నేను బాకీ వుంది ఆయనకే 3 76

“ఈ తంతు జరిగేటప్పుడు చెప్పులు పెడతారుగదా చెప్పులు నాకొద్దు బూట్లు కావాలి. అవీ యాక్షన్ కంపెనీవి… లేసులుండాలి” అని కోరాడు.
నాకైతే అతని చెంపలు వాయించాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాను. ఇలాంటివాణ్ని ప్రేమించడం సాధ్యం కాని పని అందుకే చాలా జంటల్లో పెళ్ళి సంబంధమే కానీ ప్రేమబంధం వుండదు.

అన్నిటికీ నాన్న ఒప్పుకున్నాక నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. మరో ఇరవై రోజుల్లో వుండే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.

పెళ్ళికొడుకు వాళ్ళు ఉదయం వెళ్లగానే మా ఇంట్లో పెళ్ళి పనులు ప్రారంభమయ్యాయి.

పెళ్ళంటే వుండాల్సిన థ్రిల్ గానీ, పట్టలేని ఆనందంగానీ, లేవు. పైపెచ్చు ఏదో చెప్పలేని దిగులు నాలో పేరుకుపోయింది.

డబ్బు కోసం గడ్డి తినే ఆ మనుషుల మధ్య జీవితం మీద మమకారాన్ని పోగొట్టుకోకుండా ఎలా బతకాలాన్న ఆలోచనే నాకు. అందుకే పుట్టింటినుంచి ఆ అపురూపమైన కానుక నొకదానిని తీసుకువెళ్ళాలన్న కోరిక పుట్టింది. అయితే అదేమిటో నాకు బోధపడడం లేదు.

పెళ్ళి దగ్గర పడింది. పనులు చకచకా జరుగుతున్నాయి.

పెళ్ళి మరో వారం రోజులు వుండగా శుభలేఖలు వచ్చాయి. మొదటి శుభలేఖను తీసుకుని దానిమీద “ఫలానా రోజున నా పెళ్ళి అనీ, ఈలోగా ఓసారి వచ్చి కలవమనీ’ రాసి సుధీర్ కు పోస్టు చేశాను.

గోళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం, మ్యాచింగ్ బ్లౌజులు కుట్టుకోవడం, స్నేహితురాళ్ళకు శుభలేఖలు పంచడం, వస్తున్నా బంధువులను రిసీవ్ చేసుకోవడంతోనే సరిపోయింది కాలం.

మరుసటి రోజు తెల్లవారుజామున మా ఊరికి దగ్గరలోని వెంటకగిరిలోని ఓ సత్రంలో పెళ్ళి. అందువల్ల ఆరోజు సాయంకాలం నేను పెళ్ళికూతురై తరలి వెళ్ళాను.

సత్రం చేరుకునే సరికి సాయంకాలం ఏడయ్యింది. ఆడపెళ్ళి వారంతా అక్కడ సర్దుకున్నారు. మగపెళ్ళి వాళ్ళకోసం హోటల్లో గదులు బుక్ చేశారు. పెళ్ళికొడుకు తెల్లవారుజామున మూడుగంటలకు విడిది నుంచి బయల్దేరి వస్తారు. మధ్యలో దేవుడి పూజ తదితర ఘట్టాలున్నాయి.

రాత్రి పదిగంటల ప్రాంతాన భోజనం చేశాను. ఓ గదిలో పడుకున్నాను. రెండు గంటల ప్రాంతాన అమ్మలక్కలు వచ్చి లేపారు. ఇక స్నానం చేశాక నన్ను సింగారించడం ప్రారంభించారు. అలంకరణ పూర్తయ్యేసరికి తెల్లవారు జాము మూడయ్యింది. తామూ స్నానాలు చేసి తయారవుతామని చెప్పి అమ్మలక్కలంతా వెళ్ళిపోయారు.