నేను బాకీ వుంది ఆయనకే 1 196

ధాన్య వర్ష వివరాలు చెప్పి “ఈయనే మా నాన్న” అంటూ పరిచయం చేసింది.

వర్ష రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది.

“నువ్వు కొత్త టీచర్ వన్న మాట. ఇంతకు ముందున్న టీచర్ నెలరోజులు పనిచేసి ఈ మారుమూల గ్రామంలో వుండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకనిపిస్తోంది” అంటూ ఆయన అక్కడున్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు.

ఆయనకు ఏభై ఏళ్ళుంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా వుంటాడు. ఇరవై ఏళ్ళుగా ఆయనే ఆ వూరికి ఏకగ్రీవంగా సర్పంచ్.

“నాకు పల్లెటూర్లంటే ఇష్టం. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తిరిగి ట్రాన్స్ ఫర్ చేస్తే తప్ప వెళ్ళను.”

“అయితే ఇకనయినా మా ఊరి పిల్లలు నాలుగక్షరాలు నేర్చుకుంటారు. ఆడకూతురివి గనుక ప్రత్యేకంగా ఎక్కడుంటావ్? మా ఇంట్లోనే వుండు. మనుషుల్లేక ఈ ఇల్లు బోసిపోయి వుండడం గమనించావ్ కదా. కాబట్టి నువ్వు ఓగదిని వాడుకోవచ్చు. అంతే కాదు. భోజనం కూడా ఇక్కడే చేసెయ్. నువ్వుంటే మా అమ్మాయికీ కాలక్షేపం అవుతుంది.”

ఆమె మొహమాటపడతూ ఏదో చెప్పబోయింది. దీన్ని గమనించిన ధాన్య “ఇక నువ్వేమీ చెప్పకు. మా నాన్న మాట జవదాటినవారు ఇంతవరకూ ఈ గ్రామంలో లేరు. కొత్తగా ఆయనకు అప్రతిష్ట తేవద్దు” అంది నవ్వుతూ.

ఎక్కడో ఒంటరిగా వుండటం కన్నా అక్కడే వుండడం మంచిదనిపించింది వర్షకు. నెలకు ఎంతో కొంత ఇచ్చి పెయింగ్ గెస్ట్ లా వుందామని నిర్ణయించుకుంది.

“అలానే” అంది ధాన్యవైపు చూస్తూ.

ఆమె ముఖంలో ఆనందం చిమ్మింది, తనకు చక్కటి తోడు దొరికి నందుకు.

శివరామయ్య పైకి లేచి “నేనలా పొలాలవైపు వెళ్ళొస్తానమ్మా” అని ఒకడుగు ముందుకేసి ఏదో గుర్తొచ్చినట్టు ఆగి కూతురివైపు తిరిగి “ఏమంటున్నాడమ్మా గోపాలకృష్ణ? త్వరగా కరుణించమణి చెప్పు. ఎలానో ఓలా అతని దృష్టిని ఆకర్షించు. మూడేళ్ళయింది పొలాలు పండి. ఏం శని చుట్టుకుందో ఏమో? పుట్లు పుట్లు ధాన్యం పండాల్సింది పోయి గింజ రాలడం లేదు. మీరిద్దరూ ఒకటైతే తప్ప మనకు మంచికాలం రాదు” అని నిస్పృహతో వెళ్ళిపోయాడు ఆయన.