కావలెను – Part 1 278

“ఒరే… ఏంట్రా ఆ అరుపు… నీ అరుపు విని సముద్రపు అలలు కూడా వెనుక్కు పరుగెడుతున్నాయి”

కార్తీక్ అనిరుద్ర వైపు చూసి, “ఈ వార్త వింటే నువ్వు వెంటనే ఇంటికి పరుగెడతావ్?” అన్నాడు వగరుస్తూ..

“అలా ఆయసపడిపోతావేం… ఏదో రన్నింగ్ రేస్లో పరుగెత్తుకు వచ్చినట్లు?”

“సినిమాల్లో సీరియస్ మ్యాటర్ వచ్చినప్పుడు ఇలాగే పరుగెత్తుకొస్తూ చెబుతారుగా… ముందు నువ్వు పద….” కంగారుగా అన్నాడు కార్తీక్.

“ఎందుకు?? తాపీగా అడిగాడు అనిరుద్ర. ..

“ఘోరం జరిగిపోబోతోంది… బామ్మ ఉరేసుకోబోతోంది…” “ఇంకా ఉరేసుకోలేదుగా…”

“ఏంటి వేళాకోళంగా ఉందా… ముందు పద…” అంటూ లేచాడు కార్తీక్.

“ఆగు… కాఫీ తాగనీ… నాలుగు రూపాయల కాఫీకి కాసేపు న్యాయం చేయొద్దూ…”

“అవతల బామ్మ అన్యాయమైపోతోంది…”

“ఓ పని చెయ్… నువ్వెళ్లు… నేను వెనగ్గా వస్తాను”

“ఇద్దరం కలిసే వెళ్తాం” అంటూ హోటల్ బయటకు అనిరుద్రను లాక్కొస్తూ ఆటోను పిలిచాడు కార్తీక్. ఆటో వచ్చి వాళ్ల ముందాగింది.

అనిరుద్ర సీరియస్గా కార్తీక్ వైపు చూసి, “ఆటో ఎందుకురా…. బస్సులో వెళ్లొచ్చుగా”

పెద్ద వెర్రికేక వేశాడు కార్తీక్. ఆ తర్వాత కీచుగొంతుతో, “అవతల లైఫ్ అండ్ హ్యాంగ్ ప్రాబ్లమ్రా” అన్నాడు.

“ఇవతల మనకు మనీ ప్రాబ్లమ్… బస్సు డబ్బులతో కాఫీ తాగాలని డిసైడయ్యాం కదా… ఇప్పుడు పెద్ద పుడింగిలా ఆటో అని పిలిచావ్… డబ్బులేవరిస్తారు? నువ్వా నీ యబ్బా..

కార్తీక్ మెదడుకు బ్యాలెన్స్ కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. అనిరుద్ర ఆటోవైపు తిరిగి డ్రైవర్ తో చెప్పాడు “నువ్వెళ్లు బాబూ” అని.

ఆటో వెళ్లిపోయింది. ఈలోగా కార్తీక్ కు చిన్న డౌట్ ఎవరో తనను తిడుతున్న ఫీలింగ్ … అప్పుడు గమనించాడు. తన చేతిలోని అనిరుద్ర మొబైల్ ఫోన్… తను ఆ ఫోన్ ఆఫ్ చేయలేదు… అంటే తమ మాటలన్నీ…
కార్తీక్ గుండె గుబేల్ మంది. ఫోన్ ను చెవి దగ్గర ఆన్చుకున్నాడు. అవతల బామ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. అది ఏ భాషో కూడా అర్ధంకాలేదు కార్తీక్ కు.

“బామ్మా” భయంగా అన్నాడు కార్తీక్.

“ఒరే తింగరి సచ్చినోడ… సరిగ్గా… సరిగ్గా పదిహేను నిమిషాల్లో మీరు ఇక్కడ వుండకపోతే నా చావుకు కారణం ఎవరో రాసిపెట్టి మరీ చస్తాను”

“అంత పని చేయకు బామ్మా… అనిరుద్ర ఇబ్బందుల్లో పడతాడు”

“వాడెందుకురా ఇబ్బందుల్లో పడతాడు?”

“మరి నువ్వు నీ చావుకు కారణం ఎవరో రాసి పెట్టి చనిపోతానన్నావ్ గా” అయోమయంగా అడిగాడు కార్తీక్.

“అవును… నేను నీ పేరు రాసి చచ్చిపోతా… నా మనవడు చెడ తిరగడానికి… చెడిపోవడానికి నువ్వే కారణం…” చెప్పి కసిగా ఫోన్ పెట్టేసింది బామ్మ.

***