నేను బాకీ వుంది ఆయనకే 3 78

“వాతబడా- అంటే?” వెంకట్రామయ్య అడిగాడు.

“అంటే వాడ్ని చంపను. చంపడం ఇష్టం లేదు నాకు. వాడు ఎందుకూ పనికిరాకుండా, ముష్టెత్తుకుని బతికేటట్టు….. పువ్వులాగా గుభాళించే వాడి బతుకు వాడిపోయేటట్టు వాతలు పెట్టాలి. దానికి నేను పెట్టిన పేరు వాతబడి.”

పునర్వసు తనను ప్రేమించకపోగా గోపాలకృష్ణను ఇష్టపడుతున్నానని చెప్పడాన్ని పులిరాజు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏదో బాధ గుండెను ముక్కల కింద పగలగొడుతోంది.

పునర్వసు మీద అతనికి కోపం కలగడం లేదు. గోపాలకృష్ణ లేకుంటే ఆమె తనను ప్రేమించి వుండేదని బలంగా నమ్ముతున్నాడు. ప్రేమలో వుండే శక్తి అది. మనం ప్రేమించిన వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా మనం ఆ వ్యక్తిని అసహ్యించుకోలేం. ఆ తప్పు ఇతర కారణాల వల్లే చేస్తూ వుందని నమ్మి , ఆ కారణాలకు కారణమైన వాళ్లను ద్వేషిస్తాం.

అయితే పులిరాజు మాత్రం అంతటితో ఆగక తమ ప్రేమ సఫలం కావడానికి గోపాలకృష్ణకు శత్రువైన వెంకట్రామయ్యతో చేతులు కలిపాడు.

వెంకట్రామయ్య గ్లాసులోని విస్కీనంతా ఒక్క గుటకలో తాగి మూతి తుడుచుకుంటూ “అయితే నీకూ ఒక బలమైన శత్రువు తయారయాడన్న మాట. అసలు శత్రువు అనేవాడు లేడంటే మనం ఎప్పటికీ ఇలాగే వుండిపోతాం. జీవితంలో రెట్టింపు కష్టం చెయ్యాలంటే శత్రువులుండాలి. మన లక్ష్యాన్ని, నిర్ణయించేది కూడా శత్రువులే. అంతే కాకుండా ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సినంత ఇన్స్ పిరేషన్ కూడా శత్రువులే ఇస్తారు మనకు. నేను ఇంతగా సంపాదించడానికి నాకు ఏర్పడ్డ మొదటి శత్రువే కారణం. ఆ శత్రువు ఎవరో తెలుసా? నా భార్య.”

* * *

కళ్ళు కూడా ఆర్పకుండా పులిరాజు శ్రద్ధగా వింటున్నాడు.

“అవును. నా మొదటి శత్రువు నా భార్యే. అప్పట్లో నేను గోపాలకృష్ణ తండ్రి భూపతిరాజు దగ్గర దివానుగా పనిచేసేవాడ్ని. ఏదో వాళ్ళిచ్చిన దానితో సుఖంగా కాపురం చేసేవాడ్ని. నా భార్య అసంతృప్తి ప్రకటించడం ప్రారంభించింది. నా ఆదాయాన్నీ, నా బతుకునీ పరిహసించడం ప్రారంభించింది. ప్రతి పనిలోనూ నా చేతకానితనాన్ని చూపించి పాశవికంగా ప్రవర్తించేది.