కావలెను – Part 1 278

“హలో గుడ్ ఈవెనింగ్… శుభ సాయంత్రం! నమస్కారం! దిసీజ్ ద్విముఖ… యువర్ ఫేవరేట్ యాంకర్… హాయ్…” స్క్రీన్ మీద ద్విముఖ కనిపించింది.

ద్విముఖ ఓసారి అనిమిష వంక చూసింది.

“ఈ రోజు మేము ఓ వెరైటీ ప్రోగ్రామ్తో మీ ముందుకి వస్తున్నాము… దాని పేరే…” స్క్రీన్ మీద ద్విముఖ మాయమైంది.

“ఏం చేయాలనుకుంటున్నారు?” అన్న అక్షరాలు కనిపించాయి. ఆ తర్వాత సినిమా క్లిప్పింగులు… తర్వాత మళ్లీ ద్విముఖ ప్రత్యక్షమైంది.

“వైజాగ్ బీచ్లో… కుర్రకారు నుండి ఓల్టేజ్ సిటిజన్స్ వరకు ‘ఏం చేయాలనుకుంటున్నారో వినండి” అంటూ మైకు పట్టుకొని ముందుకు కదిలింది.

అనిమిష బీచ్లో జనం చెప్పే అభిప్రాయాలు వింటోంది. అనిరుద్ర స్క్రీన్ మీద కనిపించగానే సన్నటి ఉద్వేగం కలిగింది అనిమిషలో అప్రయత్నంగా.

అతని మాటలు వింటుంటే గమ్మత్తుగా అనిపించింది.

***

“అనిమిషా… ప్రోగ్రామ్ ఎలా ఉంది?” అడిగింది ద్విముఖ టీవీ ఆఫ్ చేస్తూ.

“బావుంది… అయినా నీకిలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలనే ఐడియాలు ఎలా వస్తాయి?”

“అది మా క్రియేటివ్ హెడ్ చూసుకుంటారు. కానీ నీకో విషయం చెప్పనా? మా ఛానల్ లో చాలామంది మా క్రియేటివ్ హెడ్ లకు ‘హెడ్’ లేదంటారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారని అందర్నీ అడుగుతాడు. వాళ్లు చెప్పిన ఐడియాలు విని, ‘వెరీగుడ్… నేనూ ఇలాగే అనుకున్నాను. నాకు దగ్గరగా వచ్చారు. ప్రొసీడ్ అవ్వండి’ అంటాడు” చెప్పింది ద్విముఖ నవ్వుతూ.

***

ద్విముఖ అనిమిష కోసం ఎదురుచూస్తోంది. సరిగ్గా అరగంట క్రితం ‘ఇప్పుడే వస్తాను” అంటూ వెళ్లిన వ్యక్తి ఇంకా రాకపోవడతో కాసింత కంగారు కలిగింది. అయితే ఇది ద్విముఖకు కొత్తకాదు. తరచూ ఇలా వెళ్తూ ఉంటుంది. ‘ఎక్కడికి?” అని ఎప్పుడు అడిగినా చెప్పదు.

అనిమిష, ద్విముఖ బాల్య స్నేహితురాళ్లు కాదు. కనీసం క్లాస్ మేట్స్ కూడా కాదు. అనుకోకుండా కలిశారు. సిటీలో ఇద్దరు ఆడవాళ్లు ఎవరికి వారు ఒంటరిగా వుండడంకన్నా కలిసివుంటే ధైర్యంగా వుంటుందని ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అనిమిష ఎప్పుడూ తన వాళ్ల గురించి చెప్పలేదు. తనకెవరైనా వున్నారో లేదో కూడా తెలియదు. అనిమిష ఏమీ. చెప్పకుండా అడగడం సభ్యతకాదని ద్విముఖ ఏమీ అడగలేదు.

****