేయాలనుకుంటున్నారు?” అనే కాన్సెప్ట్ తో స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రేమికులు, పెళ్లయిన వాళ్లు, నిరుద్యోగులు, వైద్యులు, మహిళలు… ఇలా ఎవరైనా సరే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పొచ్చు…” కార్తీక్ వైపు చూస్తూ చెప్పింది యాంకర్.

కార్తీక్ కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు. మైక్ చేతిలోకి తీసుకున్నాడు.

“హలో… ఐయామ్ కార్తీక్… పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. నాకు పెద్ద రైటర్గా పేరు తెచ్చుకోవాలని ఉంది. భవిష్యత్తులో రైటర్ని కావాలనుకుంటున్నాను”

“రైటరా…. ఇప్పుడు పత్రికలు చదివే వాళ్లు ఉన్నారా?” అడిగింది యాంకర్.

“ఏం… మార్కెట్లో పత్రికలు అమ్మడం లేదా?? ”

“నా ఉద్దేశం అదికాదండీ… రైటర్ అంటే మార్కెట్ ఉంటుందా? అని”

“విదేశాల్లో రైటర్లు కార్లలో తిరుగుతారు. మన రైటర్లు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు. టి.వి.కి, సినిమాలకు, పత్రికలకు రాసి బోల్డు సంపాదించవచ్చు…

“సో… మీరు భవిష్యత్తులో రైటర్ అవ్వాలనుకుంటున్నారు… ఆల్ ది బెస్ట్ అండీ.., ఇప్పుడు కెమెరా అనిరుద్ర వైపు తిరిగింది.

“మీరేం చేయాలనుకుంటున్నారండీ….” యాంకర్ అనిరుద్రను అడిగింది.

“చెప్తే నాకెంతిస్తారు?” అడిగాడు అనిరుద్ర. యాంకర్ షాకయ్యింది. ‘స్టాప్….’ అని అరిచింది కెమెరామెన్ వైపు చూసి.

“నాకర్ధం కాలేదు….” అంది అయోమయంగా.

“మీ ప్రోగ్రాంలో పాల్గొంటే నాకెంతిస్తారు? అని అడుగుతున్నాను”

“మేము ఇవ్వడమేమిటండీ… ఇది సరదాగా చేస్తున్న ప్రోగ్రామ్… మీ అభిప్రాయాలను ప్రేక్షకులు చూస్తారు. మిమ్మల్ని గుర్తుపడతారు”

“నా అభిప్రాయాలను ప్రేక్షకులు చూస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? నన్ను గుర్తుపట్టడం వల్ల నాకు ఒరిగేదేమిటి? నేనేం సినిమాస్టార్ నో, బిజినెస్ మేన్నో, ఎట్లీస్ట్ డర్టీ పొలిటీషియన్ నో కాదు కదా…. అయినా ఈ ప్రోగ్రామ్ చేయడానికి మీరు యాంకరింగ్ కు డబ్బు తీసుకుంటున్నారు కదా….” అనిరుద్ర అడిగాడు.

“తీసుకుంటున్నాను”

“ఈ కెమెరామెన్”

“తీసుకుంటున్నాడు”

“క్యాసెట్ డబ్బు పెట్టే కొంటున్నారు కదా”