కావలెను – Part 1 278

నిఖిత వగరుస్తూ వచ్చింది. శోభరాజ్ నిఖిత వంక చూశాడు.

“గుడ్ మార్నింగ్ సర్… సారీ సర్” అంది నిఖిత శోభరాజ్వైపు చూసి.

“మొదటిది విష్ రెండోది లేట్గా వచ్చినందుకు అపాలజీ కదూ” అడిగాడు శోభరాజ్.

“నో సర్… యస్ సర్” అంది ఏమనాలో తోచక.

అటెండెన్స్ రిజిష్టర్ ఆమె ముందుకు జరిపాడు శోభరాజ్. రిజిష్టర్లో సంతకం చేసి “లేట్’ అన్న కాలమ్ వైపు చూసింది.

మూడు కాలమ్స్ పూర్తయ్యాయి. “ఈ నెలలో ఇది నాలుగో లేట్…” శోభరాజ్ నిఖితవైపు చూశాడు.

“సారీ సర్… సేమ్ రీజన్… బస్సులు దొరకలేదు. ఆటోవాళ్లు మీటర్ చార్జీలు పెంచాలని మళ్లీ స్ట్రయిక్ చేస్తున్నారు” చెప్పింది నిఖిత.

శోభరాజ్ ఓసారి నిఖితవైపు చూసి తలపంకించి, స్టాఫ్ అందరివైపు చూశాడు.

“ఇవ్వాళ సాయంత్రం ఆఫీసు వదిలాక ఇక్కడ చిన్న పార్టీ ఉంది. అందరూ రావాలి… అన్నట్టు ఆ పార్టీ ఇచ్చేది నిఖితే…” అంటూ తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు.

****

భావన ఫోన్ ని క్లీన్ చేస్తుంటే ఇంటర్కమ్ రింగయింది. ఫోన్ లిఫ్ట్ చేసి, ‘యస్ సార్’ అంది. ”

“అనిమిష ఇంకా రాలేదా?” అడిగాడు శోభరాజ్.

“లేదు సర్”

“టైం పదిన్నర దాటింది కదూ…” తనలో తాను గొణుక్కున్నట్టు అన్నాడు.

“యస్ సర్”

శోభరాజ్ ఫోన్ పెట్టేశాడు. భావన రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. నిఖిత భావనవైపు చూసి గుసగుసగా, “ఏమిటి సంగతి?” అని అడిగింది.

“బాస్ ఏడ్చాడు” చెప్పింది భావన అంతే గుసగుసగా. .

“అయితే అనిమిషను రమ్మను… నాలుగేళ్ల క్రితం నుంచీ బాస్ ఇలానే ఏడుస్తున్నాడు” నిఖిత నవ్వి అంది.

ఈలోగా అటెండర్ అర్ముగం ఆ ఇద్దరి మధ్యకు వచ్చి, “ఏమిటి సంగతి?” అని అడిగాడు.