కావలెను – Part 1 278

“కార్తీక్… ఈ టైంలో బీచ్లో అమ్మే ముంతకింది పప్పుగానీ, మిరపకాయ బజ్జీలుగాని తింటే బావుంటుంది కదూ…” అడిగాడు అనిరుద్ర.

“ఎందుకలా అనుకుంటున్నావు?”

“రాత్రి ఓ నవల చదివాను. పేరు ‘ఒక గుండె సవ్వడి” అనుకుంటాను. అందులో హీరోయిన్ కు ఇలాంటి కోరిక పుడుతుంది”

“నీకో విషయం తెలుసా అనిరుద్ర….” గుసగుసగా అన్నాడు కార్తీక్.

“ఏమిటి… ఆ కథలో హీరోవి నువ్వేనా?” నవ్వుతూ అడిగాడు అనిరుద్ర.

“కాదు… ఆ నవల రాసింది మనమే” ఇంకా గుసగుసగా అన్నాడు. అనిరుద్ర తాపీగా చూసి, “ఒహో… అలాగా….” అన్నాడు.

“అదేంటి షాకవట్లేదు… కార్తీక్ అసహనంగా అడిగాడు.

“షాకా… ఎందుకు? రాసే ఉంటావ్… అన్నట్టు నువ్వెప్పుడు సెక్స్ మార్పిడి చేయించుకున్నావ్?” మరింత తాపీగా అడిగాడు అనిరుద్ర. .

“ఏం… ఎందుకలా అడుగుతున్నావ్?”

“మరేం లేదు… ఆ నవల రాసింది రచయిత కాదు రచయిత్రి….” చెప్పాడు అనిరుద్ర.

***

ఒక్కసారిగా బీచ్లో చిన్న కలకలం.

“అనిరుద్రా… టీవీ వాళ్లు….” హుషారుగా చెప్పాడు కార్తీక్. “అయితే ఏంటి?” అడిగాడు అనిరుద్ర.

“అయితే ఏమిటంటావేంటి? మనమెల్లి వాళ్ల ఎదురుగా నిలబడితే, కెమెరాలోపడి టీవీలో కనిపిస్తాం” ఉత్సాహంగా చెప్పాడు కార్తీక్. .

ఈటీవీలో కనిపిస్తే ఏమిటి?” అని అడిగా “మనల్ని అందరూ చూస్తారు”

“చూస్తే….”

వెర్రిగా చూశాడు కార్తీక్.

“చూస్తే ఏమిటంటే ఏం చెప్పాలి? అందరూ మనల్ని గుర్తుపడతారు”

“గుర్తుపడితే ఏంటి? అని అడుగుతున్నాను”

తలపట్టుకున్నాడు కార్తీక్. ఈలోగా ఓ యాంకర్ మైక్ పట్టుకొని అటువైపే వస్తోంది. వెనకే కెమెరామేన్…

తన కార్తీక్ జేబులోని దువ్వెన తీసి క్రాఫ్ సరిచేసుకున్నాడు.

***