నేను బాకీ వుంది ఆయనకే 3 76

మనిషి ఎంత దౌర్భాగ్యంలో బతుకుతున్నాడయ్యా అంటే తనంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితులలో ఇలాంటి సందిగ్ధం ఆడపిల్లల్లో ఎక్కువ. వాళ్ళు మనసుతో ఆలోచిస్తారే తప్ప, మెదడుతో దేన్నీ విశ్లేషించుకోరు. అందుకే ఎవరిని ఏ పరిధి మేరకు వుంచాలో తెలియదు.

ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా కాస్తంత ప్రొసీడ్ అయిపోతే మీరు షాక్ కు గురవుతారు. ‘అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేనప్పుడు వచ్చి చేయి పట్టుకున్నాడు’ అతని కళ్ళను విశాలం చేసి మగజాతి మీదే గౌరవం లేనట్లు మాట్లాడతారు.

నేనూ అంతే. అందుకే జయంత్ తో ఎలాంటి రిలేషన్ కోరుకుంటున్నానో విశ్లేషించుకోలేదు. సంసారం అనే రొటీన్ నుంచి నన్ను దూరంగా తీసుకుపోయే థ్రిల్ కలిగిస్తున్న మెజీషియన్ లా కనిపిస్తున్నాడతను. పెళ్ళికి ముందు ఇలాంటి థ్రిల్లింగ్ అనుభవంలోకి రాకపోవడమే దానికి కారణం అనుకుంటాను. అందుకే ప్రతి ఆడపిల్లా పెళ్ళికి ముందు ఇలాంటిదేదో కొంతమేరకు అనుభవించి వుండాలనిపించింది. నా భర్త ఎలాంటి ఉద్వేగాలూ నా దగ్గర ప్రదర్శించక పోవడంవల్ల ఈ థ్రిల్ మరింత బావున్నట్టనిపిస్తోంది.

ఎప్పుడో తూర్పు ఆకాశంలో శుక్రుడు ఒంటరిగా తోడుకోసం వెతుక్కుంటున్నప్పుడు నిద్ర పట్టింది.

* * *

ఉదయం తొమ్మిది గంటల ప్రాంతాన నా భర్త వచ్చాడు. రావడమే హడావుడిగా ఆఫీసుకెళ్ళాడు. లేకుంటే నా కంగారును దాచుకోవడం కష్టమయ్యేది.

ఆరోజు సాయంకాలం యథాప్రకారం మేమంతా చంద్రగిరికి వెళ్ళాము. నేను వెళ్ళేసరికి జయంత్ తన మిత్రులతో వున్నాడు. మేమిద్దరం చూసుకోవడమే కొత్తగా వుంది. అంతకు ముందు లేని రహస్యం మా ఇద్దరి మధ్యా ప్రారంభం కావడమే కారణం.

అప్పుడప్పుడు అతన్ని గమనించడం, అతని గొంతు వినిపిస్తుందే మోనని చెవులను రిక్కించడం, వీలైనప్పుడల్లా అంతకు ముందు రోజు సాయంకాలాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకోవడంతోనే టైమ్ అయి పోయింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడూ అతని మాట్లాడాలని ప్రయత్నించడం, వీలుకాకపోవడం జరిగింది. ఇక తట్టుకోలేక కాబోలు ఆరోజు అందరం ఇంటికి బయలుదేరుతున్నప్పుడు ఎవరూ గమనించకుండా నా చేతిలో లెటర్ కుక్కాడు.

నేను తేరుకునే లోపలే అతను నన్ను దాటి వెళ్ళిపోయాడు. దాన్ని ఏం చేయాలో పాలుపోక స్త్రీకున్న ఏకైక రహస్య స్థావరంలో పెట్టుకున్నాను.

ఇంటికొచ్చి అందరూ పడుకున్నాక బాత్రూమ్ లో దూరాను. ఉత్తరం మడతలు విప్పాను. తెల్లటి పేపర్ మీద రంగు రంగుల స్కెచ్ పెన్నులతో రాసిన అక్షరాలు ఒకే పంజరంలో బంధించిన రకరకాల పక్షుల్లా అనిపించాయి. “రేపు ఉదయం పదకొండు గంటలకు వస్తాను’ అన్న ఒకే లైన్ వుంది. ఎందుకో దాన్ని పారవేయబుద్ధి కాలేదు.

అది మొదటి ఉత్తరం జీవితంలో. నేను పురుళ్ళకు ఇంటికి పోయినప్పుడు కూడా నాభర్త ఒక్క ఉత్తరమూ రాయలేదు. అమ్మా, అమ్మమ్మా రాసిన ఉత్తరాలు తప్ప ఇలా పర్సనల్ గా ఉత్తరం అందుకోవడం ఇదే ప్రధమం. అందుకే దాన్ని తీసుకొచ్చి నా సూట్ కేసు అడుగున చీర మడతల్లో దాచిపెట్టాను.