కావలెను – Part 1 278

శోభరాజ్ సర్వీసెస్

సరిగ్గా ఆరేళ్ల క్రితం ఓ చిన్న గదిలో ప్రారంభమైన సంస్థ శోభరాజ్ సర్వీసెస్. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, సలహాలు, పబ్లిసిటీ… ఇలా ఎవరికి, ఎలాంటి అవసరం వచ్చినా ముందుగా సంప్రదించేది శోభరాజ్ సర్వీసెస్ నే. శోభరాజ్ కు వచ్చిన ఐడియా ఫలితం ఇది.

ఆరేళ్లలో శోభరాజ్ సర్వీసెస్ కు మంచి పేరు వచ్చింది. శోభరాజ్ వృత్తిపరమైన సమర్ధత ఒక కారణమైతే, అతను తన స్టాఫ్ ను ఎంపిక చేసుకునే పద్దతి… వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ కల్పించడం మరో కారణం.”

అను శోభరాజ్ది డిఫరెంట్ క్యారెక్టర్. కొన్ని విషయాల్లో ఫ్రాంక్ గా ఉంటాడు. ఏ విషయాన్ని అయినా మొహమ్మీదే చెప్పేస్తాడు. విలక్షణమైన రీతిలో అతని స్వభావం ఉంటుంది. చాలా విషయాల్లో ప్రాక్టికల్. .

విశాలమైన ఆ హాలులో మూడు వరుసల్లో ఒకేలాంటి కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీల్లో స్టాఫ్ కూర్చున్నారు. స్టాఫ్లో డిజిగ్నేషన్స్ ఏవైనా, అసెంబ్లీ టైంలో అంతా ఒక్కటేననే ఉద్దేశం శోభరాజ్ది. తొమ్మిది నలభై అయిదుకల్లా ముప్పాతిక స్టాఫ్ వచ్చేశారు. పది గంటలకు రిజిష్టర్ లో సంతకం చేయాలి. అరగంట గ్రేస్ టైం. పదిన్నర తర్వాత వచ్చిన వాళ్లు సంతకం చేసి ‘ఆలస్యానికి కారణం’ లేట్ అన్న కాలమ్లో రాయాలి. అలా నెలలో మూడుసార్లకు మించి వుంటే శోభరాజ్ ఆ ఉద్యోగిని తన ఛాంబర్లోకి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

ఆఫీస్ టైంలో ఎవ్వరూ మాట్లాడుకోకూడదు. లంచ్ టైంలో ఎవరి స్వేచ్ఛ వారిది. విజిటర్స్ రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. అతని సంస్థలో పనిచేసే వాళ్లెవరూ బ్యాంకుల్లో లోన్లు తీసుకోకూడదు. తన ఉద్యోగులు ఎక్కడో అప్పు చేయడం ఇష్టం ఉండదు. తనే బ్యాంకు వడ్డీ కన్నా కనీసం ఆరు శాతం తగ్గించి ఇస్తాడు.

ఆ కారణాల వల్ల ఉద్యోగుల్లో ‘డ్యూటీ కాన్షియస్ నెస్’ పెరుగుతుందన్న నమ్మకం శోభరాజ్ది. ముపై నాలుగేళ్ల శోభరాజ్ అవివాహితుడు. తనకు నచ్చిన అమ్మాయి దొరకనందువల్లే పెళ్లి చేసుకోలేదని ‘పెళ్లేందుకు చేసుకోలేదని అడిగిన వాళ్లకు కారణం చెబుతాడు.

మూడు వరుసల్లో వున్న కుర్చీల్లో రెండు కుర్చీలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక కుర్చీ అకౌంట్స్ సెక్షన్ లో పనిచేసే నిఖితది కాగా మరో కుర్చీ అనిమిషది.

తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు. శోభరాజ్ అసెంబ్లీ హాలులో డయాస్ మీద నిలబడ్డాడు. స్టాఫ్ అటెండెన్స్ రిజిష్టర్లో సంతకాలు చేసి తమ తమ సీట్లలో కూర్చున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా శోభరాజ్ టేబుల్ మీద వున్న టేప్ రికార్డర్ లో ప్లే బటన్ నొక్కాడు. అయిదు నిమిషాల ప్రసంగం అందులో ఉంటుంది. టేప్లో నుండి శోభరాజ్ ప్రసంగం వస్తుంటే.. దానికి అనుగుణంగా శోభరాజ్ పెదవులు కదిలిస్తూ హావభావాలు ప్రదర్శిస్తుంటాడు.
“మై డియర్ స్టాఫ్… అయామ్ శోభరాజ్… అలా అని చార్లెస్ శోభరాజ్ ని కాను… పన మాస్టర్ క్రిమినల్… నేను మాస్టర్ బిజినెస్ మాన్ ని… ప్రకాష్ రాజ్ ని కాను అతనో వర్సెటైల్ ఆర్టిస్ట్… నేను మాస్టర్ బిజినెస్ క్రియేటర్స్… నేను ఏది చేసినా ఫేస్ టు ఫేస్… బ్యాక్ టు ఫేస్ నా డిక్షనరీలో లేదు. నేను టైంని దైవంగా భావిస్తాను. ఎందుకంటే… టైం కనిపిస్తుంది. దాన్ని వినియోగం చేసుకుంటే ఎన్నో ఉన్నత శిఖరాలను ఎక్కేలా చేస్తుంది. నేను టైంని మనీగా భావిస్తాను. ఎందుకంటే టైం సద్వినియోగం చేసుకుంటే బిల్గేట్స్ అవ్వొచ్చు. టాటా బిర్లా అవ్వొచు అమితాబ్ కె.బి.సి.లో తన టైం స్పెండ్ చేసి కోట్లు సంపాదించాడు. నేను టైంని లైఫ్గా భావిస్తాను ఈ టైంలో నేను బ్రతికే ఉన్నాను. బ్రతికి వున్న టైంని నేను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజు మీకు ఈ క్యాసెట్ ఎందుకు వినిపిస్తున్నాననంటే… కనీసం రోజులో అయిదు నిమిషాలైనా నా మాటలు మీకు ఆలోచన కలిగిస్తాయని… థాంక్యూ… నా మాటలు శ్రద్ధగా విన్నందుకు మీకు కాంప్లిమెంట్గా కాఫీ…”

టేప్ ఆఫ్ అయ్యింది. అటెండర్ ఆర్ముగం అందరికీ కాఫీలు సర్వ్ చేశాడు. శోభరాజ్ ఖాళీగా వున్న రెండు కుర్చీల వైపు చూశాడు. ముఖ్యంగా అనిమిష వున్న కుర్చీ వైపు.

పది గంటల పది నిమిషాలు.