నేను బాకీ వుంది ఆయనకే 3 76

అంతలో ట్రైన్ వచ్చింది. జనం బాగానే వున్నారు. అంతగా రష్ లేని కంపార్ట్ మెంట్ వెదికాను.

అప్పుడు వినిపించింది జయంత్ కంఠం. “ఏమండీ….. ఏమండీ ఎక్కడున్నారు?” అని అరుస్తున్నాడు. స్టేషన్ అంతా చీకటిగా వుండడం వల్ల మమ్మల్ని ట్రేస్ చేయలేకపోయాడు. పేగులు బయటొచ్చి పడతాయేమో నన్నంత బిగ్గరగా అరుస్తున్నాడు. గొంతు వినిపిస్తూ వుందే తప్ప మనిషి కనబడడం లేదు.

ఎప్పుడో గత జన్మలో తప్పిపోయిన మనిషి కోసం ఈ జన్మలో వెదుకుతున్నట్లు అతను అరుస్తున్నాడు.

వెంటనే ట్రైన్ నుంచి కిందకు దిగి కనిపించాలన్న తాపత్రయాన్ని బలవంతంగా అణుచుకున్నాను.

విజిల్ ఊదారు.

అతను మరింతగా కంఠాన్ని పెంచాడు. ఆ చీకట్లో నేను ఎక్కనున్నాడో తెలియక గింజకుపోతూ అరుస్తున్న అతను ఎలా పిచ్చి పట్టినట్టు స్టేషన్ లో తిరుగుతున్నాడో ఊహించాను. మనసంతా ఏదోలా అయిపోయింది.

కిందకు దిగుదామని కాళ్ళను కదిలిస్తున్నాను. కానీ లేవలేకపోయాను.

ట్రైన్ పెద్దగా కూత పెడుతూ కదిలింది. జయంత్ గొంతు రైలు కూతను మింగేయాలని చేస్తున్న ప్రయత్నం తెలుస్తూనే వుంది.

రైలు వేగం పుంజుకుంది.

ఇంత జరిగాక అన్నం సహిస్తుందనిగానీ, నిద్ర ముంచుకువస్తుందనిగానీ అనుకోలేదు. అన్యమనస్కంగానే పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టాను. ఇక ఎప్పుడూ ఇలా ఒంటరిగా వుండకూడదని నిర్ణయించుకున్నాను.

* * *

మరుసటిరోజు జయంత్ నేను ఊహిస్తున్నట్టే ఇంటికొచ్చాడు. అప్పుడే పిల్లలు స్కూలుకి వెళ్ళారు. ఏం చేద్దామా అనుకుంటూ వుండగానే వచ్చాడతను. ముఖంలో కళ తప్పింది. జ్వరం వచ్చి ఇంకా కోలుకోనట్లు వున్నాడు.

తెల్లటి ప్యాంటుమీద తెల్లటి ఖద్దరు చొక్కా లూజుగా వేలాడుతోంది. వంకీలు తిరిగిన జుట్టును మాత్రం శుభ్రంగా దువ్వుకున్నాడు. తన జుట్టు మీద అతనికి చాలా మోజు. అంత అందంగా జుట్టు చాలాకొద్ది మందికి మాత్రమే వుంటుందని అతని నమ్మకం. అది నిజం కూడా. అంత తపన లోనూ అతని జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడంటే తన జుట్టుమీద తనకెంత ఇష్టమో తెలుస్తూ ఉంది.

రాగానే నాకు మరింత దగ్గరగా నిలబడి “నిన్నరాత్రి మీకోసం రైల్వేస్టేషన్ లో ఎంతగానో వెదకాను. నా దురదృష్టం కొద్దీ స్టేషన్ లో కరంట్ లేదు. అప్పటికీ మీకోసం అరిచాను. కానీ మీకు వినిపించినట్టు లేదు ఎంతో నిరాశతో వెనక్కి వచ్చేశాను.

“ఎందుకు నన్ను వెదకడం?”

“మిమ్మల్ని చూడాలని.”

“ఎందుకు చూడడం?”

అతను జవాబు చెప్పలేకపోయాడు. ఏమని చెబుతాడు! అంత డైరెక్టుగా అడగకూడని ప్రశ్నలు అవి. వాటికి జవాబు హృదయస్పందనే. అది వినాలంటే ఎదుటి వ్యక్తి మనసును పరవాలి. అతను జవాబు చెప్ప కూడదనే అడిగాను.

“నాకు బజారులో అర్జంట్ పనుంది వెళ్ళాలి” అంటూ అతనివైపు చూడకుండా తాళం కప్ప అందుకున్నాను. బయటకొచ్చి తాళం వేశాను. అతనూ నా వెనకే బయల్దేరాడు.

“ఎందుకు నన్నిలా వెంబడించడం? నన్ను వెళ్ళనీ” నడక స్పీడు పెంచాను. అతను ప్రార్థించే స్థితికి చేరుకున్నాడు.