కావలెను – Part 1 278

“బామ్మ నీ గురించే బెంగ పడుతుంట. నువ్వు తక్షణమే ఉద్యోగం చేయాలిట. లేకపోతే మీ నాన్న, తాతల్లా ఝనక్ ఝనక్ పాయల్ బాజేట… నీకివ్వమని నాకు డబ్బు కూడా ఇచ్చిందంట…

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… నేను కళ్లు తెరిచే సరికి డబ్బు నా దగ్గర ఉంది”

అనిరుద్ర కార్తీక్ వంక చూసి, “నీకొచ్చింది కల కాదు నిజమే.. ఓవరాక్షన్ మానేసి ఆ డబ్బు బామ్మకు ఇచ్చెయ్” అన్నాడు.

“అదేమిట్రా ఎంతో ప్రేమతో బామ్మ డబ్బిస్తే…”

“ప్రేమతో ఇచ్చినా, కోపంతో ఇచ్చినా ఆ డబ్బు నా కష్టార్జితం కాదు. మనవడిగా నాకు వండి పెడుతోంది అది చాలు. మిగతా ఖర్చులన్నీ నావే…”

“అదేమిట్రా… అంత మాట పట్టింపైతే ఎలా?”

“ఇందులో మాట పట్టింపేమీ లేదు… నువ్వు ఉద్యోగం చేయకపోతే ఆస్తిలో చిల్లిగవ్వ రాదు అంది. అసలు నేను ఉద్యోగం చేయకపోయినా ఆ ఆస్తిలో సగం చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు. నాకు బామ్మ మీద ఏ కోపమూ లేదు. పదేళ్ల కుర్రాడు కూడా పేపర్లు వేసో, పాల ప్యాకెట్లు అమ్ముతూనో డబ్బు సంపాదిస్తున్నాడు. అట్లాంటిది నేను డబ్బు సంపాదించలేనా?” అనిరుద్ర కుండ బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పాడు.

“నిన్ను మార్చడం నా వల్ల కాదుగానీ టిఫిన్ చేయడానికి మన దగ్గర క్యాష్ ఎంతుందేమిటి?”

“ఈడ్చి తన్నినా రష్యా రూబుల్ లేదు. అమెరికా డాలర్ లేదు. ఇండియన్ రూపాయి లేదు” అనిరుద్ర సెటైరిగ్గా చెప్పాడు.

“పోనీ బామ్మ ఇచ్చిన డబ్బు…” అని అనిరుద్ర మొహం వంక చూసి, “అదే అప్పుగా…” అంటూ మళ్లీ అనిరుద్ర ఎక్స్ప్రెషన్స్ చూస్తూ “వద్దులే” అన్నాడు.

సరిగ్గా అప్పుడే అక్కడ చిన్న గొడవ. ఓ వ్యక్తి ఆటో దిగి, ఆటో డ్రైవర్ తో గొడవపడ్డున్నాడు. అనిరుద్ర అటుకేసి నడిచాడు.

“నేనివ్వనంతే… మరీ ఇంత ఘోరమా… నలభైకి మించదు… వంద ఎలా అవుతుంది?” ఓ వ్యక్తి ఆటో డ్రైవర్తో గొడవపడ్తున్నాడు.

“ఇదిగోండి సార్ మీటర్ చూడండి… ఫ్రీగా ఇస్తున్నట్టు మాట్లాడతారేంటి?” ఆటోడ్రైవర్ గొంతు పెంచాడు. ఇద్దరి వాదనలు ఎక్కువయ్యాయి. ఆ వ్యక్తి కూడా వున్న అతని భార్యో, గర్ల్ఫ్రెండో…

“అయ్యో ఇచ్చేయండి గొండవెందుకు? అసహ్యంగా…” అంటోంది. ఆ వ్యక్తి విసుక్కుంటూ జేబులోంచి వంద రూపాయలు తీసి ఇవ్వబోయాడు.