నేను బాకీ వుంది ఆయనకే 1 196

“ఆహాఁ ఆహాఁ ఏమి వంశం గురుడా మీది! వంశపారంపర్యంగా భూములు రావడం చూశాను. పేరు ప్రతిష్టలు రావడం చూశాను. పదవులు రావడం చూశాను. ఇలా ఇంత అద్భుతమైన రొమాంటిక్ సెటప్ రావడాన్ని చూడడం, వినడం ఇదే మొదటిసారి గురుడా! అదృష్టం అంటే నీదే. ఎంచక్కా కొత్త కొత్త ఆడపిల్లలతో రాత్రులను గడిపేస్తున్నావు. నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా వుంది గురుడా.”

“అది మా వంశ మహత్యం. వచ్చే జన్మంటూ వుంటే మా వంశంలో పడుదువులే.”

“తప్పకుండా గురుడా! ఆ దేవుడ్ని బెదిరించో, బతిమిలాడో మీ వంశంలో పుడతాను.”

“రోజూ ఓ అమ్మాయితో గడపాలా?” కొంతసేపయ్యాక ప్రశ్నించాడు అర్జున్. అతనికి ఏవేవో సందేహాలు కలుగుతున్నాయి.

“రోజూ కాదు పౌర్ణమి రోజున. గ్రామంలోని స్త్రీలలో ఎవరినైనా ఒకరిని నేను ఎంపిక చేసుకుని పౌర్ణమి రోజున ఆమెకు కబురంపాలి. కబురందుకున్న ఆ స్త్రీ పౌర్ణమిరోజు రాత్రి నా దగ్గరకు వచ్చి గడుపుతుంది. ఓ అమ్మాయితో ఓ రాత్రే గడపాలి. అందరికీ ఛాన్స్ రావడానికే ఈ ఏర్పాటు.

ఇక భోజనాలుకూడా అంతే. గ్రామస్థులే వంతులు వేసుకుంటారు. రోజుకొకరు చొప్పున మూడుపూటలా క్యారియర్ పంపుతారు. రొటేషన్. పద్ధతన్నమాట. మొత్తం వేయికుటుంబాలూ రోజుకొకరు చొప్పున భోజనాలు పంపడం పూర్తయ్యాక తిరిగి తొలుత భోజనం పెట్టిన కుటుంబానికి వంతు వస్తుందన్న మాట.

అయితే పౌర్ణమిరోజున నేను ఎన్నుకున్న అమ్మాయి కుటుంబం తమ కుటుంబంలోని స్త్రీని ఎంచుకున్నందుకుగాను కృతజ్ఞతతో విందు భోజనం పంపిస్తుందన్న మాట.”

“గురుడా! నీది జన్మంటే. నీది వంశమంటే” అర్జున్ రెండు చేతులూ ఎత్తి నాటకీయంగా అన్నాడు.

మళ్ళీ అతనే “అవును గురుడా! పధ్నాలుగవ ఏటనుంచీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నావుగదా. మరి ఈ వెయ్యి ఇళ్ళూ అయిపోయాక ఏమిటి పరిస్థితి? ఇక అమ్మాయిలు లేకపోతే ఏమిటి గతి?” అని తన సందేహం వెలిబుచ్చాడు.

“అదీ రొటేషన్ పద్ధతే. ఇది ఎప్పటికీ పూర్తికాని సైకిల్ అన్న మాట.”

“మొదట ఏ స్త్రీతో గడిపావు గురుడా? మొత్తానికి నీ చరిత్రంతా వెరీ ఇంట్రస్టింగ్.”

* * *

“అదీ….. అదీ కస్తూరితో” కాసేపు గుర్తు చేసుకున్నాక చెప్పాడు.

“ఎవరామె?”

“ఆమె నా ఆలనా పాలనా చూసేది. మా వంశాచారం కూడా ఆమెతో చాలా తమాషాగా మొదలయింది. నా బట్టలు ఉతకడం, నాకు స్నానాలు చేయించడం, నాకు బట్టలు వేయడం అన్నీ ఆమే చూసేది. నాకు పధ్నాలుగు ఏళ్ళు వచ్చేటప్పటికి ఆమె వయసు ముప్ఫై ఏళ్ళు. ఆ వయసులో కూడా ఆమె బాగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలా ఫెళ ఫెళలాడుతుండేది.

నాలో శృంగారపరమైన స్పందనలు తెలిసే ఆ యుక్తవయస్సులో ఆ పాత ఆచారం తిరిగి నాతో ప్రారంభమైంది. నాతో ఎక్కువ సన్నిహితంగా గడిపిన కస్తూరికే మొదటి ఛాన్స్ ఇచ్చారు వూరి ప్రజలు. ఆ తరువాత నుండీ ప్రతి పున్నమికీ నేనే నా భాగస్వామిని ఎంచుకునేవాడ్ని.”

అర్జున్ తను వింటున్నది నిజమో కాదో తేల్చుకోలేనంత ఆశ్చర్యంలో పడిపోయాడు.

“ఇలాంటి ఆచారం ఒకటుంటుందని ఎవరయినా చెబితే నమ్మి ఉండేవాడ్ని కాదు. కానీ నిజంగా నిన్ను చూస్తున్నాను గనుక తప్పడం లేదు. గురుడా! అసలు విషయం మరిచిపోయాను. నీ పేరేమిటి?”

“గోపాలకృష్ణ”

“ఆహాఁ ఏం పేరు పెట్టుకున్నావు. ఆ కృష్ణుడే నీ అవతారం ఎత్తినట్లుంది. నరనారాయణుల్లా మనమిద్దరం ఇకనుంచి కలిసి వుంటామన్న మాట.”

“అవును బసవరాజు కూడా ముసలివాడయిపోయాడు. క్యారియర్ తీసుకుని కొండ ఎక్కలేకపోతున్నాడు. ఇక ఆ పనులన్నీ నువ్వే చూసుకోవాలి.”

“సరే గురుడా!”

“అలానే బావా. మన పిలుపులు ప్రాసయుక్తంగా కుదిరాయి” అంటూ గోపాలకృష్ణ నవ్వాడు.

“మీ భవనం చూడచ్చా?” అర్జున్ లోపలికి చూస్తూ అడిగాడు.

“నిరభ్యంతరంగా.”

అతను చుట్టుపక్కల పరికిస్తూ లోపలికి అడుగువేశాడు.

ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కట్టిన భవనం అది. అక్కడక్కడా పెళ్ళలు ఊడిపోయి వార్థక్యం ప్రారంభమయినట్టుంది. అందులో దాదాపు పదిహేను గదులదాకా వున్నాయి. పైన మరో అయిదు గదులున్నాయి. మధ్యలో విశాలం హాలు వుంది. ఏవో రెండు మూడు గదులు తప్ప మిగిలినవన్నీ నివాసయోగ్యంగా లేవు. గచ్చు బాగా లేచిపోవడం వల్ల కిందనున్న రాళ్ళు పైకి లేచి వికారంగా కనిపిస్తున్నాయి. ఓ గదిలో గోపాలకృష్ణ సామాను, మరోగదిలో ఓ పెద్ద మంచమూ వున్నాయి. ఇంగో గదిలో పుస్తకాలు చాలానే వున్నాయి.