కావలెను – Part 1 278

స్టాఫ్ మరోసారి చప్పట్లు కొట్టారు. స్టాఫ్ ఒక్కొక్కరే వెళ్తున్నారు. నిఖిత హుషారుగా స్కూటీని బయటకు తీసింది. సరదాగా తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ తనకు ఈ విధంగా పనికొచ్చినందుకు మురిసిపోయింది.

అనిమిష ఇంటికి వచ్చేసరికి హాలంతా నీట్గా ఉంది. టీపాయ్ మీద చిప్స్ ప్యాకెట్… కాఫీ ఫ్లాస్క్ రెండు కప్పులు ఉన్నాయి. అనిమిషకు సగం అర్ధమైంది. మిగతా సగం బాత్రూంలో నుండి స్నానం చేసి నైటీలో వస్తూ ద్విముఖ చెప్పింది.

“నా ఫేవరెట్ ప్రోగ్రాం వస్తుంది… ఎంత కష్టపడి చేసి వుంటాననుకుంటావ్… కానీ చూసేవాళ్లు చాలామంది అలా ఛానల్ మార్చి ఇలా చూస్తారుగానీ… ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం ఎంత కష్టమనుకున్నావ్?” ఉపోద్ఘాతం లేకుండానే మొదలుపెట్టింది ద్విముఖ.

“నేను కూడా ఫ్రెషప్ అయి వచ్చాక నీ సాధక బాధకాలు వింటాను” అంటూ హ్యాండ్ బ్యాగ్ ని సోఫాలోకి గిరాటేసి బాత్రూంలోకి వెళ్లింది.

పది నిమిషాల తర్వాత మొహం తుడుచుకుంటూ వచ్చి టీవీ ఎదురుగా వున్న సోఫాలో కూర్చుంది.

“ఇప్పుడు చెప్పు… చిప్స్ తింటూ వింటా” అంది చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ..

“అసలు యాంకర్ జాబ్.. అంటే…” అని చిప్స్ ప్యాకెట్లోని చిప్స్ నోట్లో వేసుకొని, “చిప్స్ బాగున్నాయి కదూ… మొన్నోసారి స్నాక్స్ స్నాక్స్ ప్రోగ్రామ్ కోసం ఓ బేకరీకి వెళ్లి షూట్ చేస్తుంటే ఆ బేకరీ వాళ్లు నన్ను మెచ్చి ఓ పది పన్నెండు చిప్స్ ప్యాకెట్స్ ఫ్రీగా ఇచ్చారు. కెమెరామెన్, శ్వేత, అసిస్టెంట్లు పంచుకోగా మిగిలిన ప్యాకెట్ ఇది…” చెప్పింది ద్విముఖ.

“యాంకర్ అనిపించుకున్నావు… అసలు ఆ దేవుడు వసపిట్టల్ని సృష్టించినప్పుడు… మా డ్యూటీలేమిటని బ్రహ్మని అడిగాయట… మీ డ్యూటీ… టీవీలు వచ్చాక ఎక్కువవుతుంది…

మీ స్నేహితులు మీ దారిలోనే నడుస్తారు.. మీకు యాంకర్లు అనే కొత్త పేరు జత చెప్పాడట” నవ్వి అంది అనిమిష

“సెటైరా? మా యాంకర్ల కష్టాలేం తెలుసు… మొన్న ‘ఏం చేయాలనుకుంటున అన్న ప్రోగ్రామ్లో భాగంగా ఓ శాల్తీని ఇదే ప్రశ్న అడిగితే, “అందమైన అమ్మాయిలను చేయాలనుకుంటున్నాను” అని చెప్పాడు. మరో శాల్తీ అయితే నేనేం చేస్తే మీకెందుకు? అని ఇంకొందరు మావైపు హీనంగా చూశారు. టీవీలో కనిపించాలనే ఇంట్రెస్ట్ వున్న వాళ్లను ఇలా ప్రోగ్రామ్స్ పట్ల ఆసక్తి వున్న వాళ్లను పట్టుకోవడం అంత సులభం కాదు”

“చాలామందికి ఓ అనుమానం. మేమే ప్లాన్డ్ గా ముందు మనుషులను ప్లాన్ చేసి ఉంచుతామని. రిహార్సల్స్ చేయిస్తామని. ఏదో ప్రోగ్రామ్! అలా వుంటే వుండొచ్చుగాక. అన్నీ అలా ఉండవు కదా… కొందరైతే మేము షూటింగ్ చేయడానికి వెళ్తే మా వెనకే ప్రపంచ గూఢచారులా ఉంటారు. మేము వెళ్లకముందే అన్నీ చెక్ చేసుకుంటారు”

“అన్నీ చెక్ చేసుకుంటారంటే గుర్తొచ్చింది. మొన్నీ మధ్య మా కొలీగ్ ఒకనాడు ఏదో వంటల ప్రోగ్రామ్ వాళ్ల ఇంట్లో ఏర్పాటు చేసిందట. షూటింగ్ అయిపోయాక చూస్తే దేవుడింట్లో దేవుడి మినీ హుండీ కనిపించలేదంట. కొంపదీసి షూటింగ్ వాళ్లే నొక్కేసి ఉంటారంటావా? డౌట్ గా అడిగింది అనిమిష

“ఛఛ… అలా అయి ఉండదు. అయినా ఆ విషయాలు నేనెలా చెప్పగలను? అన్నింటిలోనూ ఇంటూలు డివైడెడ్ బైలు ఉంటాయి”

“అదేంటి ప్లస్లు… మైనస్లు అంటారు కదా…” అంది అనిమిష ఆశ్చర్యపోయి.

“టీవీ యాంకర్ ని కదా… వెరైటీ కోసం వాడాను….” అంటూ టైం చూసుకుంది.

“టైమైంది… డిస్ట్రబ్ చేయకుండా ప్రోగ్రామ్ చూడు…” అంటూ టీవీ ఆన్ చేసింది.

***