కావలెను – Part 1 278

అనిరుద్ర వెంటనే ఆ వ్యక్తితో “ఆగండి మాస్టారూ…” అని ఆటోడ్రైవర్ వైపు తిరిగి, “ఎందుకొచ్చిన గొడవ… ఓ యాభై తీసుకొని వెళ్లు… నీకు ఓ పది లాభం” అన్నాడు.

“ఏంటి… సెటైర్లు వేస్తున్నావా? నాకు పది లాభం ఏంటి? యాభై బొక్కవుద్ది. మీటర్ చూసి డబ్బు ఇవ్వండి. నేనేం చందాలు అడగడం లేదు” అన్నాడు ఆటోడ్రైవర్ “ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో. స్టేషన్ నుంచి ఇక్కడికి నలభైకి మించి అవ్వదు యాభై తీసుకొని వెళ్లు”

“అదేం కుదర్దు… మీటర్ చూసి డబ్బులివ్వండి” “నలభైకి మించి అవ్వదని చెప్తున్నాగా”

“ఎలా చెబుతారండీ… మీటర్ కన్నా మీకు ఎక్కువ తెలుసా?”

“సరే నలభైకి మించి అవ్వదని నిరూపిస్తే” “నిరూపించండి చూద్దాం”

“సరే ఓ పని చేద్దాం… నేను మరో ఆటోని పిలుస్తాను. నా వెనకే వచ్చేయ్. ఆ ఆటో బిల్లు ఎంతయితే అంతే నీకు ఇస్తాను. కానీ నా ఆటో బిల్లు నువ్వు పే చేయాలి” అన్నాడు అనిరుద్ర.

“ఏ ఆటో బిల్లు అయినా ఒకటే అవుతుంది” ఆటోడ్రైవర్ అన్నాడు.

“అవుతుంది… ట్యాంపరింగ్ చేస్తే అనిరుద్ర చెప్పాడు. అప్పటివరకూ వాదిస్తున్న ఆటోడ్రైవర్ మొహంలో రంగులు మారాయి.

“మీటర్ వినియోగించే ప్రధాన గేర్ వీల్ కు అరవై నాలుగు పళ్లుంటాయి. ఇది ఒక చుట్టు తిరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాన్ని తొలగించాలి. యాభై ఆరు పళ్లు వుండే గేర్ వీల్ ని ఏర్పాటుచేస్తే గేర్ వీల్ కు ఎన్ని తక్కువ పళ్లుంటే మీటర్ వేగం అంత ఎక్కువ చూపిస్తుంది.

పాయింట్ నంబర్ టూ… ఆటో మీటర్ దగ్గర వుండే వర్క్ గేర్ కి ఇరవై పళ్లుంటాయి. పదహారు పళ్లు వుండే వర్క్ గేర్ ని ఏర్పాటుచేస్తే త్వరగా తిరిగి బిల్ ఎక్కువ వస్తుంది” అనిరుద్ర చెప్పడం ఆపి ఆటోడ్రైవర్ వంక చూసి, కొద్దిగా ఆగాడు.

“నీ ఆటో నంబర్ ఎంతో చెప్పు… తూనికలు, కొలతల శాఖ లేదా పోలీసులకు ఏ ఒక్కరికి ఫోన్ చేసినా వాళ్లే చూసుకుంటారు”

ఆటోడ్రైవర్ ఏమనుకున్నాడో వెంటనే, “పొద్దున్నే గొడవ ఎందుకు సార్… ఆ యాభై “ఇచ్చేయండి” అన్నాడు.

“కాదు నలభయ్యే… నాతో పదినిమిషాలు వాగించినందుకు టైం కిల్ అమౌంట్” అంటూ ఆటోలో వున్న వ్యక్తి వైపు చూశాడు. ఆ వ్యక్తి నలభై రూపాయలు ఆటోడ్రైవర్ కు ఇచ్చాడు. ఆటోవాలా గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

“అవునవును…” అంటూ తన పక్కనే వున్న అతణ్ణి మోచేత్తో పొడిచింది. ”

ఆ వ్యక్తి అరవై రూపాయలు అనిరుద్ర చేతిలో పెట్టాడు. అనిరుద్ర అందులో నుండి మూడు పది రూపాయల కాగితాలు తీసుకొని, మిగతా మూడు పది కాగితాలు ఆ వ్యక్తికి ఇచ్చాడు.

“థాంక్స్” చెప్పాడా వ్యక్తి. కు

“ఇందాకోటి చెప్పానుగా… సరే… సగం లాభం ఇచ్చారు కాబట్టి మీకు ఎప్పుడూ పనికి వచ్చే రెండు, మూడు టిప్స్ చెబుతాను వినండి. ఎప్పుడైనా ఆటోలోకి ఎక్కగానే మీటర్ ఫ్లాగ్ ని పూర్తిగా డ్రైవర్ కిందకి తిప్పాడో లేదో గమనించాలి. సగమే తిప్పితే మొత్తం కిందకి తిప్పమని చెప్పండి. ఆటోను వెయిటింగ్లో పెట్టాల్సి వస్తే, దిగే ముందు మీటర్ రీడింగ్ గమనించి, ఆ తర్వాత ఆటో ముందుకు కదలగానే రీడింగ్ ను పరిశీలించండి” అని చెప్పాడు అనిరుద్ర. ”

ఆ వ్యక్తి సరే అన్నట్టు తలూపి ముందుకు కదిలాడు.

***

“ఒరే అనూ… నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ వుందిరా…” అన్నాడు కార్తీక్.

“మూడ్రూపాయలు పెట్టి పేపర్ కొన్నప్పుడు కనీసం ముప్ఫై రూపాయలకు సరిపడా ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఎలా… ఎప్పుడూ పత్రికలు కొని చదవడానికి కక్కుర్తి పడుకు” అని చెప్పి అయ్యర్ హోటల్ లోకి దారితీశాడు అనిరుద్ర. వేడి వేడి ఇడ్లీలు రెడీ అవుతున్నాయి అయ్యర్ హోటల్లో,

***

బాత్రూంలోని షవర్ కు చెమట పట్టింది. అద్దానికి ఉద్వేగపు కౌంట్ డౌన్ మొదలైంది. మూలన పడి వున్న బట్టలు వేసే స్టాండ్ కళ్లు విప్పార్చి చూస్తోంది. మొత్తం మీద ఆ స్నానాల గది ఆపసోపాలు పడుతోంది. కారణం మరి కాసేపట్లో అనిమిష ఆ గదిలోకి అడుగుపెట్టబోతోంది.

* * *