నేను బాకీ వుంది ఆయనకే 3 76

“స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం వల్లే బానిసలుగా తయారయ్యారు. ఈ సృష్టిలో ప్రతి జీవీ తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటుంది. ఒక్క స్త్రీ తప్ప. దీంతో మగవాడికి లోకువ అయిపోతుంది. స్త్రీ కష్టపడుతుంది కానీ అదంతా సంసారం కోసమే. కానీ ఆర్ధిక పుష్టి లేని ఆమెని కుటుంబమంతా చులకనగా చూస్తుంది.”

“ఫ్రాయిడ్ నీ, కారల్ మార్క్స్ నీ సింథటైజ్ చేయాల్సిన అవసరం చాలావుంది. జర్మనీలో ఒక కార్మికుడు పని మానేసినా, జయింపులో సర్పంచ్ చిన్నకూతురు ఇంట్లోని వంటవాడితో లేచిపోయినా ఈ రెండు థీరీలతో వాటి వెనుకనున్న కారణాలను చెప్పేయవచ్చు.”

ఇలా అతను అదరగొట్టేసేవాడు. భర్తా, పిల్లలు, సంసారమూ వీటి చట్రాల మధ్య అంతవరకు బిగుసుకుపోయిన నేను అలాంటి షాకింగ్ స్టేట్ మెంట్స్ విని బాగా కదిలిపోయేదాన్ని. అతను చెప్పిన వాటిల్లో నిజమెంతోనని ఆలోచనలో పడేదాన్ని.

ఇలా అతని గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది

ఓరోజు మా వారు ఆఫీసుకు బయలుదేరుతున్నారు. స్నానం చేసి లుంగీ మొలక చుట్టుకుని తయారవడం మొదలుపెట్టారు.
కాఫీ తీసుకుని వెళ్ళి యిచ్చాను. ఆయన్ను చూస్తునే జయంత్ గుర్తుకు రావడంతో “పొట్ట చూడండీ ఎంత అసహ్యంగా వుందో! ఎప్పుడూ ఆ జయంత్ లా టక్ చేసుకోండి” అన్నాను.

ఆయన ఏమనుకున్నారో తెలీదు. ఎప్పుడూ ఆయన అతిగా మాట్లాడరు. ఏ ఫీలింగ్ నీ ఎప్పుడూ ఎక్స్ ప్రెస్ చేయరు. ఎప్పుడయినా పూలు ఇంటికి తెచ్చినా దాన్ని అలా సోఫా మీద పడవేస్తారే తప్ప “పూలు పెట్టుకో” అని అనరు. చివరికి రొమాన్స్ లో కూడా అంతే. నిశ్శబ్దంగా వుంటారే తప్ప. నోరువిప్పి మాట్లాడరు.

నిజానికి ఆయనను జయంత్ తో పోల్చిచూడడం తప్పు. నలభైఏళ్ళ వాడికి ఇరవై రెండేళ్ళ కుర్రాడితో పోల్చి అలా వుండమని అడగడం ఎబ్బెట్టుగా వుండే విషయం. జయంత్ ఎప్పుడూ టక్ చేసుకుని వుంటాడన్న భ్రమ నాకుంది. అతనూ ఇంట్లో మా ఆయనలానే పొట్ట కనబడటేట్టు లుంగీ లు వుంటాడన్న నిజం నాకు తట్టలేదు.

ఇలా విశ్లేషించుకుంటూ పోతే దేన్నీ సరిగా అనుభవించలేమనుకుంటా. అందుకే చాలామంది హృదయం ఎలా చెబితే అలా నడుచుకుంటారే తప్ప బుద్ధితో ఆలోచించరు. నేనూ అంతే.

సాయంకాలమైతే నేనూ, పిల్లలూ నర్సరీ దగ్గరికి వెళ్లడానికి తయారైపోయే వాళ్ళం. ఎప్పుడైనా జయంత్ కనిపించకపోతే ఏదో వెలితిగా వుండేది. అయితే ఆ వెలితి ఎందుకో, అతను నుంచి నేను ఏం కోరుకుంటున్నానో నాకే తెలీదు.

* * *

ఓరోజు సాయంకాలం యధాప్రకారం నర్సరీ దగ్గర వున్నాము. పిల్లలిద్దరూ దూరంగా ఆడుకుంటున్నారు. మా వారూ, మధూ ఏదో పని వుందని బజారుకి వెళ్ళారు.

అప్పుడొచ్చాడు జయంత్. నేను చిన్నగా నవ్వాను.

“మా మిత్రులెవరూ ఇంకా వచ్చినట్టు లేదు. వీడు- అదే మీ తమ్ముడు ఎక్కడికెళ్లాడు?” అని అడిగాడు.

“బజారెళ్ళాడు” అని ముక్తసరిగా చెప్పాను. అతనితో మామూలుగా మాట్లాడలేకపోతున్నాను. ఏదో డిఫరెన్స్ వుంది.