కావలెను – Part 1 278

“హౌస్ హజ్బెండ్ ని అవ్వాలని అనుకుంటున్నాను” “వ్వాట్…?” షాకింగ్ గా అడిగింది యాంకర్..

“యస్… హౌస్ హజ్బెండ్ ని అవ్వాలని అనుకుంటున్నాను”

“నేనడిగేది మీరే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు? అని” యాంకర్ రెట్టించి అడిగింది.

“హజ్బెండ్ జాబ్… భర్తగా జాబ్ చేసి జీతం తీసుకుంటాను” కామ్గా చెప్పాడు అనిరుద్ర.

“భర్తగా జాబ్ చేయడమేంటి?” విస్మయంగా అడిగింది యాంకర్..

“హౌస్ వైఫ్ ఎలానో…. హౌస్ హజ్బెండ్ అలా… కాకపోతే నేను శాలరీ బేసిస్లో పని చేయాలనుకుంటున్నాను… త్వరలో దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా పేపర్లలో ఇద్దామనుకుంటున్నాను… దట్సాల్… థాంక్యూ…”

కార్తీక్ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చాడు. ఆ మిరపకాయ బజ్జీలు వున్న పొట్లం విప్పి యాంకర్ ముందు పెట్టి, “తీసుకోండి… స్పైసీ బట్ టేస్టీ” అన్నాడు అనిరుద్ర.

యాంకర్ ఓ మిరపకాయ బజ్జీని నోట్లో పెట్టుకుంది. కళ్లల్లోంచి నీళ్ళోచ్చాయి.

అనిరుద్ర మిరపకాయ బజ్జీలను ఇష్టంగా తింటున్నాడు. కార్తీక్ కెమెరామెన్ కు మిరపకాయ బజ్జీలు ఇచ్చాడు.

****

“మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. కాకపోతే ఒక వ్యక్తికి రెండు నిమిషాల వ్యవధే కనుక డిటైల్డ్ గా చేయలేకపోయాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరగంటపాటైనా ఇంటర్వ్యూ చేస్తాను…”

“అప్పుడైనా మీ ఛానల్ వాళ్లు రెమ్యునరేషన్ పే చేస్తారా?” నవ్వుతూ అడిగాడు అనిరుద్ర.

“నేనే పర్సనల్ గా పే చేసి ఇంటర్వ్యూ చేస్తాను. బైదిబై అయామ్ ద్విముఖ…” అంటూ స్నేహ పూర్వకంగా చెయ్యి చాచింది.

ఆ చేతిని స్నేహ పూర్వకంగా నొక్కి వదిలాడు అనిరుద్ర..

ఆ పరిచయం గొప్ప మలుపుకు నాంది కాబోతోందన్న విషయం ఆ క్షణం వాళ్లకు తెలియదు.

***

బీచ్ రోడ్ లోని అరోమా కాలనీలోని అయిదో యింట్లో వాతావరణం సునామీకి ఎక్కువ, కత్రినాకు తక్కువగా ఉంది. విశాలమైన ఆ ఇంటి చుట్టూ చెక్కలతో ఫెన్సింగ్ ఉంది. మధ్యలో చెక్కగేటు, ఫెన్సింగ్ చుట్టూ బంతిపూల చెట్లు… మధ్యలో ఇల్లు… ఓవైపు బాదం చెట్టు, ఇంటి వెనుకవైపు జామ, దానిమ్మ చెట్లు… బాదం ఆకులు నేల మీద పడి వింత అందంతో మెరుస్తున్నాయి.

ఆ ఇంట్లో వున్న పెద్ద దిక్కు ప్లస్ ఓనర్ అయిన అరవై రెండేళ్ల సత్యవతమ్మ అనబడే బామ్మ తీవ్రంగా ఆలోచిస్తోంది. మధ్య మధ్య అటు ఇటూ పచార్లు చేస్తోంది. ఓసారి సీలింగ్ ఫ్యాన్ వంక, మరోసారి కిచెన్ రూమ్లో వున్న కూరగాయలు తరిగే చాకు వంక చూస్తోంది.

హాలులోకి వెళ్లింది. హాలులో వున్న ఫేము కుర్చీలో కూర్చొని గోడకు వున్న ఫొటో వంక చూసింది. అనిరుద్రకు తెల్ల వెంట్రుకలు వచ్చి, గుబురు మీసాలు పెడితే ఎలా వుంటుందో ఆ ఫొటోలోని రూపం అలా ఉంది. మొగుడి ఫొటో వంక చూడగానే, ఆ ఫొటోలో మొగుడు బదులు స్టయిల్ గా అనిరుద్ర కనిపించాడు.