నేను బాకీ వుంది ఆయనకే 3 76

అలా ఒంటరిగా గదిలో మిగలిపోయాను. మ్యారేజ్ హాల్లో వున్న కొంతమంది బంధుజనం మాటలు తప్ప ప్రశాంతంగా వుంది సత్రమంతా.

అక్కడే వున్న సూట్కేసు మీద నడుం ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరో రెండు గంటలకి పెళ్ళి.

అంతలో ద్వారం దగ్గర అలికిడి అయ్యింది. కళ్ళు విప్పి చూస్తే ద్వారం దగ్గర నిలబడి వున్న సుధీర్ కనిపించాడు.

ఒక్క ఉదుటున పైకి లేచి కెరటంలా అతని దగ్గరకి వచ్చి నిలబడ్డాను.

“సారీ! ముందు రాలేకపోయాను. బ్యాంక్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ వుంటే హైదరాబాద్ వెళ్ళాను. రాత్రే గదికి వచ్చాను. తలుపు తెరవగానే నీ శుభలేఖ. బట్టలైనా మార్చుకోకుండా ఇలా వచ్చేశాను” చాలా బాధపడుతూ చెప్పాడు.

నోట మాట రావడం లేదు. ఏదో తెలియని భావోద్వేగం నన్ను ఊపేస్తుంది. కాని టైమ్ లేదు. నా నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి.

“సుధీర్! నీకోసం ఎంతగా ఎదురుచూశానో తెలుసా! ఇక నాపెళ్ళిలో నువ్వు రావేమోనన్న దిగులు, ఇదిగో ఈ పట్టుచీరకంటే బరువుగా నా గుండెల్లో పేరుకుపోయింది. ఇంకో రెండు గంటల్లో పెళ్ళి, నువ్వు నాకో అపురూపమైన బహుమతి ఇవ్వాలి. ఇస్తావా?”

“తప్పకుండా! ఏం కావాలి?” తన ఒంట్లోని రక్తాన్నంతా తోడివ్వమని అడిగినా జంకని ఈ దీరుడి ముందు సీకో వాచ్ కోసం, లేసులున్న బూట్లకోసం యాగీ చేసిన పెళ్ళికొడుకును పోల్చుకోకుండా వుండలేక పోయాను. నా నిర్ణయం సరైనదేనని కళ్ళముందు రుజువు కనబడింది.

“నువ్విచ్చే బహుమతి నన్ను అత్తింటి ఆరళ్ళ నుంచి కాపాడుతుంది. అన్నం వార్చేటప్పుడు చేయి వణికి గంజి నాపై పడి చర్మం కాలిపోయినప్పుడు నా కన్నీళ్ళను తుడుస్తుంది. ఇంట్లోని దరిద్రానికంతా నేనే కారణమని మా అత్తా నన్ను గదమాయించినప్పుడు తిరగబడే శక్తినిస్తుంది. కూరలు బాగాలేవని మా మామగారు విసుక్కునప్పుడు నన్ను ఊరడిస్తుండి. నావల్ల తన సుఖాలన్నీ దూరమైనాయని నా భర్త నావైపు అసహ్యంగా చూసినప్పుడు భుజం తట్టి ధైర్యమిస్తుంది.”

ఏడుపు తన్నుకుంటూ రావడంతో నా మాటలు తడబడుతున్నాయి. కానీ ఆపలేదు. చెప్పుకుపోయాను.

“అవును సుధీర్! నువ్విచ్చే బహుమతి నాకు ప్రతిక్షణం మన ఊరును గుర్తుకు తెస్తుంది. నా స్నేహితురాళ్ళను నా కళ్ళముందు నిలుపుతుంది. మా అమ్మా నాన్నల వెచ్చటి ఒడిని మరిపిస్తుంది. పెరట్లోంచి కాలు పెట్టగానే పచ్చ పచ్చని చేతులతో ఆహ్వానం పలికే పంటచెలు నా మనసులో మెదులుతుంది. ఇదంతా ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతి ఏమిటో తెలుసా? ఓ అందమైన జ్ఞాపకం. అవును సుధీర్. జ్ఞాపకం అయితే అది ఎప్పటికీ ఎడబాటు లేకుండా నా గుండెల్లో ఉండిపోతుంది. నాలో రసస్పందన చచ్చిపోకుండా కాపాడుతుంది. అత్తింటి నరకాన్ని మరిచిపోవడానికి పుట్టింటి నుంచి నేను తీసుకుపోవాలను కుంటున్నది ఓ అందమైన జ్ఞాపకాన్ని. అది నువ్వొక్కడివే ఇవ్వగలవు. మరిస్తావా?” అని చేయి ముందుకు చాచాను.

అతని కళ్ళల్లో నీళ్ళు ఊరడం లైట్ వెలుగులో స్పష్టంగా తెలుస్తోంది.

నా చేతిలో చేయి వేసాడు.

“అయితే రా” అంటూ ముందుకు కదిలాను.

అలా నడుస్తున్న నాకు తాళం వేయకుండా కేవలం గొళ్ళెం పెట్టిన ఓ గది కనిపించింది. అదృష్టం నా పక్కనుంది. తలుపులు తెరిచి చూస్తే ఎవరూ లేరక్కడ. స్టోర్స్ గది కాబోలు ఓ మూల ఉల్లిపాయలు, వాటి ప్రక్కన బీన్స్, కాబేజీ, టమేటాలు రకరకాలు కూరగాయలున్నాయి.