కావలెను – Part 1 278

అనిరుద్ర తాపీగా, కార్తీక్ భయం భయంగా ఇంట్లోకి అడుగుపెట్టారు. మంచమ్మీద కూచొని, మంచం ముందు వున్న స్టూల్ మీద బిర్యానీ ప్యాకెట్ పెట్టుకొని తింటోంది బామ్మ. ఆమె మెడకు చీర వదులుగా బిగించి ఉంది.

అనిరుద్ర లోపలికి వచ్చి మంచమ్మీద కూర్చొని బిర్యానీ వాసన చూసి ముక్కు ఎగబీల్చి, “బిర్యానీ ఘుమఘుమ బాగానే వుంది… ఎక్కడి నుంచి తెప్పించావే?” అని అడిగాడు.

“దాబా నుంచి తెప్పించానురా…. అయినా డిటైల్స్ అవసరమా? తొందరగా తిననీ… తినేసి ఉరేసుకుంటా” అంది బామ్మ. . ,

“అదేంటే… ఎటూ చద్దామనుకుని డిసైడయ్యావ్… బిర్యానీ ఎందుకే వేస్ట్ చేస్తావ్?” అనిరుద్ర అన్నాడు.

బామ్మ కార్తీక్ వైపు తిరిగి, “ఒరే తింగరోడా… నీ ఫ్రెండ్ కు చెప్పు… నా మాట వినని వాళ్లు నాతో మాట్లాడవద్దని…”

కార్తీక్ అనిరుద్ర వైపు చూశాడు.

“ఏంటి… చెబుతావా… చంపేస్తా… నాకు నిద్రిస్తోంది… బామ్మ ఉరి ప్రోగ్రామ్ పూర్తయ్యాక లేపు… మంచి నిద్రలో వుంటే మాత్రం పొద్దున చెప్పు..” అంటూ బిర్యానీ ప్యాకెట్ నుంచి కొద్దిగా బిర్యానీ తీసి నోట్లో పెట్టుకుని “వెరీ టేస్టీ” అనుకుంటూ బయటకు నడిచాడు అనిరుద్ర.

బామ్మ అనిరుద్ర వైపు గుర్రుగా చూస్తూ బిర్యానీ సీరయిస్గా తినసాగింది.

“ఏం ఫ్యామిలీ అండీ” కార్తీక్ తల పట్టుకున్నాడు.

***

అర్ధరాత్రి రెండు కావస్తోంది.

అనిరుద్ర ఓ మంచమ్మీద కార్తీక్ మరో మంచమ్మీద పడుకున్నారు. ఇద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. కార్తీక్ కి అనిరుద్ర ఇంట్లో ఆరుబయట పడుకోవడం చాలా ఇష్టమైన విషయం. నెలలో పదిహేను రోజులకు పైగా అనిరుద్ర ఇంట్లోనే గడుపుతాడు.

బామ్మ హరర్ సినిమాలో డ్రాకులా కళ్లు తెరిచినట్లు ఠపీమని కళ్లు తెరిచింది. ఒళ్లు విరుచుకుని లేచింది. ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి, ఓ బాటిల్ తీసుకుని నీళ్లను గటగట సగం బాటిల్ వరకు తాగేసింది. ఓ చిన్న ఆలోచన కలిగిందావిడకు. వెంటనే ఐస్ క్యూబ్స్ వున్న ట్రేని లాగింది.

అందులోని ఐస్ క్యూబ్స్ ని ఓ గ్లాసులో వేసి వాటిని తీసుకొని బయటకు నడిచింది.

అనిరుద్రవైపు చూసింది. హాయిగా నిద్రపోతున్నాడు. దుప్పటిని మెడ వరకు కప్పి, నుదిటి మీద ముద్దు పెట్టుకొని కార్తీక్ మంచం దగ్గరికి వచ్చింది. దుప్పటిని మునగదీసుకొని పడుకున్నాడు కార్తీక్. ఆ దుప్పటిని పట్టి పీకింది. చలికి వణికిపోతున్నాడు కార్తీక్.

తన చేతిలో వున్న గ్లాసులోని ఐస్ క్యూబ్స్ ఒక్కొక్కటి తీసి కార్తీక్ చొక్కాలో వేసింది.

పెద్ద వెర్రికేక వేసి లేచి, తన చొక్కాలో పడిపోయిన ఐస్ క్యూబ్స్ ని చూసి మళ్లీ కేకవేసి, “బామ్మా ఏంటిది?” అని ఏడుపుగొంతుతో అడిగాడు.

“ఐస్ క్యూబ్స్… ట్రేలో నీళ్లు పోసి డీప్ ఫ్రిజ్ లో పెడితే ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. అప్పుడప్పుడూ మందులోకి వేసుకుంటాను”

“నేనడిగింది ఐస్ క్యూబ్స్ ఎలా తయారవుతాయని కాదు. చలికి వణుకుతుంటే దుప్పటి లాగి… అర్థరాత్రి ఐస్ క్యూబ్లు నా ఒంటి మీద ఎందుకు పోశావని?” ఏడుపు గొంతుతో అన్నాడు కార్తీక్..

“నీ ఫ్రెండ్ ని ఉద్యోగం త్వరగా వెతుక్కోమను… నాకు వయసైపోతోంది. నేను చచ్చేలోగా వాడు ఏదోక ఉద్యోగం చేయడం చూడాలి…”

“ఆ విషయం నువ్వే చెప్పొచ్చుగా….”