కావలెను – Part 1 278

“నేను ఫిష్తో ఏ వెరైటీస్ చెయ్యొచ్చో చెప్పడం లేదు… అదో కథ… ట్రాఫిక్ ట్రాఫిక్ ఎందుకు జామ్ అయ్యావంటే… వెహికల్స్ నడిపేవాళ్లని అడగమందిట… వాళ్లను అడిగితే ఇష్టమొచ్చినట్లు వన్ వేలను పెట్టే వాళ్లను, మినిస్టర్లు వస్తున్నారని… ట్రాఫిక్ ఆపే వాళ్లను అడగమందిట… అంతా తిరిగి గవర్నమెంట్ దగ్గరకి వెళ్లిందట కథ చెప్పి నవ్వి అనిమిష మొహం వంక చూశాడు.

“నవ్వు రాలేదు కదూ… జోక్స్ వేయడం… సమయానుకూలంగా సందర్భోచితంగా మాట్లాడడం నాకు తెలియదు”

“నోనో సర్… అలాంటిదేం లేదు… రిజిష్టర్ లో సంతకం…”

“నోప్రాబ్లెం… అయినా నీ ప్రాబ్లెం సాల్వ్ కావడానికి నేనో మార్గం చెప్తాను. హాయిగా వెహికల్ కొనుక్కో”

“సారీ సర్… ప్రస్తుతం లోన్ కట్టే పొజిషన్లో లేను”

“అనిమిషా… నువ్వొక్కదానివే కదా… నీకు వచ్చే శాలరీ నాలుగు అంకెల్లో ఉంటుంది కదా. అంత డబ్బేంచేస్తావ్?” అని అగి, “సారీ అది నీ పర్సనల్ కదూ” అన్నాడు.

అనిమిష సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. శోభరాజ్ రిజిష్టర్ ని ఆమె ముందుకు తోశాడు. రిజిష్టర్ లో సంతకం చేసి ఆమె వెళ్తుంటే, “ఎటో వెళ్లిపోయింది మనసు…” పాటను హమ్ చేసుకోసాగాడు శోభరాజ్.

*****

ఈవెనింగ్ ఫైవ్ థర్టీ.

స్టాఫ్ అంతా అసెంబ్లీ హాలులోకి వచ్చారు. డయాస్ మీద టివిఎస్ స్కూటీ కొత్తది ఉంది. . శోభరాజ్ డయాస్ మీదికి వచ్చాడు. అర్ముగం స్వీట్ ప్యాకెట్ తెచ్చాడు.

శోభరాజ్ గొంతు సవరించుకొని, “డియర్ స్టాఫ్… ఈ కొత్త స్కూటీ చూశారుగా… చాలా బావుంది కదూ… దీనికి ఓనర్ ఎవరో తెలుసా? నిఖిత… గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్” అనగానే, స్టాఫ్ అంతా చప్పట్లు కొట్టారు.

“మిసెస్ నిఖితా… కమ్ హియర్ టేక్ కీస్… నీ ఆలస్యానికి కారణం నీకో వెహికల్ లేకపోవడం… నువ్వు లేట్గా వచ్చే ప్రతి నిమిషం మన సంస్థకు నష్టమే… రేపట్నుంచి నువ్వు లేటుగా రావాల్సిన అవసరం ఉండదు. అలా అని ఈ వెహికల్ కోసం డబ్బు ఖర్చయిపోతుందన్న ఫీలింగ్ వద్దు. నీకు నెలకు బస్సు ఛార్జీలు, ఆటో ఛార్జీలకు కలిపి ఎంతవుతుందో… అంతే అమౌంటిని నెలనెలా మన సంస్థలో లోన్ అమౌంట్ కింద కట్టు. నీకు వెహికల్ వుంది కాబట్టి… పెట్రోల్ అలవెన్స్ కూడా ఎక్స్ట్రాగా అందుతుంది” అన్నాడు శోభరాజ్.

నిఖిత సంతోషం ఆపుకోలేక చప్పట్లు కొట్టింది.

శోభరాజ్ అనిమిష వంక చూసి, “మీలో ఎవరైనా సరే… వెహికల్స్ కావాలనుకుంటే అప్లయ్ చేసుకోవచ్చు. మీరు బస్ ఛార్జీలకు చెల్లించే డబ్బును లోన్ అమౌంట్గా పేచేస్తే చాలు. అంతేకాదు పెట్రోల్ అలవెన్స్ కూడా అందుతుంది” అన్నాడు.