నేను బాకీ వుంది ఆయనకే 3 76

కాలం ఎలా గడిచిందో తెలియదు. పగలు వెళ్ళిపోయి సాయంకాలం రావడం ఏదో మహేంద్రజాలంలా అనిపించింది. రోజూ ఎంతో సాధారణంగా జరిగే కాలంలోని మార్పులు మహేంద్రజాలంలా అనిపిస్తున్నాయంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించమని జనాన్ని అడగాలనిపించింది.

అయిదు అయ్యేసరికల్లా తయారయ్యాను. చాలారోజుల తరువాత అత్యుత్సాహంతో అలంకరించుకున్నాను. లైట్ నీలం కోటా కాటన్ చీర బాగా నప్పింది. పిల్లలిద్దర్నీ మా ఎదురింటి ఫ్రెండ్ ఇంటిలో ఆడుకోమని చెప్పి ఇంటికి వచ్చాను. వరండాలో ఫ్రేము కుర్చీలో కూర్చుని వీక్లీని తిరగేస్తున్నాను.

మల్లెపూల వాసనను ఎక్కడికో ఎగరేసుకు వెళుతున్నట్టు గాలి సువాసనలను విరజిమ్ముతోంది. సంధ్యాకాంతి ప్రపంచానికి మేలి ముసుగును కప్పింది. చీకట్లు లోకంమీద వాలడానికి దారి వెతుక్కుంటున్నాయి.

అప్పుడొచ్చాడు జయంత్. గుండె ఒక్కసారి ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది.

గేటు తీసుకుని వచ్చి “లోపలికి రావచ్చా?” అని అడుగుతూ అక్కడే నిలబడి పోయాడు.

నేను చిరునవ్వు నవ్వుతూ వుండిపోయాను.

అతను వరండాలోకి రాగానే “కూర్చో” అన్నాను కుర్చీ చూపిస్తూ.

“సాయంకాలాలు మిమ్మల్ని చూడడం ఎంతో బావుంటుంది” అన్నాడు.

నా శరీరంలోని జీవకణాలన్నీ ఒక్కసారిగా కదిలినట్లనిపించింది.

వయసు డిఫరెన్స్ వల్ల కాబోలు నేను అతన్ని బహువచనంతో పిలవలేక పోతున్నాను.

అతడి చొరవ చూసి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ కోపం రావడం లేదు. ఇలా నాకు కోపం రాకుండా వుండటానికి నా భర్త ఎంతో కొంత బాధ్యుడని కూడా తోచింది.

లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొచ్చాను. ఓ కప్పు అతనికిచ్చి, మరొకటి నేను వుంచుకున్నాను.

అతను కప్పు అందుకుంటూ “ఏమిటీ ఈ అకాల అమృతం” అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.

అద్భుతంగా బిరియానీ చేసినప్పుడు కూడా నా భర్త నోరు తెరిచి ఓ మాట అని కూడా ఎరగడు.

అతను నాటకీయ ఉచ్ఛారణతో అలా అందం వింటుంటే కాఫీ మరోసారి పెట్టాలనిపించింది.

“మీ డాబా మీద వీణ వినే భాగ్యం కలిగిస్తారా?”

నేను మౌనంగా లేచి ఇంట్లోకి వెళ్ళాను. ఎప్పుడో మూల పెట్టేసిన వీణను దులిపి సిద్ధం చేసి వుంచాను. దానిని, ఓ బ్లాంకెట్ నూ తీసుకుని డాబా మీదకు చేరుకున్నాను.

నా వెనకే జయంత్ వచ్చాడు.