కావలెను – Part 1 278

పొద్దున్నే ఫ్రెషప్ అయి, బయటకు వెళ్తుంటే అనిరుద్రని పిలిచింది బామ్మ. వెనక్కి తిరిగి, ‘ఏంటి’ అన్నట్టు చూశాడు.

“స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఉంది. నీ కోసం అట్టే పెట్టమని చెప్పాను. వెళ్లి చేరరాదూ” బామ్మ అనిరుద్ర గడ్డం పట్టుకొని అడిగింది.

అనిరుద్ర తన గడ్డం మీద వున్న బామ్మ చేతిని తీసేసి, ‘ఎట్లీస్ట్ డైమండ్ ప్లాంట్ తప్ప చేయను… అయినా నీకెన్నిసార్లు చెప్పాలే నేనెవరి కిందా పని చేయనని…”

“పోనీ బిజినెస్ చెయ్… ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తాను”

“టెన్షన్స్.. ఆ టెన్షన్స్ తట్టుకోలేను. బిజినెస్ చేయాలంటే రకరకాల జిమ్మిక్కులు చెయ్యాలి. మోసం చేయాలి. ఎదుటివాడిని పడగొట్టాలి. ఇవన్నీ నాకవసరమా… ఎందుకే నన్నిట్లా చంపుతావ్?”

“అనరా అను నేను నిన్ను చంపుతున్నానా? బుద్ధిగా ఉద్యోగం చేసుకోమంటున్నాను… అంతే కదా”

“నాకు తెలియక అడుగుతా మీ నాన్న అదే మా ముత్తాత నిన్ను ఉద్యోగం చేయమన్నాడా.

ఒక్క క్షణం బామ్మ ఆశ్చర్యంగా చూసి, “లేదు… అయినా నాకు ఉద్యోగం ఎందుకు నా మొగుడే సంపాదించి పెడతాడు. నా మొగుడికి వండి వార్చుతూ ఉంటాను”

“నేనూ అంతేనే… నాకెందుకే ఉద్యోగం… నా పెళ్లానికి మొగుడి ఉద్యోగం , వండి వార్చుతూ ఉంటాను”

అనిరుద్ర మాటలతో ఒక్క క్షణం బామ్మ బిత్తరపోయి, “నారాయణ… నారాయణ, అంది అసంకల్పితంగా, “కాదు అనిరుద్ర… అనిరుద్ర… అను” అంటూ బయటకు నడిచాడు అనిరుద్ర.

****

“అనిరుద్రా… రాత్రి నాకో కల వచ్చింది” చెప్పాడు బీచ్ ని ఆనుకొని వున్న రెయిలింగ్ పక్కనే నడుస్తూ కార్తీక్.

“గ్యాస్ రేట్ తగ్గినట్టు కల వచ్చిందా?” అడిగాడు అనిరుద్ర.

“కాదు”

“హైదరాబాద్ లో హెల్మెట్లు పెట్టుకోవాల్సిన అవసరంలేదని సి.ఎం టీవీలో చెప్పినట్టు కలొచ్చిందా?”

“కాదు… బామ్మ కలలోకి వచ్చింది”

“వ్వాట్… ఈ వయసులో బామ్మతో డ్యూయెట్ పాడుకున్నావా? అయినా నీకు ప్రేమించడానికి బామ్మే దొరికిందా? బ్యాడ్ టెస్ట్ కూల్గా అన్నాడు అనిరుద్ర.

“ఛఛ… నాకా ఉద్దేశంతో కల రాలేదు”

“మరి ఆస్తి అంతా నీ పేరు మీద రాసినట్లు కల వచ్చిందా?”

“అబ్బా… నన్ను చెప్పనివ్వరా… రాత్రి బామ్మ నా మంచం దగ్గరికి వచ్చి నా చొక్కాలో ఐస్ క్యూబ్స్ పోసింది. నేను కెవ్వున అరిచాను. నా చొక్కాలో ఐస్ క్యూబ్స్ ఎందుకు వేశావని అడిగాను. నా మనవడి చొక్కాలో వేస్తే వాడికి జలుబు చెయ్యదూ. అందుకే నీ చొక్కాలో వేశానంది”

“ఒరే కార్తీక్… నువ్వు ప్రొడ్యూసర్ ని ఇంప్రెస్ చేయడానికి రైటర్ కథ చెప్పినట్టు చెప్పకు… మూడే మూడు ముక్కల్లో చెప్పు. ఏ బుర్రున్న ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా క్యాచ్ చేస్తాడు”

కార్తీక్ ఓసారి అనిరుద్ర వంక చూసి చెప్పసాగాడు.