నేను బాకీ వుంది ఆయనకే 3 76

ఇలా కొంతకాలం జరిగాక నన్ను సాధించడం ప్రారంభించింది. కుత్తుకలు కత్తిరించో, కుతంత్రాలు చేసో డబ్బు సంపాదించమని పోరు పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా చేసింది.

అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నాకు తెలిసి పోయింది. నాలోని సైతానును నిద్ర లేపాను. సమయం కోసం చూస్తున్నాను.

అదిగో అప్పుడే భూపతిరాజు భార్య సుమతీదేవికి నెలలు నిండాయి. టౌన్ లోని ఓ నర్శింగ్ హోమ్ లో ఆమె గోపాలకృష్ణను కన్నది. తిరిగి వాళ్ళు ఊరికి వచ్చేటప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న కారును లారీ గుద్దేసేటట్లు ఏర్పాటు చేశాను. నేను, మరికొంతమంది పనివాళ్ళు వెనుక మరో కారులో బయలుదేరాం.

అనుకున్నట్లే యాక్సిడెంట్ జరిగింది. అయితే అనుకోకుండా గోపాలకృష్ణ బతికి బయటపడ్డాడు. యాక్సిడెంట్ జరిగాక వచ్చి చూస్తే పెద్దవాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే రోజుల బిడ్డ అయిన గోపాలకృష్ణ బతికాడు. చుట్టూ జనం వుండటంతో వాడ్ని చంపలేకపోయాను. ఇక గ్రామస్థులంతా వాడి బాధ్యత తీసుకోవడంతో నాకు వాడ్ని చంపే అవకాశం

భూపతిరాజు పోయాక నా తెలివితేటలన్నీ ప్రదర్శించి వాళ్ళ భూములు లాక్కున్నాను. వాళ్ళ బంగారం దోచుకున్నాను. కానీ గోపాలకృష్ణను మాత్రం ఏం చేయలేకపోయాను.

అప్పటికి “వాడికి చేతబడి చేసి చంపెయ్యవయ్యా” అని నీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాను. కానీ నువ్వు ఆ పని చేయలేకపోయావు. శత్రు శేషం వుంటే నాకు నిద్ర పట్టదు. శత్రువు అడ్డు తొలగించుకుంటే వుండే ఆనందం అంతా ఇంతా కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా మొదటి శత్రువు అదే నా భార్యను చంపినా రోజు నా ఆనందాన్ని మాటలలో వర్ణించలేను” అనిఒ ఎంతో సంతృప్తిగా కళ్ళు మూసుకుంటూ వెనక్కి వాలాడు.

“ఊరులో జనానికి- ఆ గోపాలకృష్ణకూ మీరు వాళ్ళ ఆస్తిని కాజేశారని తెలుసుగానీ మీరే భూపతిరాజు దంపతులను చంపినట్లు తెలియదు. ఇది తెలిసిన రోజున గోపాలకృష్ణ వూరుకుంటాడా? మీమీద పగ సాధించడా?” పులిరాజు తన అనుమానాన్ని వెలిబుచ్చాడు.

“అందుకే కదా శత్రుశేషం ఉంచుకోకూడదంట.”

“మరి వాడ్ని మనం చంపకూడదు. ప్రతిక్షణం చచ్చేట్లు చేయాలి. అందుకు మంత్రం నాది తంత్రం మీది.”

“అయితే దానికి ఒక్కటే మార్గం” అని కాసేపాగి ఏం చేయాలో చెప్పడం ప్రారంభించాడు.

వింటున్న పులిరాజు సైతం ఆ దుష్ట పథకానికి జడుసుకున్నాడు. వెంకట్రామయ్య ఒక్కోమాట చెబుతుంటే తన శరీరం మీద వాడి ముళ్ళు మొలుస్తున్నట్టు అనిపించింది. ఇక ఇప్పుడు గోపాలకృష్ణతో తలబడితే అతని జీవితం రక్తసిక్తం కావడం ఖాయమనిపించింది. అందుకే పులిరాజు పెదవులమీద ఓ విషపు నవ్వు మెరిసింది.

సాయంకాలమైంది. సూర్యుడు ఆకాశం కొంగు చివరను పట్టుకొని అవతలి ప్రపంచంలోకి జారిపోతున్నాడు. పక్షులు రెక్కల్లోంచి చివరి సారిగా శక్తినంతా తెచ్చుకుని ఇళ్లవైపు మళ్ళాయి.