నేను బాకీ వుంది ఆయనకే 3 76

“నేను మాత్రం ఇటే వస్తున్నాను. కాస్తంత చల్లగాలి పీల్చుకుందామని.”

“నీకేం అవసరం లేదు గురుడా. కోరుకున్న పిల్లకు కబురంపితే వచ్చి ఒళ్ళో వాలుతుంది.”

“మరి అదంతా మా వంశ మహత్యం”

“ఏం వంశం గురుడా మీది? గొప్ప సువిశాల సామ్రాజ్యం కన్నా వంశ పారంపర్యంగా ఓ అద్భుతమైన ఆచారం ఇచ్చారు. ఇలాంటి ఛాన్స్ వచ్చిన నీది గురుడా అదృష్టమంటే”

“నిజంగా అదృష్టమంటావా? కానీ నాకు మాత్రం…..” అంటున్న అతనికి చాలా దూరంలో ఇద్దరమ్మాయిలు కనిపించారు. దాంతో వాక్యం పూర్తి చేయకుండా ఎవరి వుంటారా అన్న ఆలోచనలో పడ్డాడు.

కాసేపు ఇద్దరూ మౌనంగా నడిచారు.

“గురుడా! చాలా రోజుల్నుంచి నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవు కదా?” నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు నరుడు.

“ఏమీ అనుకోనులే అడుగు.”

“ప్రేమంటే ఏమిటి గురుడా?”

“ప్రేమంటేనా? నాకూ తెలియదే. ఎందుకంటే ఇంతవరకు ఎవర్నీ నేను ప్రేమించలేదు గనుక”

“ప్రేమించలేదా? ఇంతమంది అమ్మాయిలతో పరిచయం వుంది. ఇంతవరకు ఎవర్నీ ప్రేమించకపోవడం విచిత్రమే” నరుడు ఆశ్చర్యం ప్రకటించాడు.

“దానికి నేనేం చేయను? ఎవర్నీ ప్రేమించాలనిపించలేదు. అసలు ప్రేమంటే ఏమిటన్న సందేహం అప్పుడప్పుడు నాకు వస్తుంటుంది. బహుశా భగవంతుడు ఒక్కో భక్తుడికి ఒక్కో రూపంలో కనిపించినట్టు ప్రేమ కూడా అంతేనేమో. భగవంతుని ఉనికి భక్తుడి మీద ఆధారపడ్డట్టు ప్రేమ ఉనికి ప్రేమికులనుబట్టి వుంటుందేమో.
ఇ”దేవుడులాగానే ఇదీ అర్థం కాలేదు గురుడా.”
“కరెక్టే. దేవుడు అర్థం కావాలంటే వయసు ఉడిగిపోవాలి. ప్రేమ అర్థం కావాలంటే వయసు పరిపక్వం చెందాలి.”

“ప్రేమే దేవుడు అంటారు గదా. అలా ఎందుకని అంటారు? రెంటికీ గల సామీప్యత ఏమిటి గురుడా?”

“ఏమో అర్జున్ ! నాకూ తెలియదు.”

అప్పటికి అమ్మాయిలు మరింత దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూడటం లేదు. తలవొంచుకుని ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్నది ధాన్య అని గుర్తించాడు గోపాలకృష్ణ. వెనక వస్తున్నదెవరో తెలియడం లేదు.