నేను బాకీ వుంది ఆయనకే 3 76

సుధీర్ లోపలికి రాగానే తలుపులు మూసి బోల్టు వేశాను. మధ్యలోనున్న జీరో క్యాండిల్స్ బల్బు మసగ్గా వెలుగుతోంది. అలానే పెళ్ళికూతురి అలంకరణలో వున్న నేను ఇంకో గంటలో వేరోకడిచేత తాలి కట్టించుకోవాల్సిన నేను గోడకు జారగిలబడి కూర్చుని సుధీర్ చేయి పట్టుకుని లాగాను. అతను నాపైపడి సర్దుకున్నాడు.

అతన్నిగాఢంగా హత్తుకుంటూ “ప్లీజ్! కరుణించవా- అని ఎప్పుడూ అడిగేవాడివి. ఇదిగో ఇప్పుడు కరునిస్తున్నాను” అని అతని పెదవులను నా పెదవులతో అద్దాను.

అతను నను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

పదినిమిషాల తరువాత ఇద్దరం ఒకరి నుంచి ఒకరు విడివడ్డాం.

“వస్తాను సుధీర్. ఈ అద్భుతమైన జ్ఞాపకాన్ని నాకందించినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడంలేదు. నేను అత్తింటికి నాతో పాటు తీసుకువెళుతున్న ముప్ఫైవేల రూపాయలను వాళ్ళు భూముల్లోకి మార్చేయవచ్చు. నా ఒంటిమీదున్న పాతిక సవర్ల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు. సారెతో పాటు నేను తీసుకెళ్ళే వెండిబిందెను చెడగొట్టి తండ్రీ కొడుకులు మొలతాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ మధురమైన జ్ఞాపకాన్ని వాళ్ళు నా నుంచి దొంగిలించలేరు కదా. అదే నాకు శ్రీరామరక్ష” చివరిగా అతని ముంజేతిమీద ముద్దు పెట్టుకుని తిరిగి నా గదికి వచ్చేశాను.
ముహూర్తం ప్రవేశించిందన్నట్లు పెళ్ళి పందిట్లో మంగళ వాయిద్యాలు మ్రోగడం ప్రారంభించాయి” అంటూ చెప్పడం ముగించింది ఆమె.

ఆమె చెప్పిన ఈ సంఘటనకు గోపాలకృష్ణ కదిలిపోయాడు. కళ్ళల్లో పలుచటి నీటిపొర.

చాలాసేపటివరకూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేకపోయారు.

యిదంతా చాటు నుంచి గమనిస్తున్న పులిరాజు ఠక్కున పైకి లేచాడు.
అతడు గోపాలకృష్ణ మీద ద్వేషంతో రగిలిపోతున్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి నుండి కదిలాడు.

ఊరిలోకి వచ్చి దివాను వెంకట్రామయ్య ఇంటి తలుపు తట్టాడు. మరో ఐదు నిమిషాలకు తలుపులు తెరుచుకున్నాయి.

అంత రాత్రిపూట దెయ్యం జడలా పరమవికారంగా కనిపిస్తున్న పులిరాజును చూసి ఆయన ఓక్షణం పాటు జడుసుకున్నాడు. కాసేపట్లో సర్దుకుని అతన్ని లోపలికి పిలిచాడు.

“అయితే గోపాలకృష్ణను ఏం చేయబోతున్నావ్? చేతబడి చేసి చంపేస్తున్నావా? బాణామతితో వాడి బతుకును కాల్చేస్తున్నావా? ఇన్ని రోజుళు ఆలోచించి ఏం నిర్ణయించుకున్నావ్?” దివాన్ వెంకట్రామయ్య చాలా కూల్ గా కుర్చీలో జారగిలబడుతూ అడిగాడు పులిరాజును.
అప్పుడు రాత్రి తొమ్మిదయి వుంటుంది. చుట్టూ చీకటి భయంకరంగా వుంది. పౌర్ణమి వెళ్ళి వారమో, పదిరోజులో అయినట్టు గుర్తుగా చీకటి మందంగా పేరుకుని వుంది.

“వాడికి నేను చెయ్యబోయేది చేతబడి కాదు- వాతబడి” కళ్ళల్లోని క్రూరత్వం ఒలుకుతుంటే అన్నాడు పులిరాజు.