నేను బాకీ వుంది ఆయనకే 3 76

దుప్పటి పరిచి దానిమీద శ్రుతి చేసుకుంటున్నాను. జయంత్ నా ఎదురుగా పిట్టగోడమీద కూర్చుని నావైపే తదేకంగా చూస్తున్నాడు. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. దూరంగా వున్న వీధి దీపం వెలుగు రేఖామాత్రంగా పడుతోంది.

వీణ శృతి అయ్యాక ఏవో రెండు మూడు బిట్లు వాయించాక ‘పలుకే బంగారమాయెనా’ వాయించాను.

మధ్యలో అతని ఏమీ మాట్లాడలేదు.

‘అదిగో అల్లదిగో…..’ వాయించాను. ఆ తరువాత మరో రెండు త్యాగరాజకృతులు వాయించి, ఇక చాలన్నట్లు వీణను పక్కకు పెట్టాను.

అతను ఒక్క గెంతులో నా దగ్గరకి వచ్చి కింద కూర్చుంటూ “అద్భుతంగా వాయించారు. మీకు అతివిలువైనదేదో ఇవ్వాలని వుంది. కానీ ఏమివ్వగలను?” అన్నాడు.

అతను చాలా కదిలిపోయినట్లు గొంతే చెబుతోంది.

“ఏమీ ఇవ్వక్కరలేదు. ఎప్పుడో నేర్చుకున్నది నువ్వడిగితే దాని మీదున్న బూజు దులిపి వాయించాను.”

అతను ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఆ రసానుభూతి నుంచి తేరుకున్నట్టు లేదు.

అలా మౌనంగా ఇద్దరం ఓ పదినిమిషాలపాటు కూర్చుండి పోయాం.

అప్పటికి తేరుకున్నట్టు అలా కదిలి నా చేతిని తీసుకొని ముంజేతి మీద సుతారంగా పెదవులు ఆన్చి వదిలాడు. మరేమీ మాట్లాడకుందా పైకి లేచి వెళ్ళిపోయాడు. గేటు తీయడం, తిరిగి మూయడం మాత్రం విని పించాయి.

అతను ముట్టుకుంటాడని ఊహించని నేను అలా కూర్చుండి పోయాను. ఇదీ అని చెప్పలేని భావనలు నాలో తుఫానులను రేపుతున్నాయి.

అందుకే ఇలాంటివి ప్రారంభించకూడదు. ఒక్కసారి ప్రారంభిస్తే అవి ఎక్కడ ఆగుతాయో ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేం.

మొదటిసారిగా నా భర్త కాక మరో మగవాడు నన్ను ముట్టుకున్నాడు. అది సంతోషమో, బాధో నాకు తెలియడం లేదు. ఆ రెండింటి మధ్య అంత తక్కువబేధం వుందని తెలియడం కూడా మొదటిసారే. అందుకే కాబోలు నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి.

చీకటి నన్ను చుట్టుకుంటున్నట్లే వుంది. అలా ఎంతసేపు కూర్చుండి పోయానో నాకే తెలియదు. పిల్లలిద్దరూ కింద నుంచి అరుస్తున్నారు. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లు ఠక్కున లేచి కిందకు వచ్చాను.

పిల్లలిద్దరికి త్వరత్వరగా భోజనాలు పెట్టి నిద్ర పుచ్చాను. నాకు మాత్రం ఆకలి వేయలేదు.
అలా బెడ్ మీద వాలిపోయాను.

చాలా కాలం తరువాత నేను బతికున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. మొత్తానికి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. మన అస్తిత్వం మనకి తెలియాలంటే బాధో, ఆనందమో వుండాలి. కానీ మన జీవితాలు ఎక్కువ రొటీన్ గా సాగిపోతుంటాయి. మనం జీవించి వున్నామన్న ఫీలింగ్ కలగదు. అందుకే చాలామందిలో జీవకళ వుండదు.

మా ఇద్దరి మధ్యా ఓ రహస్యం ప్రారంభమైపోయింది. ఈ రహస్యంలో నా భర్తకు గానీ, నా తల్లిదండ్రులకు గానీ మ్ నా స్నేహితులకిగానీ ఎవరికీ ఎలాంటి భాగమూ లేదు. నాకొక్క దానికే ఇది పరిమితం. దీన్ని ఎవరికీ చెప్పుకోలేమన్న నిజం తెలిశాక, మనకు కలిగిన ఆనందం మనకే పరిమితం అనిపించాక ఏదో అలవిగాని అమృత భాండాగారాన్ని గుండెల్లో దాచుకున్నట్లు ప్రతిక్షణం ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ప్రస్తుతం నేనూ అదే పరిస్థితిలో వున్నాను.

నాకు తెలియకుండానే నా ముంజేతిని పదే పదే చూసుకుంటున్నాను. అతను అలా ముద్దు పెట్టుకోవడాన్ని న్నెఉ ఇష్టపడుతున్నానో లేక అయిష్టపడుతున్నానో కూడా స్పష్టంగా తెలియడం లేదు.

ఇలాంటివి జరిగాక అతన్ని నేను ఏవిధంగా, ఎంత మేరకు కోరుకుంటున్నానో మనసుని డిటెక్షన్ చేసి తెలుసుకోవాలి. కాని చాలామందిలాగే నేనూ నాలోకి తొంగి చూసుకోవడానికి భయపడ్డాను.